‘సపోర్ట్ మై స్కూల్’ ప్రచారం ప్రారంభించిన అనుష్క శర్మ
* కోకాకోలా-ఎన్డీటీవీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు
* ఏపీలోని 23 పాఠశాలల్లోనూ మౌలిక వసతుల ఏర్పాటు
సాక్షి, న్యూఢిల్లీ: కోకాకోలా-ఎన్టీటీవీల సంయుక్త ఆధ్వర్యంలో ‘సపోర్ట్ మై స్కూల్’ పేరిట పాఠశాలల్లో వసతుల ఏర్పాటులో భాగంగా సీజన్-3 కార్యక్రమాన్ని బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఢిల్లీ శివారులోని సోంక్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం ప్రారంభించారు. ఈ సంస్థలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
2016 నాటికి దేశవ్యాప్తంగా వెయ్యి పాఠశాలల్లో ఈ సేవలు అందించాలని నిర్ణయించారు. ఇప్పటికే 370 పాఠశాలల్లో సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 5 జిల్లాల్లో గల 23 ప్రభుత్వ పాఠశాలల్లో కూడా వసతులు సమకూర్చనున్నారు. మరుగుదొడ్లు, సురక్షిత మంచినీరు, క్రీడా వసతులు సమకూర్చనున్నారు. ఈ ప్రణాళికలో భాగస్వాములైన ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ డెరైక్టర్ డాక్టర్ సురేష్‌రెడ్డి, వరల్డ్ విజన్ డెరైక్టర్ జయకుమార్ క్రిష్టియన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.