ఆ స్కానింగ్‌ మిషన్‌ లక్ష్మీకాంతమ్మదే | Sakshi
Sakshi News home page

ఆ స్కానింగ్‌ మిషన్‌ లక్ష్మీకాంతమ్మదే

Published Thu, Dec 21 2023 1:14 AM

- - Sakshi

అనంతపురం మెడికల్‌: నగరంలోని రెవెన్యూ కాలనీలో అనధికారికంగా నిర్వహిస్తున్న స్కానింగ్‌ సెంటర్‌లోని స్కానింగ్‌ మిషన్‌ గైనకాలజిస్టు డాక్టర్‌ లక్ష్మీకాంతమ్మదేనని కమిషనర్‌ ఆఫ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ అధికారులు నిర్ధారించారు. దీంతో పులివెందుల వైద్య కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరనున్న డాక్టర్‌ లక్ష్మీకాంతమ్మకు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ భ్రమరాంబదేవి నోటీసు జారీ చేస్తూ ఆ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు.

ఇదీ సంగతి

రెవెన్యూ కాలనీలో ఎలాంటి విద్యార్హత, ఆరోగ్యశాఖ అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్న స్కానింగ్‌ సెంటర్‌ను ఈ ఏడాది నవంబర్‌ 21న డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ భ్రమరాంబదేవి సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. ట్రాన్స్‌వాజినల్‌ అల్ట్రాసోనోగ్రఫీ విధానంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు అప్పట్లో అధికారులు గుర్తించారు. దాదాపు 170 మంది గర్భిణులకు పరీక్షలు జరిపినట్లు తనిఖీలో వెల్లడైంది. దీంతో నిర్వాహకులు సునీల్‌కుమార్‌, శ్రావణిపై పీసీపీఎన్‌డీటీ చట్టం ఉల్లంఘన కింద కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. అదే సమయంలో వారు వినియోగిస్తున్న స్కానింగ్‌ మిషన్‌ ఎవరిదనేది నిగ్గు తేల్చాలంటూ కమిషనర్‌ ఆఫ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌కు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ భ్రమరాంబదేవి విన్నవించారు. దీంతో కమిషనర్‌ ఆదేశాలతో రాష్ట్రాధికారులు చైన్నెకి చెందిన మిన్‌డ్రే కంపెనీ, విజయవాడలోని దివిస్‌ మీడియా సిస్టమ్‌/సర్వీసెస్‌ను విచారించగా డాక్టర్‌ లక్ష్మీకాంతమ్మ పేరు మీద ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ మిషన్‌ కొనుగోలు చేసినట్లు స్పష్టమైంది. ఈ విషయం అనంతపురం ఆరోగ్యశాఖకు తెలియడంతో అందరూ నిర్ఘాంతపోయారు.

ఆది నుంచి వివాదాస్పదమే

గైనకాలజిస్టు డాక్టర్‌ లక్ష్మీకాంతమ్మ తీరు ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంటోంది. గతంలో అనంతపురంలోని శ్రీనివాసనగర్‌లో అభిజ్ఞ ఆస్పత్రిలో లక్ష్మీకాంతమ్మపై నమోదైన 14 ఫైళ్లు, మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ చట్టాన్ని అతిక్రమించి 99 అబార్షన్లు చేయడం, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా శ్రీనివాసనగర్‌లో రూత్‌ ఆస్పత్రి నిర్వహణపై అప్పటి డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వీరబ్బాయి, పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌ జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ యుగంధర్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ఏడాది మే 27న ఆమెను కలెక్టర్‌ గౌతమి సస్పెన్షన్‌ చేశారు. ఇటీవల ఆమెకు తిరిగి పులివెందుల వైద్య కళాశాలకు పోస్టింగ్‌ వచ్చింది. కాగా, రెవెన్యూ కాలనీలో అనధికారిక స్కాన్‌ సెంటర్‌ నిర్వహించిన సునీల్‌కుమార్‌, శ్రావణిపై ఇప్పటికే ఆరోగ్యశాఖాధికారులు కోర్టులో పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌ ఉల్లంఘన కింద ఫిల్‌ దాఖలు చేశారు. తాజాగా డాక్టర్‌ లక్ష్మీకాంతమ్మ పేరును చేర్చనున్నారు.

నిర్ధారించిన కమిషనర్‌ ఆఫ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌

డాక్టర్‌ లక్ష్మీకాంతమ్మకు నోటీసులిచ్చిన డీఎంహెచ్‌ఓ భ్రమరాంబదేవి

స్కానింగ్‌ సెంటర్‌ను సీజ్‌ చేస్తున్నట్లు నిర్వాహకుడికి తెలుపుతున్న డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ భ్రమరాంబదేవి (ఫైల్‌)

Advertisement
Advertisement