సెప్టెంబర్ లో 44.4 బిలియన్ డాలర్లు
30.21 బిలియన్ డాలర్లకు తగ్గిన వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్రక్టానిక్ గూడ్స్, కెమికల్స్ దన్నుతో దేశ ఎగుమతులు భారీగా జంప్ చేశాయి. సెప్టెంబర్లో 23.04 శాతం ఎగబాకి 44.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో ఎగుమతులు 36.08 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కాగా, దిగుమతులు 8 శాతం పెరిగి 74.61 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో సెప్టెంబర్ లో వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) 30.21 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గతేడాది సెప్టెంబర్ లో 33 బిలియన్ డాలర్ల లోటుతో పోలిస్తే తగ్గింది. అయితే, ఈ ఏడాది ఆగస్టులో 26.86 బిలియన్ డాలర్లతో పోలిస్తే పెరగడం గమనార్హం.
గణాంకాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
⇒ క్రూడాయిల్ దిగుమతులు 30.74 శాతం ఎగసి 18.34 బిలియన్ డాలర్లకు చేరాయి. గడిచిన కొద్ది వారాలుగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 100 డాలర్లకు పైనే కదలాడుతున్న సంగతి తెలిసిందే.
⇒ పెట్రో ఉత్పత్తుల ఎగుమతులు 31.9% ఎగసి 6.2 బిలియన్ డాలర్లను తాకాయి. ఎల్రక్టానిక్ గూడ్స్ 70.44% వృద్ధితో 5.3 బిలియన్ డాలర్లుగా, కెమికల్స్ 24.21% పెరిగి 3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
⇒ ఈ ఆర్థిక సంవత్సరం (2026–27) ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో ఎగుమతులు 18.51 శాతం వృద్ధితో 259.89 బిలియన్ డాలర్లకు పెరిగాయి. దిగుమతులు 16.31 శాతం ఎగసి 437.53 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు 177.64 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
⇒ ఇక సర్వీసుల ఎగుమతుల విషయానికొస్తే, ఈ ఏడాది సెప్టెంబర్ లో 36.35 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతులు 19.44 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
బంగారం, వెండి దిగుమతులు డౌన్
సెప్టెంబర్ లో బంగారం దిగుమతులు 81.27 శాతం దిగజారి 1.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇక వెండి దిగుమతులు 49.11 శాతం క్షీణించి 665 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వరుసగా రెండో నెలలోనూ ఈ విలువైన లోహాల దిగుమతులు పడిపోవడం గమనార్హం. ఈ ఏడాది మే 13 నుంచి కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచడం ప్రభావం చూపుతోంది.
ఈ ఏడాది 500 బిలియన్ డాలర్ల పైకి..
ప్రస్తుత వృద్ధి జోరు చూస్తుంటే దేశ వస్తూత్పత్తుల ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరంలో 500 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించవచ్చు. 2025–26లో ఇవి 442 బిలియన్ డాలర్లు. పశి్చమాసియా సంక్షోభం దెబ్బకు క్రూడ్ సెగతో కొన్ని దేశాలకు సర్వీసుల ఎగుమతులు ముఖ్యంగా ట్రావెల్, టూరిజం రంగంపై ప్రభావం చూపాయి. – రాజేశ్ అగర్వాల్, వాణిజ్య శాఖ కార్యదర్శి


