హైరిస్క్‌ గర్భిణులపై ప్రత్యేక దృష్టి | Sakshi
Sakshi News home page

హైరిస్క్‌ గర్భిణులపై ప్రత్యేక దృష్టి

Published Fri, Mar 29 2024 1:35 AM

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షణ్మోహన్‌    - Sakshi

చిత్తూరు రూరల్‌: హైరిస్క్‌ గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించి, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఓ రవిరాజు ఆదేశించారు. నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం ఇంటిగ్రేటెడ్‌ హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ ట్రాకింగ్‌ మేనేజ్‌మెంట్‌ అనే అంశంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దీనికి అన్ని ఆస్పత్రుల్లోని గైనికాలజిస్ట్‌, వైద్యాధికారులు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ ఫలితంగా ప్రభుత్వ వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలన్నారు. గర్భిణులను ఎప్పటికప్పుడు పరీక్షించి వైద్య సేవలు అందించాలని చెప్పారు. మాతా శిశు మరణాల సంఖ్యను తగ్గించేందుకు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు ఉషశ్రీ, మీనా సయ్యద్‌, జానకీ రావ్‌, శిరీష తదితరులు పాల్గొన్నారు.

ఐదు ఫిర్యాదుల పరిష్కారం

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా మోడల్‌ కోడ్‌కు వ్యతిరేకంగా అందిన 5 ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించారు. ఈ మేరకు జిల్లా ఎంసీసీ నోడల్‌ అధికారి మురళీకృష్ణ గురువారం జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్‌కు నివేదికలు పంపారు. జిల్లాలోని గంగాధరనెల్లూరు, కుప్పం నియోజకవర్గాల్లో నమోదైన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆయా ఆర్‌ఓల నుంచి నివేదికలను సేకరించారు. అనంతరం ఫిర్యాదులను పరిష్కరించినట్లుగా ఆ నివేదికలను జిల్లా ఎన్నికల అధికారికి అందజేశారు.

మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా మే 1వ తేదీ నుంచి వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ మే 1 నుంచి 31వ తేదీ వరకు శిక్ష శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 50 శిక్షణ శిబిరాల నిర్వహణకు రాష్ట్ర క్రీడాభివృద్ధి అధికారులు అనుమతులు ఇచ్చారని తెలిపారు. శిక్షణ శిబిరాలకు క్రీడా సామగ్రి అందజేస్తామన్నారు. వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న పీడీలు, పీఈటీలు, సీనియర్‌ క్రీడాకారులు ఏప్రిల్‌ 6వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తులను dsa. ctr@rediffmail. com మెయిల్‌కు పంపాలని ఆయన వెల్లడించారు.

ఓటింగ్‌పై అవగాహనకు పోస్టర్ల ఆవిష్కరణ

చిత్తూరు కలెక్టరేట్‌ : ఓటు వినియోగంపై అవగాహనకు ముద్రించిన పోస్టర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షణ్మోహన్‌ ఆవిష్కరించారు. కలెక్టరేట్‌లో గురువారం పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఓటు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటు ప్రత్యేకతను తెలిపేందుకు ప్రత్యేకంగా పోస్టర్లను ముద్రించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఓటు ప్రాధాన్యతను వివరించే కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్‌ఓ, జేసీ శ్రీనివాసులు, డీఆర్‌ఓ పుల్లయ్య, ఎన్నికల విభాగం సిబ్బంది ఉమాపతి, మనోజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ట్రాన్స్‌ఫార్మర్లకు

సకాలంలో మరమ్మతులు

చిత్తూరు కార్పొరేషన్‌: ట్రాన్స్‌ఫార్మర్లు సకాలంలో మరమ్మతు చేయాలని ట్రాన్స్‌ఫార్మర్‌ విభాగం ఈఈ మహేశ్వరరెడ్డి డీఈ ఆనంద్‌ను ఆదేశించారు. గురువారం ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటలు, పట్టణ ప్రాంతాల్లో 24 గంటల్లో ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతు చేసి పంపాలన్నారు. ఎండలు పెరుగుతుండడంతో వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు ఎక్కువగా కాలిపోతుంటాయని చెప్పారు. వాటిని సకాలంలో బాగుచేయాలని సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు.

శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఓ రవిరాజు
1/1

శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఓ రవిరాజు

Advertisement
Advertisement