సొంత గ్రామాలకు మృతదేహాలు
పొందూరు : విజయవాడ బెంజి సర్కిల్లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలు మంగళవారం వారి సొంత గ్రామాలకు చేరాయి. తహసీల్దార్ వరప్రసాదరావు ఆధ్వర్యంలో వీటిని తీసుకువచ్చారు. పైడి వెంకటరమణ మృతదేహాన్ని కింతలిలోని వారి కుటుంబ సభ్యులకు, సనపల హర్షవర్ధన్ మృతదేహాన్ని తోలాపిలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉండగా ఈ ప్రమాదంలో గాయపడ్డ ఆరుగురు విజయవాడలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కుటుంబానికి అన్నీ తానై....
పైడి వెంకటరమణ తన కుటుంబానికి పెద్ద దిక్కులా వ్యవహరించి అన్నీ తానై బాధ్యతలను నెరవేర్చాడు. గ్రామంలో మంచి వ్యక్తిగా పేరు పొందారు. సివిల్ ఇంజినీరింగ్ చేయడంతో కాంట్రాక్టు పనులు చేస్తూ ఓ స్థాయిలో నిలిచాడు. ఇద్దరు తోబుట్టవులకు పెళ్లిళ్లు చేశారు. తమ్ముyì పైడి అప్పలస్వామిని చదివించాడు. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈయనతో పాటు తల్లి అమ్మన్నమ్మ కూడా ప్రమాదంలో గాయపడి విజయవాడలో చికిత్స పొందుతున్నారు. ఎంతో కష్టపడి వెంకటరమణను సివిల్ ఇంజినీరింగ్ వరకు చదివించి ప్రయోజకుడిని చేస్తే విధి ఇలా మృత్యురూపంలో వెంటాడింది.
చివరి చూపునకు నోచుకోని తల్లి...
సనపల హర్షవర్ధన్ వారి తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. అల్లారుముద్దుగా పెంచుకొంటున్నారు. ఇంతలోనే విధికి కన్ను కుట్టింది. హర్షవర్ధన్‌ను ప్రమాద రూపంలో మింగేసింది. తల్లి భూలక్ష్మి కూడా ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతుండడంతో కుమారుడు ఏమయ్యాడో తెలియని స్థితిలోనే ఉంది. కుమారుడు చివరి చూపునకు సైతం నోచుకోలేదు. భూలక్ష్మి వచ్చాక ఏం చెప్పాలో తెలియని స్థితిలో భర్త మురళీధర్ కన్నీరుమున్నీరవుతున్నారు.