breaking news
world karate championship
-
ప్రపంచ కరాటే పోటీలకు ప్రణవ్, కోచ్ కీర్తన్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ కరాటే చాంపియన్‌షిప్ పోటీల్లో హైదరాబాద్ నుంచి ఇద్దరు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. మునిపాల రామానుజ ప్రణవ్ 68 కేజీల విభాగంలో భారత జట్టు తరఫున బరిలోకి దిగనుండగా... భారత జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న కొండ్రు కీర్తన్ జూనియర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తాడు. ప్రపంచ కరాటే సమాఖ్య (డబ్ల్యూకేఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు పోలాండ్లోని బీల్స్కో బియా నగరం ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తుంది. క్యాడెట్, జూనియర్, అండర్–21 వయో విభాగాల్లో పోటీలు జరుగుతాయి. మంగళగిరిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీబీఏ తొలి సంవత్సరం విద్యార్థి అయిన ప్రణవ్ గతంలో కామన్వెల్త్ కరాటే చాంపియన్‌షిప్‌లో జూనియర్ టీమ్ కుమిటె ఈవెంట్లో రజతం, కుమిటె క్లబ్ కేటగిరీలో కాంస్యం సాధించాడు. అదే ఈవెంట్లో ఓవరాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీ సాధించిన భారత జట్టుకు కొండ్రు కీర్తన్ కోచ్‌గా ఉన్నారు. ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు. సరైన శిక్షణ, ప్రోత్సాహం లభిస్తే వారు అంతర్జాతీయస్థాయిలో మరిన్ని విజయాలు సాధిస్తారు’ అని కీర్తన్ తెలిపారు. -
మనోళ్లకు 12 పతకాలు
సాక్షి, హైదరాబాద్: ఐర్లాండ్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ కరాటే, కిక్ బాక్సింగ్ యూనియన్ చాంపియన్‌షిప్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు సత్తా చాటుకున్నారు. ఈ పోటీల్లో 12 పతకాలు సాధించారు. ఇందులో 4 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన డాక్టర్ విద్యాసాగర్ కాంస్యం గెలుపొందగా, వ్యక్తిగత విభాగంలో కావ్య మీనన్, ఆకాంక్ష పాటిల్, వెలువోలు సాకేత్, అన్మిశ్ శరత్ వర్మ రన్నరప్‌గా నిలిచి రజత పతకాలు సాధించారు. ఈ నలుగురితో కూడిన బృందం టీమ్ కుమిటేలో మూడో స్థానంలో నిలిచింది. అశ్విని ఆనంద్ వ్యక్తిగత, టీమ్ కుమిటేలో చెరో కాంస్యం గెలిచింది. విద్యాసాగర్, ప్రభు చరణ్ టీమ్ ఈవెంట్లో కాంస్యాలు గెలిచారు. ఈ జట్టుకు శిహాన్ సాయి కుమార్ కోచ్‌గా, విజయ్ కుమార్ మేనేజర్‌గా వ్యవహరించారు. ఐర్లాండ్‌లోని కెర్రీ సిటీలో ఐదు రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్లో ట్రెడిషనల్ కరాటే, లైట్ కాంటాక్ట్, ఫుట్ కాంటాక్ట్, కిక్ బాక్సింగ్, ఎమ్ఎమ్ఏ, వెపన్ కాంపిటీషన్ మ్యూజికల్, నాన్ మ్యూజికల్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. 32 దేశాలకు చెందిన 2000 మంది కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు.


