ఎన్నికల పరిశీలకులకు ఎస్ఈసీ సూచన
జిల్లాల ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్ అధికారుల నియామకం
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా, క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని (కోడ్‌ను) పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్‌చంద్ర పునేఠ సూచించారు. ఆయన 28 జిల్లాలకు ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులను నియమించారు. అనంతరం ఆయన వారితో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అనుసరించే విధానాలను స్థానిక సంస్థల ఎన్నికల్లోను పాటించాలని చెప్పారు. రాజకీయ ప్రతినిధులు కోడ్ ఉల్లంఘించకుండా నిరంతరం పర్యవేక్షించాలని, నిబంధనల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోల్ మేనేజ్మెంట్ యాప్
ఎన్నికల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు పోల్ మేనేజ్మెంట్ యాప్‌ను రూపొందించినట్లు చెప్పారు. ఈ యాప్‌లో పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల నిర్వహణ విధానాలు తదితర సమాచారాన్ని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అభ్యర్థుల నుంచి ఓటుహక్కును వినియోగించుకునే సామాన్య పౌరుల వరకు అందరికీ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
జిల్లాల వారీగా ఎన్నికల పరిశీలకుల నియామకం
పల్నాడు జిల్లాకు కె.కన్నబాబు, కృష్ణా జిల్లాకు ఎంఎం నాయక్, మార్కాపురం జిల్లాకు సీహెచ్.శ్రీధర్, పశ్చిమ గోదావరి జిల్లాకు ఎంవీ శేషగిరిబాబు, బాపట్ల జిల్లాకు కేవీఎన్ చక్రధర్‌బాబు, ప్రకాశం జిల్లాకు హెచ్.రాణి, ఏలూరు జిల్లాకు మనాజిర్ జిలానీ సమూన్డెనీ, ఎన్టీఆర్ జిల్లాకు ఎస్.నాగలక్ష్మి, వైఎస్సార్ కడప జిల్లాకు పి.రంజిత్‌బాషా, చిత్తూరు జిల్లాకు శివశంకర్ లోతేటి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు పి.ప్రశాంతి, గుంటూరు జిల్లాకు సగిలి షణ్మోహన్, తూర్పు గోదావరి జిల్లాకు ఎం.గౌతమి, శ్రీసత్యసాయి జిల్లాకు పి.అరుణ్‌బాబు, అనంతపురం జిల్లాకు కె.శ్రీనివాసులు, కాకినాడ జిల్లాకు బి.లావణ్యవేణి, నెల్లూరు జిల్లాకు ఎస్.భార్గవి, నంద్యాల జిల్లాకు జె.వెంకటమురళి, పోలవరం జిల్లాకు చేతన్ టీఎస్, అల్లూరి సీతారామరాజు జిల్లాకు రోణంకి కూర్మనాథ్, అనకాపల్లి జిల్లాకు గోపాలకృష్ణ రోణంకి, అన్నమయ్య జిల్లాకు ప్రవీణ్ ఆదిత్య సీవీ, విజయనగరం జిల్లాకు ఎన్.తేజ్‌భరత్, కర్నూలు జిల్లాకు బి.శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లాకు ఎస్.చిన్నరాముడు, శ్రీకాకుళం జిల్లాకు మల్లవరపు సూర్యతేజ, తిరుపతి జిల్లాకు మామిడిపల్లి వరప్రసాద్, విశాఖపట్నం జిల్లాకు గీతాంజలిశర్మ, రిజర్వ్ పరిశీలకులుగా జి.వీరపాండియన్, శోబిక ఎస్ఎస్ నియమితులయ్యారు.


