దర్యాప్తు దశలో ‘స్టే’ వద్దు

Do Not stay During The Investigation Phase - Sakshi

ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవటం సరికాదు

అసాధారణ పరిస్థితుల్లో తప్ప అలా చేయకూడదు..75 ఏళ్లుగా సర్వోన్నత న్యాయస్థానం చెబుతున్నదిదే

ఇటీవల పలు దర్యాప్తులపై ‘స్టే’ ఇచ్చిన హైకోర్టు.. సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలో న్యాయవర్గాల్లో చర్చ

సాక్షి, అమరావతి  కేసు నమోదు, దర్యాప్తు చేయడం పోలీసుల పరిధిలోని అంశాలు. న్యాయవ్యవస్థ ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా ముఖ్యం. కాగ్నిజబుల్‌ నేరాల్లో న్యాయస్థానం అనుమతి లేకుండా దర్యాప్తు చేసే హక్కు పోలీసులకుంది. 
– కింగ్‌ ఎంపరర్‌ వర్సెస్‌ ఖ్వాజా అహ్మద్‌ (1945)
 
నేరంపై దర్యాప్తు జరపడం పోలీసులకు సంబంధించింది. దర్యాప్తులో నేరం చేసినట్లు తేలితే, ఆ నేరం చేసినట్లు రుజువు చేయాల్సిన బాధ్యత కూడా పోలీసులదే. ఇందులో న్యాయస్థానాల జోక్యానికి ఆస్కారమే లేదు. 
– స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ వర్సెస్‌ జేఏసీ సల్దాన (1979) 

శాంతిభద్రతల పరిరక్షణలో దర్యాప్తు అధికారిదే కీలక పాత్ర. నేరానికి సంబంధించిన ఆధారాలను సేకరించే స్వేచ్ఛను పోలీసులకు న్యాయస్థానాలివ్వాలి. 
– స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ వర్సెస్‌ పీపీ శర్మ (1991) 
 

నేరాలపై దర్యాప్తు చేయడం దర్యాప్తు అధికారుల పరిధిలోని అంశం. అత్యంత అరుదైన కేసుల్లో తప్ప కోర్టులు దర్యాప్తులో ఏవిధంగానూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. నేరస్తుల విచారణ, సమాధానాలు రాబట్టడం, అవి సంతృప్తికరంగా ఉన్నాయా.. తప్పుదోవ పట్టించేలా ఉన్నాయా? అనేవి దర్యాప్తు సంస్థ పరిధిలోనివి.  
– పి.చిదంబరం వర్సెస్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (2019) 

అమరావతి భూకుంభకోణంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు వంటివి గతంలో ఎన్నడూ ఇవ్వలేదు. అత్యంత అరుదైన కేసుల్లోనే జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులిచ్చింది. ఇలాంటి కేసుల్లో ఉత్తర్వులిచ్చేటప్పుడు న్యాయస్థానాలు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే సామాన్యులు మాకొక న్యాయం, వారికొక న్యాయమా? అని ప్రశ్నించే పరిస్థితి వస్తుంది.  
– ఎల్‌.రవిచందర్, సీనియర్‌ న్యాయవాది, హైకోర్టు 
 
దర్యాప్తు చేయడానికి ముందు, దర్యాప్తు కీలక దశలో ఉండగా స్టే ఇవ్వడాన్ని అసాధారణంగానే భావించాలి. దర్యాప్తు సంస్థలను వాటి పని వాటిని పనిచేసుకోనివ్వాలి. ప్రత్యేక పరిస్థితుల్లోనే కోర్టులు జోక్యం చేసుకోవాలి.  
– గండ్ర మోహనరావు, న్యాయవాది 
 
దర్యాప్తును ఆపడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పింది. ఫిర్యాదు ఇచ్చినప్పుడు దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు తెలుస్తాయి. ఫిర్యాదులో చేసిన ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉందో తేల్చాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.  
– చిత్తరవు నాగేశ్వరరావు, సీనియర్‌ న్యాయవాది 

ఇవేకాదు. నిర్మల్‌జీత్‌సింగ్‌ హూన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పశ్చిమ బెంగాల్‌ (1972), స్టేట్‌ ఆఫ్‌ పశ్చిమ బెంగాల్‌ వర్సెస్‌ సుజిత్‌కుమార్‌ రాణా (2004), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వర్సెస్‌ అరుణ్‌ కుమార్‌ భజోరియా (1997) సహా ఎన్నో కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం ఇదే విషయాన్ని పదేపదే ఉద్ఘాటిస్తూ వస్తోంది. నిన్నగాక మొన్న రాజధాని భూములకు సంబంధించిన ఓ కేసులో కూడా ఇలాంటి ఉత్త్తర్వులే ఇచ్చింది. “దర్యాప్తు పోలీసుల పరిధిలోని వ్యవహారం. ప్రాథమిక స్థాయిలోనే దర్యాప్తును న్యాయస్థానాలు అడ్డుకోవడానికి వీల్లేదు’ అని పేర్కొంది. ఇటీవల కొన్ని కేసుల్లో... ప్రాథమిక దశలోనే ఎఫ్‌ఐఆర్‌లపై, అరెస్టులపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

దీనిపై న్యాయవర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. “్ఙ75 ఏళ్లుగా ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలిస్తూనే ఉంది. దర్యాప్తు దశలో కోర్టుల జోక్యం తగదని చెబుతూనే ఉంది. మళ్లీ మళ్లీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కనకే మళ్లీ మళ్లీ సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని చెబుతోంది’’ అని రిటైర్డు న్యాయమూర్తి ఒకరు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇటీవల హైకోర్టులో ఇలాంటి ఉత్తర్వులు వచ్చిన కేసుల్ని ఒకసారి చూస్తే... 
 

  • తుళ్లూరు భూముల కేసులో అప్పటి తహసీల్దార్‌ సుధీర్‌బాబుపై సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. దీన్ని కొట్టేయాలని ఆయన మార్చి 23న హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఆ మరుసటి రోజే తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా స్టే ఇవ్వడాన్ని ప్రాథమికంగా తప్పుపడుతూ కేసును వారంలో తేల్చాలని హైకోర్టుకు సూచించింది. 
  • విజయవాడలోని రమేశ్‌ ఆస్పత్రి ఓ హోటల్లో నిర్వహిస్తున్న కోవిడ్‌ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగి పదిమంది మరణించారు. పోలీసుల దర్యాప్తునకు సహకరించకుండా పారిపోయిన రమేశ్‌ ఆస్పత్రి చైర్మన్‌ రమేశ్‌బాబు తనపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ దొనడి రమేశ్‌... కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేశారు. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించింది.  
  • గత ప్రభుత్వ హయాంలో అవినీతిని వెలికితీసేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అమరావతి భూముల కొనుగోళ్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టులో అవినీతి జరిగాయని అన్ని ఆధారాలతో ఇది నివేదిక ఇచ్చింది. దీంతో ప్రభుత్వం సిట్‌ను వేసింది. సిట్‌ కేసు నమోదు చేయడానికి ముందే.. టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ వీటి ఏర్పాటును సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీంతో హైకోర్టు.. మంత్రివర్గ ఉపసంఘం, సిట్‌ జీవోల్లో తదుపరి చర్యలన్నీ నిలిపేసింది.  
  • అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేయడానికి ముందే.. మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసి తనను అరెస్ట్‌ చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ఆ మర్నాడు ఉదయమే ఏసీబీ అటు దమ్మాలపాటి, సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జి ఇద్దరు కుమార్తెలతోపాటు మరికొందరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. దీనిపై అప్పటికప్పుడు విచారణ జరిపిన సీజే జస్టిస్‌ జేకే మహేశ్వరి.. నిందితులెవరినీ అరెస్ట్‌ చేయొద్దని, కేసు వివరాలను మీడియాలో రాయవద్దని పేర్కొంటూ గ్యాగ్‌ ఉత్తర్వులిచ్చారు.  
  • రిటైర్డ్‌ లెక్చరర్‌ను మోసం చేసిన కేసులో దమ్మాలపాటి, ఆయన భార్య, బావమరిది నన్నపనేని సీతారామరాజు తదితరులపై మంగళగిరి పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై హైకోర్టు స్టే ఇచ్చింది. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరుతూ సీతారామరాజు గత నెల 28న పిటిషన్‌ వేయగా 29నే తదుపరి చర్యలన్నీ మూడు వారాలపాటు నిలిపేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top