బోనులో బంధించి...నీటిలో ముంచి!
ఇరాక్‌లో ఇస్లామిక్ రాజ్యస్థాపనే లక్ష్యంగా పోరాడుతున్నామని చెప్పుకొంటున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అమాయకులను బందీలుగా చేసుకొని రాక్షసంగా హత్య చేస్తున్నారు. బందీలందరినీ ఒకేలా కాకుండా, జేమ్స్‌బాండ్ చిత్రాల్లోని విలన్లా వినూత్న పద్ధతుల్లో చంపేస్తూ తమ పైశాచికానందాన్ని చాటుకుంటున్నారు. తమ అమానుషత్వాన్ని వీడియోల్లో చిత్రీకరించి మరీ ప్రపంచానికి చూపిస్తున్నారు. ఇరాక్‌లోని మోసుల్ నగరంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద విభాగం ఏడు నిమిషాల నిడివిగల అలాంటి ఒక వీడియోను తాజాగా విడుదల చేసింది.
అందులో బందీలను చంపేసే మూడు ఘటనలు ఉన్నాయి. మొదటి ఘటనలో ఐదుగురు బందీలను ఇనుప బోనులో బందించి, దాన్ని విశాలమైన స్విమ్మింగ్ పూల్‌లోని నీటిలో క్రమక్రమంగా ముంచింది. నీటిలో మునిగి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్న బందీల స్థితిని చిత్రీకరించేందుకు హాలివుడ్ చిత్రాల్లోలాగా అత్యాధునిక 'అండర్ వాటర్' కెమెరాలను వాడారు. అనంతం ఆ ఇనుప బోనును నీటి వెలుపలికి తీసుకరాగా, దానిపై ఐదుగురు బందీలు మరణించిన దృశ్యం కనిపిస్తుంది. వారంతా తమపై గూఢచర్యం నెరపుతున్నారనే అనుమానంతో బందీలైనవారే.
మరికొంత మంది బందీలను ఓ కారులో బంధించి దూరం నుంచి ఆ కారును గ్రెనేడ్ లాంచర్ ద్వారా పేల్చివేయడాన్ని వీడియోలో చూపించారు. మూడో ఘటనలో బందీల మెడల చుట్టూ పేలుడు పదార్థాలతో పేనిన తాడును చుట్టి పేల్చేస్తారు. ఈ మూడు ఘటనలను వేర్వేరుచోట్ల వేర్వేరు వీడియోలుగా తీసి ఒకే వీడియోలో అతికించినట్లు కనిపిస్తోంది. గతంలో ఎంతో మంది అమెరికా, బ్రిటన్ బందీలను కుత్తుకలు కత్తిరించి హత్య చేసిన ఉగ్రవాదులు ఇప్పుడు చంపడంలో కొత్త కొత్త రీతులు అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది.