చంద్రబాబుకు ప్రజాబలం లేదు.. పోలీసు బలమే: కన్నబాబు ఫైర్‌ | YSRCP Kannababu Satirical Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ప్రజాబలం లేదు.. పోలీసు బలమే: కన్నబాబు ఫైర్‌

Oct 14 2026 1:27 PM | Updated on Oct 14 2026 1:43 PM

YSRCP Kannababu Satirical Comments On Chandrababu

సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పుతో గెలిచే నమ్మకం లేకే చంద్రబాబు ప్రభుత్వం పోలీసు బలాన్ని నమ్ముకుంటోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను బెదిరిస్తూ, కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా నామినేషన్లకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లు, వార్డుల విభజన నుంచి పోలీసుల వ్యవహారశైలి వరకు అనేక అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి కురసాల కన్నబాబు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. క్వాంటం కంప్యూటింగ్‌ గురించి మాట్లాడే చంద్రబాబు.. అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే యాప్‌ను కూడా సక్రమంగా పనిచేయించలేరా? అని కన్నబాబు ప్రశ్నించారు. అభ్యర్థులకు 24 గంటల్లో ధ్రువీకరణ పత్రాలు అందేలా మాన్యువల్‌ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. పాత కేసులను తిరగదోడి బైండోవర్ల పేరుతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు. ఉదయం పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి రాత్రి వరకు కూర్చోబెట్టడం రాజకీయ వేధింపులు కాదా? అని నిలదీశారు. ఎన్నికల్లో పోటీ చేస్తే వ్యాపారాలను దెబ్బతీస్తామని అభ్యర్థులను బెదిరిస్తున్నారని విమర్శించారు.

అధికార దుర్వినియోగానికి పాల్పడే పోలీసు అధికారులపై న్యాయపోరాటం చేస్తామని కన్నబాబు హెచ్చరించారు. ఎన్నికల ఫిర్యాదులపై 24 గంటల్లో చర్యలు తీసుకునేలా సింగిల్‌ విండో వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. పోలింగ్‌ నుంచి కౌంటింగ్‌ వరకు నిరంతర వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించాలని, సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించాలని డిమాండ్‌ చేశారు. బైండోవర్ల పేరుతో ప్రతిపక్ష కార్యకర్తలను వేధించడం తక్షణమే ఆపాలని అన్నారు. రాష్ట్రంలో అక్రమ మద్యం ప్రవాహాన్ని అరికట్టేందుకు ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని కోరారు.

రిజర్వేషన్లు, వార్డుల విభజనపై ప్రశ్నలు
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను రాత్రికి రాత్రే మార్చడం వెనుక ఉన్న ప్రయోజనాలేమిటని కన్నబాబు ప్రశ్నించారు. రిజర్వేషన్లకు ప్రాతిపదిక ఏమిటో ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఒక వార్డులో 30వేల ఓట్లు, మరో వార్డులో కేవలం 5వేల ఓట్లు ఉండేలా విభజన చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యం కోసమే వార్డులను విభజించారా? లేక అధికార పార్టీ గెలుపు కోసమా? అని నిలదీశారు. రిజర్వేషన్ల నుంచి వార్డుల విభజన వరకు వివరాలను వెల్లడించపోవడమేంటి? ఇదేనా పారదర్శక పాలన అంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు.

దసరా పూజల్లో ప్రజలు నిమగ్నమై ఉన్న సమయంలో ఎన్నికల ప్రక్రియను హడావుడిగా ముగించాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయకుండా ఎన్నికల్లో గెలవడానికి కుట్రలకు తెరతీస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇప్పుడు పోలీసులను నమ్ముకుని ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. ఇన్ని ప్రయత్నాలు చేసి గెలిచినా అది నైతిక విజయమవుతుందా? అని ప్రశ్నించారు.

ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సిద్ధం..
చంద్రబాబుకు ఉన్నది ప్రజాబలం కాదని, ప్రచార బలం, పోలీసు బలమేనని కన్నబాబు వ్యాఖ్యానించారు. ఆయన బెదిరింపులకు భయపడే కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో లేరన్నారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో స్థానిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతి వార్డులో, ప్రతి స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఎన్నికలంటే వైఎస్సార్‌సీపీకి భయం లేదని, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలన్నదే తమ డిమాండ్‌ అని కన్నబాబు పేర్కొన్నారు. పోలీసు బలంతో కాకుండా ప్రజాబలంతో గెలిచి చూపించాలని చంద్రబాబుకు సవాల్‌ విసిరారు.

ఇదీ చదవండి: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement