ఉదయగిరికి అభ్యర్థుల ఖరారు
ఉదయగిరి శాసనసభ నియోజక వర్గానికి వైఎస్సార్సీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. టీడీపీ అభ్యర్థిగా బొల్లినేని వెంకటరామారావును ఆ పార్టీ అధికారికంగా ప్రకటించగా, మిగతా రెండు పార్టీల అధిష్టానాలు జాబితా విడుదల చేయకపోయినప్పటికీ అభ్యర్థుల పేర్లు మాత్రం దాదాపు ఖరారు చేశాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి పేరు ఖరారైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పి.చెంచలబాబు యాదవ్ పేరు కూడా దాదాపు ఖరారైనట్లే. ఇప్పటికే టీడీపీ అభ్యర్థి బొల్లినేని రామారావు కొండాపురం మండలం సాయిపేట నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి శనివారం జలదంకి మండలం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్ అభ్యర్థి చెంచలబాబు యాదవ్ హైదరాబాద్‌లో ఉన్నారు. రెండ్రోజుల్లో ఆయన కూడా ప్రచారం ప్రారంభించే అవకాశముంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఈ మూడు పార్టీల నేతలు తమ అభ్యర్థుల గెలుపు కోసం గ్రామాలు చుట్టారు.
కాంగ్రెస్ టికెట్ చెంచలబాబుకే
దయగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నెబోయిన చెంచలబాబు యాదవ్ పేరు కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ టికెట్ కోసం మాజీమంత్రి మాదాల జానకిరాం సమీప బంధువు మాదాల రామచంద్ర ప్రయత్నం చేసినప్పటికీ, సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సహకారంతో ఈ టికెట్‌ను చెంచలబాబు యాదవ్ దక్కించుకున్నారు. ఆయన పేరును నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఆయన తండ్రి చెంచురామయ్య ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా పనిచేశారు. గతంలో ఆయన ఉదయగిరి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నెల 17వ తేదీన నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.