ఒకే దశ పోలింగ్‌ వద్దు | anchayat elections in three phases | Sakshi
Sakshi News home page

ఒకే దశ పోలింగ్‌ వద్దు

Oct 9 2026 5:34 AM | Updated on Oct 9 2026 5:34 AM

anchayat elections in three phases

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న అనిల్‌చంద్ర పునేఠ తదితరులు

మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండేసి విడతల్లో నిర్వహించండి 

వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు కలెక్టర్లు, ఎస్పీలు విజ్ఞప్తి 

ఆ ప్రతిపాదనను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్న ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠ 

మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు

సాక్షి, అమరావతి: శాంతిభద్రతల సమస్యలతో పాటు ఎన్నికల ఏర్పాట్లలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అన్ని మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్లకు ఒకేరోజు పోలింగ్‌ కాకుండా రెండు దశల్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సూచించారు. అదే మాదిరిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా రెండు దశల్లో నిర్వహించాలని కోరారు. 

స్థానిక సంస్థల ఎన్నికలకు జరుగుతున్న ఏర్పాట్లతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో పాటు జెడ్పీ సీఈఓలు, డీపీఓలు, నగర మున్సిపల్‌ కమిషనర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కృష్ణతేజ, మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ సంపత్‌కుమార్‌ కూడా పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయినట్లు చెప్పిన కలెక్టర్లు, ఎస్పీలు.. ఒక్క దశలోనే ఎన్ని కలు నిర్వహిస్తే వచ్చే ఇబ్బందులను వివరించారు. 

రెండు దశల్లో 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు జరపండి
రాష్ట్రంలో 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు ఉండగా.. ప్రస్తుతం 13 కార్పొరేషన్లతో పాటు 87 మున్సిపాలిటీల్లోనే కొత్తగా వార్డుల విభజన జరిగి ఓటర్ల జాబితాలు, పోలీసు కేంద్రాల గుర్తింపు వంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిగిలిన 23 చోట్ల కోర్టు కేసుల కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడ్డాయి. అయితే, వాటిలోని 20 చోట్ల కోర్టు ఇబ్బందులు తొలగడంతో వాటిల్లో కూడా ఈనెల 17 కల్లా వార్డుల విభజన ప్రక్రియ పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లు పూర్తయిన వంద మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించి, మిగిలిన 20 చోట్ల రెండు నెలల తర్వాత మరో విడతలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. 

అయితే, 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణ రెండు దశల్లో జరపాలని కొందరు కలెక్టర్లు గురువారం నాటి సమావేశంలో కోరారు. ఎందుకంటే.. ఇతర అన్ని జిల్లాల కన్నా వైఎస్సార్‌ కడప జిల్లాలో అత్యధికంగా కార్పొరేషన్, మున్సిపాలిటీలన్నీ కలిపి మొత్తం తొమ్మిది వరకు ఉండడంతో ఒకేరోజు ఎన్నికతో శాంతిభద్రతల సమస్యతో పాటు ఏర్పాట్లలో ఇబ్బందులు పడాల్సి ఉంటుందని వారు ఎన్నికల కమిషనర్‌కు ఉదహరించారు. అలాగే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ శాంతిభద్రతల ఇబ్బందులు తలెత్తకుండా ప్రతీ జిల్లాలో రెండో దశల్లో ఎన్నికలు జరపాలని ఐదు జిల్లాల ఎస్పీలు కోరారు.  

మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు 
మరోవైపు.. గ్రామ పంచాయతీల ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. దీంతో.. గతంలో ఒక రెవిన్యూ డివిజన్‌ పరిధిలోని గ్రామ పంచాయతీలన్నింటికీ ఒకరోజు నిర్వహించేలా కాకుండా.. మండలం మొత్తానికి ఒకరోజు ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో అన్ని మండలాలను మూడుగా వర్గీకరించి కలెక్టర్లు ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కోరారు. 

ఇక మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత 15వ రోజు పోలింగ్‌ పూర్తిచేసి, డిప్యూటీ మేయర్, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలను 25వ రోజుకల్లా పూర్తికి ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్‌ఈసీ సూచించారు. అలాగే, మండల పరిషత్‌ అధ్యక్ష, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నికలను నోటిఫికేషన్‌ జారీచేసిన 26 రోజుల్లోపు.. సర్పంచి ఎన్నికలను నోటిఫికేషన్‌ తర్వాత 15 రోజుల్లో పూర్తిచేయనున్నట్లు ఎస్‌ఈసీ ఆయా జిల్లాల జెడ్పీ సీఈఓ, డీపీఓలకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement