రాయకుదురులో తొలి గ్రంథాలయం | Sakshi
Sakshi News home page

రాయకుదురులో తొలి గ్రంథాలయం

Published Tue, Nov 14 2023 1:04 AM

ఏలూరులో జిల్లా కేంద్ర గ్రంథాలయం  - Sakshi

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గ్రంథాలయాలు విజ్ఞాన దేవాలయాలు.. గతంలో స్వాతంత్య్ర పోరాటానికి, ఉద్యమ కార్యాచరణకు వేదికలుగా నిలిచి ఎంతోమందిని విప్లవ మార్గంలో నడిపి దేశానికి స్వాతంత్య్రం రావడంలో కీలక పాత్ర పోషించాయి. అనంతర కాలంలో సమాజానికి మంచి నేస్తాలుగా పనిచేశాయి. అక్షరాస్యత తక్కువగా ఉన్న నాటి కాలంలో ప్రజల్లో చదువుకు ఉన్న విలువలను తెలుపుతూ వారిలో పఠనాసక్తిని రేకెత్తిస్తూ ఎంతోమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో కూడా గ్రంథాలయాల పాత్ర ప్రశంసనీయమనే చెప్పాలి. ప్రస్తుతం గ్రంథాలయాలకు వెళ్ళే వారి సంఖ్య తగ్గుతున్నా వాటి ప్రాధాన్యత తగ్గలేదు. నేటి కాలంలో గ్రంథాలయాలు తమ ఉనికిని చాటుకుంటూ మారిన కాలానికి తగ్గట్టుగా సేవలను కూడా మార్చుకుంటూ వస్తున్నాయి. గతంలో కాలక్షేపానికి, పఠనాసక్తిని రేకెత్తించడానికి ఉపయోగపడిన గ్రంథాలయాలు నేడు విద్యార్థులను ఉన్నత ప్రమాణాలు కలిగిన విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్దడంలోను, ఉద్యోగార్థులకు విజయాలను అందించే జ్ఞాన దీపికలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా 56వ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభంకానున్నాయి.

వారం రోజులు ప్రత్యేక కార్యక్రమాలు

గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 14న ప్రారంభోత్సవాలతో పాటు బాలల దినోత్సవాలు నిర్వహించనున్నారు. 15న ఆయా గ్రంథాలయాల్లో పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేయడంతో పాటు మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు, పుస్తక పఠనం ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. 16న గ్రంథాలయోద్యమానికి విశేషంగా కృషి చేసిన ఎస్‌ఆర్‌ రంగనాథన్‌, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకట రమణయ్య తదితర ప్రముఖులకు నివాళి కార్యక్రమాలు ఉంటాయి. 17న రచయితల సందేశాలు, వివిధ అంశాలపై సదస్సులు, కవి సమ్మేళనాలు నిర్వహిస్తారు. 18న విద్యార్థులకు వక్తృత్వం, చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్‌, క్రీడా పోటీలు నిర్వహిస్తారు. 19న దిశ చట్టం, మహిళా సాధికారతపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 20న డిజిటల్‌ గ్రంథాలయాల వినియోగంపై ఓరియంటేషన్‌ కార్యక్రమం, స్వీయ పఠన కార్యక్రమం అనంతరం గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమాలు నిర్వహించి వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు.

జిల్లాలో 77 గ్రంథాలయాలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 77 గ్రంథాలయాలు, 89 పుస్తక పంపిణీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఏలూరులోని జిల్లా కేంద్ర గ్రంథాలయం, 5 ప్రథమ శ్రేణి గ్రంథాలయాలు, 2 ద్వితీయ శ్రేణి గ్రంథాలయాలు, 66 తృతీయ శ్రేణి గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో 58 గ్రంథాలయాలు సొంత భవనాల్లో ఉండగా 8 గ్రంథాలయాలు అద్దె లేని ఉచిత భవనాల్లో, మరో 8 గ్రంథాలయాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 74 గ్రంథాలయాల్లో 10,38,253 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఆయా గ్రంథాలయాల్లో 1,16,801 మంది సభ్యులున్నారు. ప్రతీ రోజూ 5,573 పుస్తకాలను పాఠకులు ఇళ్ళకు తీసుకువెళ్ళి చదువుతున్నారు. గ్రంథాలయా లను ప్రతీ రోజూ సుమారు 15,330 మంది పాఠకులు సందర్శిస్తున్నారు. ఈ–గ్రంథాలయ సాఫ్ట్‌వేర్‌ ద్వారా పుస్తకాలు డిజిటలైజేషన్‌ చేసి ఆన్‌లైన్‌ ద్వారా సభ్యులకు పుస్తకాలు ఇళ్లకు ఇస్తున్నారు. గ్రంథాలయానికి వచ్చిన పాఠకులకు ఫ్రీ ఆన్‌లైన్‌ సర్వీస్‌, బ్రిటిష్‌ ఇండియా డిజిటల్‌ లైబ్రరీ సర్వీస్‌ ద్వారా పుస్తకాలను ఆన్‌లైన్‌లో చదివే సౌకర్యం కల్పించారు. విద్యార్థులకు, పోటీ పరీక్షలు రాసేవారికి అనువుగా ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించారు.

నిధులు మంజూరు : గ్రంథాలయ వారోత్సవాలు విజయవంతంగా నిర్వహించడానికి జిల్లా గ్రంథాలయ సంస్థ నిధులు మంజూరు చేసింది. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి రూ.35 వేలు, ప్రధాన మున్సిపాలిటీల్లో ఉన్న ప్రథమ శ్రేణి గ్రంథాలయాలకు రూ.15 వేలు చొప్పున, మున్సిపాలిటీల్లో ఉన్న ద్వితీయ శ్రేణి గ్రంథాలయాలకు రూ.11 వేలు చొప్పున నిధులు మంజూరు చేశారు. వీటితో పాటు మున్సిపాలిటీల్లో లేని ద్వితీయ శ్రేణి గ్రంథాలయాలకు రూ.8 వేలు చొప్పున, మండల కేంద్రాల్లో ఉన్న తృతీయ శ్రేణి గ్రంథాలయాలకు రూ.6 వేలు చొప్పున, మండల హెడ్‌ క్వార్టర్స్‌లో లేని తృతీయ శ్రేణి గ్రంథాలయాలకు రూ.5 వేల చొప్పున నిధులు మంజూరు చేశారు. వీటితో ఆహ్వానపత్రాలు ముద్రించుకోవడం, ఫ్లెక్సీలు, బ్యానర్లకు వినియోగించడం, మైక్‌సెట్టుకు, ఫొటోలకు, వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులుగా ఇచ్చే పుస్తకాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

నేటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

వారం పాటు ప్రత్యేక కార్యక్రమాలు

విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు

నిధులు మంజూరు చేసిన గ్రంథాలయ సంస్థ

వీరవాసరం: గ్రంథాలయోధ్యమ స్ఫూర్తితో కాళ్లకూరి నరసింహం తన అమ్మమ్మ ఊరు వీరవాసరం మండలం రాయకుదురులో 1894లో జిల్లాలోనే తొలిసారిగా సుజ్ఞానంద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 100 మంది సభ్యులతో 24 పత్రికలు 2,659 గ్రంథాలు, పుస్తకాలతో ప్రారంభమైన రాయకుదురు గ్రంథాలయం 1967లో జిల్లా గ్రంథాలయ సంస్థ పరమైంది. పాత గ్రంథాలయ భవనం శిథిలమవడంతో దివంగత ధూళిపాళ వేణుగోపాలకృష్ణమూర్తి ఆధ్వర్యంలో నూతన భవనాన్ని నిర్మించారు. ఇక్కడ పురాతన గ్రంథాలు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. ప్రస్తుతం 808 మంది సభ్యులతో 22 పత్రికలు, 15,226 పుస్తకాలతో సేవలందిస్తోంది. గత ఏప్రిల్‌లో గ్రంథాలయంలో ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించారు. గంటలకు రూ.5 చెల్లించి ఇంటర్నెట్‌ వినియోగించుకోవచ్చు.

రాయకుదురులోని గ్రంథాలయం
1/1

రాయకుదురులోని గ్రంథాలయం

Advertisement
Advertisement