న్యూఢిల్లీ: దేశంలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న వారిలో నిరుద్యోగ రేటు (యూఆర్) సెప్టెంబర్ లో 5 శాతంగా నమోదైంది. ఆగస్టులో నమోదైన 5 శాతంతో పోలిస్తే ఇది స్థిరంగా ఉందని కేంద్ర గణాంకాలు కార్యాలయం (ఎన్ఎఎస్) తెలిపింది. కాగా, గత ఏడాది(2025) సెప్టెంబరులో నిరుద్యోగ రేటు 5.2 శాతంతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. ఎన్ఎస్ఓ విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) ప్రకారం...
గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 4.1 శాతం నుంచి సెప్టెంబర్లో 4.2 శాతానికి స్వల్పంగా పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో 6.8 శాతం నుంచి నుంచి 6.9 శాతానికి చేరింది. అయితే, గతేడాది 2025 సెపె్టంబర్తో పోలిస్తే గ్రామీణ నిరుద్యోగ రేటు 4.6 శాతం తగ్గగా, పట్టణ ప్రాంతాల్లో యూఆర్ 6.8 శాతం దాదాపు స్థిరంగా ఉంది.
పురుషుల్లో నిరుద్యోగ రేటు సెప్టెంబర్ 4.9 శాతం స్థిరంగా కొనసాగింది. మహిళల్లో మాత్రం ఆగస్టులోని 5.1 శాతం నుంచి 5.2 శాతానికి స్వల్పంగా పెరిగింది. గ్రామీణ మహిళల్లో నిరుద్యోగ రేటు 3.9 శాతానికి తగ్గి, ఈ ఏడాదిలో కనిష్ట స్థాయికి దిగొచ్చింది. పట్టణ మహిళల్లో ఈ రేటు 8.9 శాతం నుంచి 9.2 శాతానికి పెరిగింది. మొత్తంగా చూస్తే, గత ఏడాదితో పోలిస్తే పురుషులతో పాటు మహిళలు నిరుద్యోగ రేటు తగ్గింది.
దేశంలో శ్రామిక శక్తి భాగస్వామ్యం, ఉపాధి, నిరుద్యోగ పరిస్థితులకు సంబంధించిన వివరాల సేకరణలో ‘ఎన్ఎస్వో’ నిర్వహిస్తున్న ‘పీఎల్ఎఫ్ఎస్’ సర్వేనే ప్రాథమిక ఆధారంగా ఉంది. దేశంలో లేబర్ ఫోర్స్ సూచీలకు సంబంధించి ప్రతి నెలా, ప్రతి త్రైమాసికంలో గణాంక అంచనాలను అందించేందుకు వీలుగా 2025 జనవరిలో ఈ పీఎల్ఎఫ్ఎస్ సర్వే పద్ధతిలో సవరణలు చేశారు. దేశవ్యాప్తంగా 3,70,513 మంది నుంచి సేకరించిన సమాచారంతో సెప్టెంబరు గణాంకాలను రూపొందించారు.
మొత్తం శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్పీఆర్) సెప్టెంబరులో 55.5 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 0.2 శాతం పాయింట్లు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు ఆగస్టులోని 50.4 శాతం నుంచి 50.7 శాతానికి చేరింది. మహిళల మొత్తం ఎల్ఎఫ్పీఆర్ ఏడాది ప్రాతిపదికన 0.5 శాతం పాయింట్లు పెరిగి 34.6 శాతానికి చేరింది. గ్రామీణ మహిళల్లో ఇది ఒక శాతం పాయింటు వృద్ధితో 38.9 శాతంగా నమోదైంది. మొత్తం కార్మిక–జనాభా నిష్పత్తి (డబ్ల్యూపీఆర్) గత ఏడాదితో పోలిస్తే 0.3 శాతం పాయింట్లు పెరిగి 52.7 శాతానికి చేరింది.


