breaking news
Happy Fathers Day
-
దేవుడు ముడివేసిన బంధం
లోకం తెలియని పసితనం బుడిబుడి అడుగులతో నాన్నను అనుసరించే దృశ్యం, ఎప్పుడూ మురిపెంగానే ఉంటుంది. చూసేందుకే అంత ముచ్చటగా ఉండే ఆ బంధం, స్వయంగా తన చేతినే తాకినప్పుడు.. ఆ తండ్రి పొందే ఆనందం.. అమితం, అమరం, అనిర్వచనీయం! అలాంటి అనుభూతిని కోరే నాన్న ఎప్పుడూ ఉన్నతమైన ఆదర్శాలనే తలకెత్తుకుంటాడు. గొప్ప తండ్రిగా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకుంటాడు. తనతో పాటు తన పిల్లల్ని కూడా ప్రపంచానికి సగర్వంగా పరిచయం చేస్తాడు. దైవత్వాన్ని నింపుకుని, వారి తలరాతలను తనే రచిస్తాడు. అందుకే ‘డాడ్ ఈజ్ గాడ్’పితా ధర్మః పితా స్వర్గః పితా హి పరమం తపఃపితరి ప్రీతిమాపన్నే ప్రీయతే సర్వదేవతాః‘తండ్రి దైవ సమానుడు, ధర్మ స్వరూపుడు. తపస్సుకు అత్యుత్తమ మార్గం ఏదైనా ఉందంటే అది తండ్రికి సేవ చేయడమే. తండ్రిని సంతోషపెడితే సమస్త దేవతలు సంతోషిస్తారు’ ఇది కుటుంబవ్యవస్థ మెచ్చే ధర్మం! అయితే ఎందరో తండ్రులు, తమ పిల్లల నుంచి అవేమీ ఆశించకుండా కేవలం వారి క్షేమం కోసమే అహర్నిశలు తపిస్తుంటారు. జీవితాన్ని, కాలాన్ని అంకితమిస్తూ స్వచ్ఛమైన ప్రేమకు నిలువెత్తు సాక్ష్యమవుతున్నారు. ఒకసారి బరాక్ ఒబామా, తండ్రి గురించి స్పష్టమైన కొటేషన్ చెప్పారు. ‘మగతనం ఉంటే చాలు, ఎవరైనా బిడ్డను కనగలరు! కాని, అది వారిని తండ్రిని చేయలేదు. బిడ్డను పెంచడానికి ధైర్యంగా అడుగులు వేసేవారే నిజమైన తండ్రి’ అంటారాయన. దానిలో ఎంత అర్థముంది! నాన్న కనబడితే– గౌరవంతో తలుపు చాటున దాక్కునే అలనాటి రోజుల నుంచి నాన్న కనబడితే– గారాబంతో సరదాగా పోట్లాడుకునే ఈనాటి రోజుల వరకూ, ప్రతి జీవితంలోనూ ఆయనే హీరో! కాలం విసిరిన సవాళ్లకు జీవితాన్ని పణంగా పెట్టే ప్రతి నాన్న చేతుల్లోనూ ఓ చిట్టి చేయి దాగుంటుంది. ఆ చేయి ఏదో ఒకరోజు ఈ ప్రపంచానికి, తన ఆదర్శవంతమైన కథను సగర్వంగా పరిచయం చేస్తుంది. తన కోసం, తన తండ్రి కన్న కలలన్నింటినీ గొంతెత్తి చాటుతుంది. నిజానికి ఈలోకంలో నాన్న అనే పిలుపు కోసం తపించే నాన్నలు కొందరైతే, నాన్నగా గెలిచిన నాన్నలు ఇంకొందరు. ఏదేమైనా నాన్న అనే పిలుపే ఓ ఎమోషన్. ఆ ఎమోషన్స్ కి త్యాగం తోడైతే? తెలియకుండానే గుండె తడవుతుంది. ఫాదర్స్‌డే సందర్భంగా అలా గెలిచి, నిలిచిన కొన్ని నిజజీవిత విజయగాథలు మీకోసం. లోకం మెచ్చిన తండ్రులుఈ అద్భుతమైన సృష్టిలో హద్దులు లేని ఆప్యాయతే అసలైన అమ్మతనం. నిస్వార్థమైన ప్రేమకు అదో మారు గుణం. అలాంటి అమ్మతనాన్ని అందించే నాన్న దొరకడం మహా వరం. ప్రేమను పంచడంలో, పిల్లల్ని పెంచడంలో తండ్రి పాత్రకు వీరంతా సజీవ నిదర్శనం!దేవుడు ముడివేసిన బంధంమధ్యప్రదేశ్, ఇండోర్‌లోని ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ అనాథాశ్రమం సాక్షిగా మొదలైన ఈ తండ్రీ కొడుకుల కథ చాలా ప్రత్యేకం. 2014 సెప్టెంబర్ 13 ఉదయాన్నే 27 ఏళ్ల ఆదిత్య తివారీ.. తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పని చెయ్యాలనే ఉద్దేశంతో, ఆఫీస్‌కి సెలవు పెట్టి మరీ ఆ చారిటీకి వెళ్లాడు. అక్కడ గుక్కతిప్పుకోకుండా ఏడుస్తున్న ఆరు నెలల అవనీశ్‌ను తొలిసారి చూసి, ఏమైందని ఆరా తీశాడు. ఆ బాబుకున్న ఆరోగ్య సమస్యల గురించి విని అల్లాడిపోయాడు. డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న అవనీశ్‌ను ఎవ్వరూ దత్తత తీసుకోవడం లేదని తెలిసి, ఆ బాబుకి తానే తండ్రి కావాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే అధికారులతో చర్చించాడు. అయితే అధికారులు అందుకు అభ్యంతరం చెప్పారు. దత్తత తీసుకునే ఒంటరి పురుషుడికి 30 ఏళ్లు నిండాలనే రూల్స్‌ని ముందుంచారు. దాంతో ఆ రూల్స్ మార్చాలని న్యాయపోరాటం మొదలుపెట్టాడు ఆదిత్య. అవనీశ్ లాంటి స్పెషల్ చిల్డ్రన్ని దత్తత తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిస్తూనే, అవనీశ్ దత్తత కోసం సుమారు రెండేళ్లు ఫైట్ చేశాడు. అయితే ఒక ఒంటరి పురుషుడు, ఇలాంటి వికలాంగుడైన బిడ్డను చూసుకోవడం కష్టమనే వారు ఎక్కువయ్యారు. ఆ మాటలకు ‘బిడ్డ తండ్రివైతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయీ ముందుకు రాదు’ అనే హెచ్చరికలు తోడయ్యాయి. అయినా వెనక్కు తగ్గని ఆదిత్య ఈ ప్రయత్నంలో తన ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాడు. చివరికి దత్తత తీసుకోవడంలో సింగిల్ ఫాదర్‌కి ఉండాల్సిన వయసును 30 ఏళ్ల నుంచి 25 ఏళ్లకు మార్పించగలిగాడు. అలాగే 2016 జనవరి 1న అవనీశ్‌కి అధికారికంగా తండ్రి అయ్యి, దేశంలోనే అతి పిన్న వయస్కుడైన ఒంటరి తండ్రిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్థిక, సామాజిక సవాళ్లు ఎదుర్కొంటూ బాబుకి మంచి ఆహారం, మంచి వైద్యం ఇప్పించగలిగాడు.అయితే రెండేళ్ల పోరాటక్రమంలో అర్పిత అనే అమ్మాయితో స్నేహం కుదిరింది. ఆ స్నేహం ప్రేమగా మారేముందు అవనీశ్ తల్లిగా అర్పిత పాసైంది. వీరి పెళ్లికి పదివేల మంది నిరాశ్రయులు అతిథులుగా వచ్చారు. ప్రస్తుతం అవనీశ్ ఆరోగ్యవంతుడిగా మారుతూ, పాఠశాలకు వెళ్తూ, చదువులో చురుకుగా ఉంటున్నాడట. ఆదిత్య తివారీ అంకితభావానికి గుర్తింపుగా, 2020లో ఆయనకు ‘వరల్డ్స్ బెస్ట్ మామీ’ అవార్డు లభించింది. తల్లి ప్రేమ ఒక లింగానికే పరిమితం కాదని, తండ్రి కూడా ఆ ప్రేమను చూపగలడని నిరూపించినందుకు అతడికి ఈ గౌరవం దక్కింది.అవనీశ్లాంటి పిల్లలున్న 10 వేల మంది తల్లిదండ్రులకు ఆదిత్య కౌన్సెలింగ్ ఇచ్చాడు. ఈ తండ్రీ కొడుకులిద్దరూ కలిసి ఇప్పటివరకు దేశంలో 22 రాష్ట్రాల్లో పర్యటించారు. సెమినార్లు, వర్క్‌షాపులు అంటూ ఇలా ఎక్కడికి వెళ్ళినా అవనీశ్‌ను ఆదిత్య వెంటబెట్టుకునే వెళ్తాడు. ఐక్యరాజ్య సమితిలో సైతం, వైకల్యమున్న పిల్లల పెంపకం గురించి ఆదిత్య ప్రసంగించారు. జెనీవాలో జరిగిన ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’లో కూడా ఈ తండ్రీ కొడుకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.అవనీశ్‌కి ఇంకా కొన్ని సర్జరీలు జరగాల్సి ఉందని, అవి చేయించడానికి తగిన వయసు కోసం ఎదురు చూస్తున్నామని ఆదిత్య తెలిపారు. ఇది దేశానికే ఆదర్శవంతమైన కథ. అన్నిటినీ చిన్నబుచ్చిన ప్రేమ!ముంబైలోని ఓ చిన్న ఇంట్లో, నాలుగేళ్ల సుశాంత్ దివిగికర్ కార్లు, బ్యాట్లతో ఆడుకోకుండా, తల్లి చీర కొంగులతో, ఆమె మేకప్ సామాగ్రితో తనదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. స్టేజ్ డ్రామాలు, నృత్యాలు ఇష్టమంటూ ఆ దిశగానే అడుగులు వేశాడు. ఇక యవ్వనంలోకి వచ్చేసరికి అమ్మాయిలపైన కాకుండా అబ్బాయిలపై ఆకర్షితుడయ్యాడు. అప్పుడే తను ఒక గే అని, తనలో స్త్రీ లక్షణాలు కూడా ఉన్నాయని గ్రహించాడు. రహస్యంగా గే పార్టీలకు అటెండ్ అయ్యేవాడు. 2008లో ఒకరోజు సుశాంత్ కజిన్ కరణ్.. సుశాంత్‌ని ‘గే’లతో తిరగడం చూసి షాకయ్యాడు. వెంటనే సుశాంత్ తండ్రి ప్రదీప్ దివిగికర్కి చెప్పేశాడు. విషయం తెలిసిన ప్రదీప్.. సుశాంత్‌ని ఆరా తియ్యగా భయపడుతూనే తండ్రికి నిజం చెప్పాడు. వెంటనే ప్రదీప్ కొడుకుని హత్తుకుని.. ‘నువ్వు ఎలా ఉన్నా నా బిడ్డవే.. ఈ ప్రపంచం నిన్ను ఏమైనా అననీ.. నేను మాత్రం నీకు అండగానే ఉంటాను’ అని మాటిచ్చాడు. అప్పుడు సుశాంత్‌కి 18 ఏళ్లు. వెంటనే ప్రదీప్.. తన కొడుకు గే అనే విషయాన్ని సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పారు. తండ్రి ప్రోత్సాహంతోనే నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ‘మిస్టర్ గే ఇండియా’ 2014 టైటిల్‌ను గెలుచుకున్నాడు. ‘మిస్టర్ గే వరల్డ్’ చరిత్రలో అత్యధిక సబ్–టైటిల్స్ గెలుచుకున్న ఏకైక ఇండియన్ తనే. అదే ఏడాది సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఉన్న మహారాష్ట్ర ‘బిగ్ బాస్ 8’ కంటెస్టెంట్‌గా వెళ్లి, ఏడో వారంలో ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఓటీటీకి ఆఫర్ వచ్చినా.. ‘అదో డర్టీ గేమ్’ అని అభివర్ణించి ఆఫర్‌ని తిరస్కరించాడు. తర్వాత కాలంలో తండ్రి ప్రోత్సాహంతోనే ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారాడు. ‘రాణీ కోహినూర్’ అనే పేరుతో ప్రస్తుతం సుశాంత్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 3.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.‘బిడ్డ బిడ్డే అయినప్పుడు లింగంతో సంబంధం ఏంటీ? ఒకే బిడ్డలో కొడుకు, కూతురు ఇద్దరూ ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడ్ని’ అంటుంటారు ప్రదీప్. కలలను వదులుకునేంత బాధ్యతముంబైకి చెందిన లహర్ జోషీ చిన్నప్పటి నుంచి కెరీర్ గురించి ఎన్నో కలలు కన్నాడు. 2015 నాటికి కోరుకున్నట్లే సొంతంగా బ్రాండింగ్ ఏజెన్సీని స్థాపించి, విజయవంతంగా నడపసాగాడు. అయితే ఆ సమయంలోనే అతడి భార్య రుతుమ గర్భవతి అయ్యింది. స్కానింగ్‌లో కవలలు అని తెలిసినప్పటి నుంచి పట్టలేని ఆనందంతో పాటు రెట్టింపు కానున్న బాధ్యతలు అతణ్ణి కుదురుగా ఉండనివ్వలేదు. పిల్లలు పుట్టిన తర్వాత నుంచి భార్యభర్తలిద్దరికీ పిల్లలకోసం సమయాన్ని కేటాయించడం కూడా సమస్యగానే మారింది. పిల్లల కోసం ఎవరో ఒకరు ఇంటి దగ్గర ఉండటంతో పాటు ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించినప్పుడు లహర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య రుతుమతో పోలిస్తే తన నెల సంపాదన తక్కువ ఉండటంతో, విజయవంతంగా సాగుతున్న తన బ్రాండింగ్ ఏజెన్సీని మూసివేసి, పూర్తిస్థాయిలో పిల్లల సంరక్షణకు అంకితం కావాలని ఫిక్స్ అయ్యాడు. అలా, లహర్ జోషీ ఒక ‘స్టే–ఎట్–హోమ్ డాడ్’గా మారారు.ఈ నిర్ణయం సమాజంలో మిశ్రమ స్పందనలను తెచ్చింది. కొందరు ఆయన్ని అభినందిస్తే, మరికొందరు ఆశ్చర్యంగా చూశారు. కానీ లహర్‌కు తన తండ్రి నుంచి పూర్తి మద్దతు లభించింది. అది ఆయనకు ఎంతో ధైర్యాన్నిచ్చింది.పిల్లల్ని ఇంటి వద్దే ఉండి పెంచిన అనుభవం తనను మరింత మంచి వ్యక్తిగా మార్చిందని లహర్ బలంగా నమ్ముతాడు. తొలినాళ్లలో పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం కాస్త కష్టంగా అనిపించినా, వారి ఎదుగుదలను దగ్గరగా చూసే అనుభూతి అద్భుతమని ఆయన గర్వంగా చెబుతుంటాడు. లహర్ తన ఈ ప్రయత్నంతో దేశంలో పాతుకుపోయిన లింగ వివక్షను సవాలు చేస్తున్నారు. ఒక తండ్రి పాత్ర కేవలం డబ్బు సంపాదించడమే కాదు, పిల్లలకు ఓ మార్గదర్శిగా, కోచ్‌గా ఉండటం కూడా అంటారు ఆయన. ఈరోజు, లహర్ జోషీ తన కవలలను ఎంతో ఆనందంగా పెంచుకుంటూ, సమాజానికి ఓ కొత్త సందేశాన్ని ఇస్తున్నారు. తండ్రి ప్రేమ, సంరక్షణ పిల్లల ఎదుగుదలకు ఎంత అవసరమో వివరిస్తూ, లహర్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అమ్మలా పెంచిన నాన్నగుజరాత్, అహ్మదాబాద్‌కి చెందిన ప్రముఖ గాయని ‘శైలీ షా’ను కదిలిస్తే ఆదర్శవంతమైన తన తండ్రి ‘రాజేష్ షా’ కథను ప్రత్యేకంగా చెబుతుంది. శైలీకి పదేళ్లు కూడా నిండకుండానే ఆమె తల్లి ఆశ మరణించింది. ఆరోజు నుంచి తన అన్న నిసర్గను, తనని కంటికి రెప్పలా పెంచి పోషించారు రాజేష్. మరో పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా వినలేదు. ప్రేమించి పెళ్లాడిన భార్య మరణంతోనే జీవితం శూన్యం అనుకున్న రాజేష్.. కేవలం పిల్లల కోసమే బతికారు. అయితే అతడి భార్య ఆశా తన కూతురు శైలీని సింగర్ చేయాలని ఆశపడింది. అందుకే అహర్నిశలు శ్రమించి కూతుర్ని సింగర్‌ని చేశారు రాజేష్. శైలీ షా కేవలం గాయని మాత్రమే కాదు. ఆమె ‘మోర్తంత్ర’ అనే బొటిక్ జ్యూలరీ బ్రాండ్‌తో విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్రాండ్ గుజరాత్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జ్యూలరీ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. ఇక నిసర్గ, ప్రింటింగ్ కేంద్రాన్ని నడపుతూ తండ్రికి అండగా ఉంటున్నాడు.‘నాన్నే మాకు జీవిత పాఠాలు నేర్పించారు, అమ్మలా పెంచారు. ఆయనే మాకు స్ఫూర్తి’ అని శైలీ గర్వంగా చెబుతుంది.నాన్న అనే పిలుపు కోసం ఏళ్ల పోరాటంయూసఫ్ ఖాన్‌తో కబీర్, డా.కేదార్ పడ్తేఅది 2007. యూసఫ్ ఖాన్ అనే 26 ఏళ్ల మ్యూజిక్ టీచర్.. పుణే చారిటీల చుట్టూ తిరగడం అప్పుడప్పుడే మొదలుపెట్టాడు. దుబాయ్‌లో ‘ద మ్యూజిక్ బాక్స్’ అనే మ్యూజిక్ స్కూల్‌ను నడుపుతున్న యూసఫ్.. వైవాహిక జీవితంపై ఆసక్తి లేకపోవడంతో, పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే పిల్లల మీద ఉన్న ఇష్టంతో అనాథను దత్తత తీసుకోవాలని ఆశపడ్డాడు. అందుకే భారత్ వచ్చి చారిటీలకు తన విన్నపాన్ని తెలిపి, దత్తత కోరినప్పుడు.. అందుకు రూల్స్ అంగీకరించలేదు. తాను తండ్రి కావాలనే బలమైన కోరికతో సుమారు పదేళ్ల పాటు దత్తత కోసం దుబాయ్‌కి, ఇండియాకి తిరుగుతూనే ఉన్నాడు. అయితే ఫలితం లేకపోవడంతో 2017 నుంచి సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నాడు. సుమారు పదకొండు సార్లు సరోగసీ విధానం ఫెయిల్ అయ్యింది. అయినా తన కలను చంపుకోవడానికి యూసఫ్ అంగీకరించలేదు. విసుగు చెందలేదు. పదే పదే ఎదురైన వైఫల్యాలు, ఆర్థిక భారం, మానసిక ఒత్తిడి ఏవీ తనని నిరాశపరచలేదు. చివరికి సరోగసీలో 12వ ప్రయత్నం ఫలించి, 2019 డిసెంబర్ 3న పనాజీలో కబీర్ అనే పండంటి మగబిడ్డను పొందాడు. గోవాకు చెందిన డా. కేదార్ పడ్తే పర్యవేక్షణలో ఇదంతా జరిగింది. ప్రస్తుతం కొడుకుతో సహా దుబాయ్‌లోనే ఉంటున్నాడు యూసఫ్. వీరికి సంబంధించిన ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందుబాటులో లేవు. అయితే ఎన్నో కష్టాలకు ఓర్చి, ఏళ్లపోరాటం చేసి పొందిన బిడ్డను యూసఫ్ ఎలా పెంచుతాడనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అంతులేని అన్వేషణచైనా తూర్పు తీరంలోని షాన్స్ డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన ‘గువో గ్యాంగ్‌టాంగ్’ అనే తండ్రి కథ యావత్ ప్రపంచానికీ భావోద్వేగాలను నింపింది. ఈ కథ 1997, సెప్టెంబర్ 21న మొదలైంది. ఆ రోజు ఆదివారం. స్కూల్స్ లేక పిల్లలంతా ఇంటి బయటే ఆడుకుంటున్నారు. గువో రెండో కొడుకు రెండున్నరేళ్ల జిన్స్ జెన్స్ ను ఎవరో లాక్కెళ్లారని పెద్ద కొడుకు పరుగున లోపలికి వచ్చి చెప్పాడు. అప్పటికే కిడ్నాపర్ల వీరంగం గురించి చాలాసార్లు విన్న గువో.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దాంతో కడు నిరుపేదైన గువో.. కష్టపడి ఓ పాత మోటర్ సైకిల్ కొనుక్కుని, దాని వెనుక మిస్ అయిన కొడుకు ఫొటోను బ్యానర్‌గా కట్టుకుని, తనే స్వయంగా వెతకడం మొదలుపెట్టాడు. అదే బండి మీద చాలా దూరం వెళ్లాడు. సుమారు 24 ఏళ్ల పాటు కిడ్నాప్ అయిన కొడుకును అలా వెతుకుతూనే ఉన్నాడు. వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. తన ఆర్థిక స్తోమతను బట్టి పాత మోటర్ సైకిళ్లనే కొంటూ, మార్చుకుంటూ.. తిరగని చోటు లేదన్నంతగా తిరిగాడు. అన్నేళ్ల ప్రయాణంలో కొన్నిసార్లు తినడానికి తిండి దొరికేది కాదు. కొన్ని రాత్రులు వంతెనల కింద, రోడ్ల మీద పడుకోవాల్సి వచ్చేది. అయినా విసుగు చెందలేదు. పిచ్చివాడని కొందరు, దొంగ అయి ఉంటాడని ఇంకొందరు అనుమానించినా, అవమానించినా తగ్గలేదు. అతడి పట్టుదలను చూసిన ఎందరో చైనీయులు అతడ్ని ‘సింబల్ ఆఫ్ ది సెర్చింగ్ ఫర్ మిస్సింగ్ చిల్డ్రన్’ అనే పేరుతో కీర్తించడం మొదలుపెట్టారు. అతడి ప్రయత్నం నాయకులను, అధికారులను కూడా కదిలించింది. చివరికి 2021 జూలై 11న, గువోకు చైనా ప్రజా భద్రతా మంత్రిత్వ శాఖ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పటికి అతడి వయసు 61 ఏళ్లు. ‘న్యూ డీఎన్ఏ టెక్నాలజీతో జిన్ జిన్ ను కనుగొన్నామని, అతడు హేనాన్ ప్రాన్స్‌లో ఒక దత్తత కుటుంబంతో నివసిస్తున్నాడు’ అని గువోతో అధికారులు చెప్పారు. అతడి 24 ఏళ్ల ఆవేదన ఒక్కసారిగా ఆనందంగా మారింది. 2021 జూలై 13న జిన్స్ జెన్ 26ఏళ్ల యువకుడి రూపంలో గువో కళ్లముందుకు వచ్చినప్పుడు అతడి కన్నీళ్లు చూసి ప్రపంచమే కంటతడి పెట్టింది. వారి కౌగిలిలో ఏళ్లనాటి నిరీక్షణ, ప్రేమ, ఆనందం అన్నీ కళ్లకు కట్టాయి. గువో కథ ‘లస్ట్ అండ్ లవ్’ అనే సినిమాగా మారి, ఎందరో మనసులను కదిలించింది.నిజానికి ఈ కథలన్నీ చూస్తుంటే ‘లియో బుస్కాగ్లియా’ అనే అమెరికా రచయిత మాటలు గుర్తు రాక మానవు. ‘అమరత్వం అనేది మనం వదిలి వెళ్లే ప్రేమలో మాత్రమే ఉంటుంది. అంతటి ప్రేమను పంచే తండ్రులకు ఎప్పటికీ చావు ఉండదు’ అన్నారు ఆయన. అలాంటి తండ్రులందరికీ పాదాభివందనం!హ్యాపీ పాదర్స్ డే! -
Happy fathers day 2024 లవ్లీ డాడీతో సెల్పీ పంపండి, సాక్షితో సెలబ్రేట్ చేసుకోండి!
నాన్న త్యాగాన్ని గుర్తు చేసుకోవడం కోసమే ప్రత్యేకంగా ప్రతి యేడాది జూన్ నెల మూడో ఆదివారం ఫాదర్స్ డే జరుపుకుంటాం. అంటే ఏడాది జూన్ ఆదివారం 16న ఫాదర్స్ డే. ప్రతీ ఫాదర్స్ డే రోజు లవ్లీ డాడీని అనేక బహుమతులతో సర్ప్రైజ్ చేస్తారు కదా. ఈ ఏడాది మాత్రం సాక్షి. డాట్కాంతో స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకోండి. ఎలా అంటారా? సింపుల్.. నిస్వార్థంగా ఆకాశమంత ప్రేమను పంచే మీ డాడీతో ఒక సెల్ఫీ తీసుకోండి. సాక్షి డాట్.కామ్‌కు ఈ కింద ఫోటోలో ఉన్న నెంబరుకు వాట్సాప్ చేయండి...హ్యాపీ ఫాదర్స్ డే! -
నాన్నా... నను కన్నందుకు కృతజ్ఞతా వందనాలు
నీ గుండె నా లేత పాదాలకు పరిచిన తొలి మెత్తటి రహదారి... నీ చిటికెన వేలు నా చిట్టి గుండెకు దొరికిన తొలి దిలాసా... నీ వీపు నేనధిరోహించిన తొలి ఐరావతం... నా మూడు చక్రాల బండితో పరుగెత్తి నిను ఓడించినదే నేను గెలిచిన తొలి రేస్... నీ కావలింత నా కన్నీళ్లకు స్టాప్బటన్... నువ్వే నా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. నాన్నా... నా గురించి తప్ప నీ గురించిన చింత నీకు లేదు. ఏడ్పించే లోకాన్ని గుమ్మం బయటే వదిలి గడపలో విజేతగా నా కోసం అడుగుపెడతావు. నువ్వే కదా నా ఫస్ట్ సూపర్‌స్టార్. నాన్నా... గుర్తుకొస్తున్నావు. నాన్నా... నిను చూడాలని ఉంది. నాన్నా... నీ పాదాలు తాకి నీతో కాసేపు కబుర్లు చెప్పాలని ఉంది. నాన్నా... నీ గొప్పతనం గురించి గొంతు పెగుల్చుకుని నాలుగు ముక్కలు మాట్లాడాలని ఉంది. నాన్నా... నను కన్నందుకు కృతజ్ఞతావందనాలు. నాన్నా... నేను పుట్టినప్పుడు నువ్వు పడ్డ ఆరాటం గురించి అమ్మ చాలాసార్లు చెప్పింది. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్‌ను తోడు పిలుచుకున్నావట. సులభంగా కాన్పు జరుగుతుందన్నా సిజేరియన్ అవసరం అవుతుందేమోని తెగ అప్పు చేసి డబ్బు పెట్టుకున్నావట. తొలికాన్పు మా బాధ్యత నాయనా అని తాతయ్య చెప్పినా, కాదు... నాకు పాప పుట్టినా బాబు పుట్టినా నా రెక్కల కష్టంతోటే భూమ్మీదకు రావాలని పుట్టింటికి పంపకుండా వాళ్లనే అమ్మ దగ్గరకు రప్పించావట. నాన్నా... ఆ కంగారులో నువ్వేం చేశావో తెలుసా. మార్చి నెల ఎండల్లో నేను పుడితే ఆ వెంటనే బజారుకు వెళ్లి ఉన్ని టవలు, ఉన్ని స్వెటరు తీసుకొచ్చావ్. అందరూ భలే నవ్వారటలే. అవి ఇంకా నా దగ్గర ఉన్నాయి. నీ లీలలు ఇంకా విన్నాను. నాకు టీకాలు వేస్తే నువ్వు ఏడ్చేవాడివట. జ్వరం వస్తే అమ్మను అస్సలు నమ్మకుండా సిరప్‌ను నువ్వే కొలత పెట్టి తాపించేవాడివట. ‘నువ్వు పడుకో’ అని అమ్మకు చెప్పి రాత్రంతా మేలుకునేవాడివట. ‘దొంగముఖమా... అన్నీ ఆయన చేత చేయించుకుని మాటలు వచ్చిన వెంటనే మొదటిమాటగా నాన్నా అనే పిలిచావు’ అని అమ్మ ఇప్పటికీ భలే ఉడుక్కుంటుందిలే. అమెరికాలో ఉన్నా కదా. నువ్వు ఊళ్లో ఉన్నావు. అందుకే నువ్వు ఉన్నట్టుగానే ‘నాన్నా’ అని చిన్నప్పుడు పిలిచినట్టు పిలుస్తుంటాను. నీ మనవడు పరిగెత్తుకొని వస్తాడు.. అచ్చు నీ పోలికలతో. నాన్నా... నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు నిజంగా తెలుసా. ఈ కూతురు ఎప్పుడూ నాన్న కూతురే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా. నాన్నా... ఐదో క్లాసులో మొదటిసారి నువ్వు నా మీద కోప్పడ్డావు. యూనిట్ టెస్ట్‌లో మార్కులు సరిగా రాలేదని ‘ఏంట్రా ఈ మార్కులు’ అన్నావ్. నాలుగు దెబ్బలు వేసినా బాగుండేది. కాని నేను గెలిచి డబ్బాలో దాచిన గోలీలన్నీ విసురుగా లాక్కుని బయటకెళ్లిపోయావ్. ఏడ్చి ఏడ్చి నిద్రపోయాను. తెల్లారి అమ్మను అడిగితే ‘ఆ గోలీలన్నీ మీ నాన్న పారేసి వచ్చాడు’ అని చెప్పింది. మళ్లీ ఏడ్చాను. వాటిలో గోధుమ రంగు గోలీలంటే నాకు ఇష్టం. నీతో నేను మాట్లాడలేదు. అలిగాను. నువు పలకరించినా ముఖం తిప్పుకున్నాను. నన్ను తిడతావా అని నీ మీద కోపంతో చదివాను. రోజూ ఎక్కువ ఎక్కువ చదువుతుంటే నువ్వు చాల్లే పడుకో అన్నా వినలేదు. వారం తర్వాత నువ్వు ఒకరోజు ఆఫీసు నుంచి తొందరగా వచ్చావ్. నన్ను సైకిల్ మీద కూచోబెట్టుకుని స్వీట్స్టాల్కు తీసుకెళ్లి గులాబ్ జామూన్ తినిపించావ్. ‘చాలా బాగా చదువుతున్నావ్’ అని ముద్దు పెట్టి పెన్ను కొనిచ్చావ్. ‘ఆడుకో. వద్దనను. కాని చదువును మర్చిపోయి కాదు’ అని ఇంటికి తీసుకు వచ్చావ్. ఆ తర్వాత నువ్వు చేసిన పని ఇవాళ్టికీ తలుచుకుంటా తెలుసా. అటక దగ్గర కుర్చీ వేసుకుని పైన దాచిన నా గోలీల డబ్బా తీసి ఇచ్చావ్. ఆటలో గోలీలతో పాటు చదువులో మార్కులు గెలవడం నేను నేర్చానంటే నీ వల్లే నాన్నా. ఇవాళ ఇంత పెద్ద ఉద్యోగం నీ వల్లే. నా అకౌంట్లో లక్షలు ఉన్నాయి. కాని నీ డబ్బులతో ఇవాళ మళ్లీ గులాబ్ జామూన్ తినాలని ఉంది. బయట కారులో వెయిట్ చేస్తున్నా. షర్ట్ వేసుకుని రా. హ్యాపీ ఫాదర్స్ డే. డాడీ... నేను ఇంటర్లో ఉన్నప్పుడు కాలేజీ నుంచి ఇంటికొస్తుంటే ఎవడో కుర్రాడు ఏదో కాయితం చేతిలో పెట్టి పారిపోయాడు. అదేమిటో కూడా చూడకుండా, వణికిపోయి, ఏడ్చుకుంటూ ఇంటికొస్తే అప్పుడే నువ్వు బయటి నుంచి వచ్చి ముఖం కడుక్కుంటున్నావు. ‘ఏంటమ్మా... ఏంటమ్మా’ అని దగ్గరకు తీసుకున్నావు. అమ్మ కంగారు పడుతుంటే అరిచి కూల్‌గా విషయం తెలుసుకున్నావు. నా చేతిలోని లెటర్ చూసి ‘ఇదా... లవ్ లెటర్’ అన్నావు. ‘కాలేజీల్లో ఇలాంటివి జరుగుతుంటాయమ్మా. పట్టించుకోకూడదు’ అని ఎంత కూల్‌గా అన్నావో తెలుసా. ఆ తర్వాత ఆ అబ్బాయిని కలిసి ఫ్రెండ్లీగా మాట్లాడావని, ఆ అబ్బాయి సారీ చెప్పాడని నువ్వు చెప్పినప్పుడు పెద్ద రిలీఫ్. అమ్మ నాకు అన్నింటిలో గైడ్ చేస్తున్నా నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పేవాడివి. ఫిజికల్‌గా, మెంటల్‌గా వచ్చే మార్పుల గురించి, ఆపోజిట్ సెక్స్‌ను చూసినప్పుడు వచ్చే అట్రాక్షన్ గురించి, ఎమోషన్స్ గురించి ఎంతో వివరించేవాడివి. మెచ్యూర్డ్ వయసు, చదువు వచ్చే వరకు వీటిని ఫేస్ చేస్తూ తప్పులు, పొరపాట్లు చేయకుండా ఉండాలని చెప్పావ్. మగవారితో ఏమైనా సమస్యలు వస్తే ముందే నీకు చెప్పేంత స్నేహం, చనువు నాకు ఇచ్చావు. నా పెళ్లి నా చాయిస్‌కే వదిలి కేవలం సలహాలు ఇచ్చావు తప్ప బలవంతం చేయలేదు. నువ్వు నా చేతిలో ఎప్పుడూ కంపాస్బాక్స్లా ఉన్నావు డాడీ. ఐ హానెస్టీ›్ల లవ్ యూ. హ్యాపీ ఫాదర్స్ డే. అబ్బా... నా జీవితంలో చాలా రోజుల పాటు నాదే మార్గమో తెలుసుకోలేదు. కానీ మీకు మాత్రం తెలుసు– మీది మీ కొడుకును సపోర్ట్ చేసే మార్గం అని. ఇంటర్ ఫెయిల్ అయ్యాను. పర్లేదు నేనున్నాగా అన్నారు. బిఎస్సీ చేరి ఒక సంవత్సరం చదివి బి.కామ్‌కు మారేను. పర్లేదు సరే అన్నారు. ఎం.బి.ఏ చేస్తానంటే ఫీజు కట్టారు. కాదు సి.ఏ చేస్తానన్నాను. ఆ ఫీజు వదిలి మళ్లీ దీని ఫీజు కట్టారు. ఒక్కరోజు తిట్టలేదు. కొట్టలేదు. హర్ట్ చేయలేదు. నేను కూడా మీరున్నారన్న ధైర్యంతోనే ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశాను. ‘నేనున్నాగా’ అనే మీ మాట. ఒక తండ్రి నుంచి పిల్లల మంచి కోసం వచ్చే ఆ మాట పిల్లలకు ఎంత బలం ఇస్తుందో. నేను డిగ్రీ పాసైనప్పుడు నాకు ఇష్టమైన హీరో సినిమా ఊళ్లో ఉందని అమ్మీతో పాటుగా మీరు మొదటిసారి నాతో సినిమాకు వచ్చారు. ‘ఎవర్రా ఆ హీరో’ అని హీరోను మెచ్చుకున్నారు. మొన్న ఆ హీరో నా ఆఫీస్‌కు వచ్చాడు అబ్బా... నాకు ఆడిటర్‌గా ఉంటారా అని. నువ్వే గుర్తుకొచ్చావు. లెక్కా, జమా చూడటంలో నన్ను మించినవాడు లేడు అబ్బా. కానీ నీ ప్రేమ లెక్కా జమాను మాత్రం చూడలేకపోతున్నాను. ఐ లవ్ యూ అబ్బా. నాన్నా... ‘ఒరేయ్.. ఒక చిన్న గదిలో ఉండి మీ నలుగురిని సాకానురా’ అని నువ్వు అనేవాడివి. నాకేం పట్టేది కాదు. నా లోకం నాది. నా చదువు నాది. నువ్వు పాకెట్ మనీ ఇస్తే దానిని దాచుకుని, నా దగ్గర ఉన్నా, నువ్వు ఒక్కోసారి చిల్లర కోసం అవస్థ పడుతుంటే నీకివ్వకుండా చోద్యం చూస్తుండేవాడిని. అంత స్వార్థం నాది. పెళ్లి చేసుకుని మళ్లీ ఇంటి వైపు చూళ్లేదు. అమ్మను, నిన్ను నా దగ్గర నాలుగు రోజులు ఉంచుకోలేదు. నేనే చుట్టపు చూపుగా వచ్చి వెళ్లేవాణ్ణి. నాతో కలిపి నీ నలుగురు పిల్లలు మా వల్ల కాదంటే మా వల్ల కాదంటూ మిమ్మల్ని ఇవాళ ఓల్డ్ ఏజ్ హోమ్‌కు పంపారు. ప్రేమ పంచడం మీ బాధ్యత. పొందడం మా హక్కు అన్నట్టు ఉండేవాణ్ణి. కాని ఇంటర్‌కు వచ్చిన నా కొడుక్కి అచ్చు నా పోలిక వచ్చింది నాన్నా. నాకు భయంగా ఉంది. నా కొడుకు నన్ను ఉత్త ఏటిఎం మిషన్లా చూస్తున్నాడు. మీరు మా ఇంటికి వచ్చి, నాతో ఉండిపోయి, నన్ను నిజమైన నాన్నను చేయండి. నేను నిజమైన కొడుకులా మారనివ్వండి. ఈ ఫాదర్స్ డే రోజున ఈ వేడుకోలు ఇదే నాన్నా. -
మా నాన్న మాకు మంచి ఫ్రెండ్
‘‘డాడీ ఈజ్ బెస్ట్. మమ్మల్ని బాగా ఆడిస్తారు. స్ట్రిక్ట్‌గా ఉండరు’’ అంటున్నారు గౌతమ్, సితార. తండ్రి మహేశ్‌బాబు గురించి అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా చెప్పారు. ► సినిమాలతో బిజీగా ఉండే మీ నాన్నగారు ఇప్పుడు కంటిన్యూస్‌గా ఇంట్లో ఉండటం ఎలా ఉంది? గౌతమ్, సితార: మాకిది క్వాలిటీ టైమ్. మూడు నెలలుగా నాన్న ఇంట్లోనే ఉంటున్నారు. మా సమ్మర్ మొత్తం నాన్నతో ఫుల్‌గా టైమ్ స్పెండ్ చేయడం హ్యాపీగా ఉంది. ► మీ నాన్నతో చాలా ఆటలు ఆడుకుంటున్నారట? స్నేక్ అండ్ ల్యాడర్ ఆడుతున్నాం. నిచ్చెన ఎక్కినప్పుడు భలేగా ఉంటుంది. వీడియో గేమ్స్ కూడా ఆడతాం. పీఎస్ 4 గేమ్స్, ఆన్లైన్ టెన్నిస్, బేస్ బాల్.. ఇలా చాలా చాలా ఆడుకుంటున్నాం. నాన్న మాతో ఫ్రెండ్‌లా ఆడుకుంటారు. ► ఫుడ్ సంగతి? మీ నాన్నకు వంట వచ్చా? క్లీన్ అండ్ హెల్దీ ఫుడ్ మాత్రమే తినాలని అమ్మ అంటుంది. వీకెండ్స్‌లో మాత్రమే పిజ్జా, బర్గర్స్ తింటాం. వెజిటెబుల్, ఫ్రూట్స్.. ఇలా అన్నీ అమ్మ ప్లాన్ చేసినట్లుగానే తింటాం. అమ్మ వంట చేయదు. నాన్న కూడా చేయరు. అయితే మాకు అప్పటికప్పుడు కావాలంటే ఇద్దరూ న్యూడిల్స్ చేసి పెడతారు. ► ఈ లాక్డౌన్లో మీ నాన్నతో కలిసి ఏమేం సినిమాలు చూశారు? తెలుగుతో పాటు హాలీవుడ్ సినిమాలు కూడా చూశాం. ‘ఫ్రోజెన్ 2’, ‘ఓక్జా’, రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ చూశాం. ఇంకా చాలా టీవీ షోస్ కూడా చూస్తున్నాం. ► ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి కదా? మీ నాన్న దగ్గరుండి గమనిస్తారా? ఈ మధ్యే స్టార్ట్ అయ్యాయి. ఇంతకుముందు రోజులో ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఆడుకునేవాళ్లం. ఇప్పుడు క్లాసులు అయిపోగానే ఆటలే. అయితే క్లాస్ జరుగుతున్నప్పుడు మాత్రం నాన్న మమ్మల్ని డిస్ట్రబ్ చేయరు. బాగా చదువుకోమంటారు. కానీ ఒత్తిడి చేయరు. ► సితారా.. నువ్వు మీ నాన్నకు హెడ్ మసాజ్ చేశావ్ కదా.. ఏమన్నారు? (నవ్వుతూ)... నచ్చిందన్నారు. తన మసాజ్ థెరపిస్ట్ కన్నా బాగా చేశానట. అమ్మతో చెప్పి నవ్వారు. ► టీనేజ్‌లో ఉన్నట్లున్నావ్ అని మీ అత్త మంజుల (మహేశ్ సోదరి) ఇటీవల సోషల్ మీడియాలో మీ నాన్న మేకోవర్ ఫొటో చూసి అన్నారు. మీ నాన్న ఇంకా హ్యాండ్సమ్గా తయారవడానికి కారణం? ఊ... లాక్డౌన్ ఉన్నప్పుడూ లేనప్పుడూ మా నాన్న మాకు ఒకేలానే ఉన్నారు. ఆయనెప్పుడూ హ్యాండ్సమ్మే. ► సరే.. ఫాదర్స్ డే సందర్భంగా మీ నాన్నకు ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? ప్రతి ఫాదర్స్ డేకి నాన్నకు స్పెషల్‌గా కార్డ్ తయారు చేసి ఇస్తాం. నాన్న చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. ఈసారి కూడా కార్డ్ తయారు చేశాం. నాన్నకు మేం ఏం చేసినా నచ్చుతుంది. చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇస్తారు. ‘అవర్ డాడీ ఈజ్ బెస్ట్’. తండ్రికి మసాజ్ చేస్తున్న సితార మహేశ్‌బాబు తనయుడు గౌతమ్‌కి 14 ఏళ్లు. కొడుకు ఎంత ఎత్తు ఎదిగాడో ఈ లాక్డౌన్లో మహేశ్ చెక్ చేస్తున్న ఫొటో ఇది. -
ఓ నాన్న కథ
రేపు ఫాదర్స్ డే నాన్న గొప్ప చెట్టు. చాలా చాలా చాలా చాలా పెద్ద చెట్టు. కానీ... చాలా చాలా చాలా చాలా చిన్నగా ఉంటాడు. తన నీడ పడితే బిడ్డ పెరగడేమోనని భయం కాబోలు... తను ఒదిగి ఉండి, మనల్ని ఎదగనిస్తాడు.చిన్న చెట్లకు పెద్ద పండ్లంటే ఇదేనేమో. మన జీవితం పండించడానికి తను పడ్డ కాయకష్టం ఇది. పిల్లలు చెప్పిన తండ్రుల కథలివి. నా తల నిమరలేదు... నా భుజం తట్టలేదు.... ‘నాన్నకు బాలేదురా’ - అమ్మ ఫోన్! అంబులెన్స్ సైరన్... ఫోన్లోంచి మొత్తుకుంటోంది. హైదరాబాద్‌లో సైరన్లు నాకు మూమూలే. అమ్మ గొంతే.. ఎప్పుడూ ఉన్నంత ధైర్యంగా లేదు. ‘ఏమైందమ్మా?’ అన్నాను. చెప్పింది. నాన్నకు హార్ట్ ఎటాక్! గుంటూరు తీసుకెళుతున్నారు. ‘‘పెద్దోడొచ్చాడు’’... నాన్నకు చెబుతోంది అమ్మ. నాన్న ఐసీయులో ఉన్నారు. పూర్తిగా పడుకున్నట్లు కాకుండా, పూర్తిగా కూర్చున్నట్లు కాకుండా బెడ్ మీద ఉంచారు ఆయన్ని. అమ్మ మాటకు నెమ్మదిగా కళ్లుతెరిచి చూశారు. నాన్న కాళ్లకు ఎదురుగా నిలబడ్డాను. ‘ఏమిటి గెడ్డం?’ అన్నట్లు నవ్వుతూ చూశారు. ‘ఏం లేదు’ అని తల ఊపాను. నేను ఆయన్నే చూస్తున్నాను. నాన్న కళ్లు కదలించారు. ఏదో చెప్పబోయారో, ఏదో అడగబోయారో! రాత్రి రెండయింది. ‘ఆయన్ని విశ్రాంతిగా పడుకోనివ్వండి’ అంటున్నారు డాక్టర్. అటెండెంట్స్ వరండాలో ఉండాలి. అమ్మకు చెప్పి బయటికి వచ్చేస్తున్నాను. ‘‘ఆగరా’’ అంది అమ్మ. నాన్న వైపు చూశాను. దగ్గరకి రమ్మన్నారు. వెళ్లాను. ఇంకా దగ్గరికి రమ్మనట్లుగా సైగ చేశారు. వెళ్లాను. ఆయన చేతులకు అందేంత దగ్గరగా. తల నిమురుతారేమో అనుకున్నాను. ఊరికే అలా అనుకున్నాను. ఏ వయసులోనూ ఆయన నా తల నిమిరిన జ్ఞాపకం నాకు లేదు. గంభీరమైన ఆయన కంఠం ఒక్కటే నా జీవితకాలంలో నన్ను తాకింది. నన్ను దిద్దింది. మరింత దగ్గరికి వెళ్లాను.. దాదాపుగా ఆయన మీదకు ఒరిగాను. ఆయన నా తల నిమరలేదు. నా చుబుకాన్ని తాకలేదు. నా భుజాన్ని తట్టలేదు. నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకోలేదు. నా కళ్లలోకి చూడలేదు. నా చొక్కా జేబుకు తన వేళ్లను తాకించారు. కొద్దిగా తల పైకి లేపి నా జేబులోకి చూశారు. తర్వాత తలను వెనక్కి అన్చుకున్నారు. అమ్మ.. నాన్ననే చూస్తోంది. ‘‘హైద్రాబాద్‌లో వాడు ఎట్లా ఉన్నాడో... డబ్బుకి ఇబ్బంది పడుతున్నాడో ఏమో’’ అంటుండే వారట నాన్న. చనిపోయే ముందు ఆయనకు ఆ మాట అనే శక్తి లేకపోయింది. నా జేబును తాకి చూశారు. - నాన్న లేని ఒక నాన్న నాడి అమ్మయితే... నరం నాన్న! అదొక రాతికట్టడపు బావి. అంచు నుంచీ అడుగు వరకూ రాతి మెట్లు. మామూలుగా అయితే ఈత నేర్పే ఆ సమయంలో నాన్న నాతోనూ, నాలా ఈదులాడే ఇంకొంత మంది పిల్లలతోనూ బావిలో ఉండేవారు. నేను ఈదడం మొదలు పెట్టాక ఆయన బావిలోకి దిగడం క్రమంగా తగ్గించారు. ఆ నీళ్లలో మేం తుళ్లుతూ ఉండటం... అలా అలవోకగా కాళ్లూ చేతులు కదిలిస్తూ ఈదడం చూసి నాన్నకు ఆనందించేవారు. ఈతలో మేం ఆనందించే సేమ్ టు సేమ్ అనుభూతినే నాన్న మమ్మల్ని చూస్తూ ఆస్వాదించేవారు. అలా గంటా గంటన్నర సేపూ మమ్మల్ని చూస్తూ ఒపిగ్గా ఉండిపోయేవారాయన. కానీ ఏదో ఒక సమయంలో ఇంటికి తీసుకెళ్లాలి కదా. అందుకోసం మమ్మల్ని నీళ్లలోంచి బయటకు తీసుకురావాలి కదా. అందుకే ఆ చర్య తనకు వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా తప్పదు కాబట్టి అలా చేశారని పెద్దయ్యాక గానీ తెలియలేదు. ఇలా మమ్మల్ని ఈతకు వదిలి... ఆయన గట్టు మీద నుంచి చూస్తూ ఉండటం నాన్నకు నిత్యకృత్యం. టైమ్‌కు అతీతమైన ఒక పారవశ్య దృశ్యం. కొన్నాళ్ల తర్వాత మమ్మల్ని ఈదులాడించడానికి వచ్చినా ఆయన తన ఫుల్‌షర్ట్, ప్యాంట్‌తో ఉండేవారు. ఇలాంటి టైమ్‌లోనే ఈత నేర్చుకునేందుకు సిద్ధపడ్డ మరో చిన్నపిల్లాడు బావిలోకి దిగాడు. ఈత రాకపోవడంతో నన్ను పట్టుకున్నాడు. అంతే... ఆ మరుక్షణం నేనూ, అతడూ ఇద్దరమూ మునక. బావి నీళ్లు గొంతుల్లోకి గుటక. అయితే అది క్షణకాలం పాటే... అక్కడ జరిగిందేమిటన్నది కొద్దిసేపటి తర్వాత గానీ నాకు తెలియరాలేదు. అనంతానంత దిగంతాల ఆవల నుంచి కాంతి ప్రయాణానికి వత్సరాలు కావాలేమో. కానీ అదే దూరాన్ని నాన్న క్షణాల్లో అధిగమించగలరని తేలిపోయింది! అదే డ్రస్‌తో ఆమాంతం బావిలోకి దూకి కడుపున పుట్టిన తన పిల్లాడినీ, కడుపున పుట్టని ఇంకో పిల్లాడినీ రక్షించారు నాన్న. తొలిసారి జీవితాన్ని ప్రసాదించడం నాన్నలకు మామూలే. కానీ ఎన్నోసార్లు తాను ఆవిర్భవింజేసిన జీవితాన్ని కాపాడారాయన. వాటిల్లో ఒకటి ఇది. ఇదే సంఘటన చెప్పి... నాకు అయిన చిన్నగాయం చూసి అమ్మ కంగారపడిందేమో... కానీ నాన్న గర్వపడ్డారు. గాయాల్ని చూసి గర్వపడటం నాన్నలకు మామూలే. అమ్మ పాదాల దగ్గర స్వర్గం ఉంటుందన్న మాట నిజమే. కానీ దాంతో పాటు సమస్త భువనాలు నాన్న పాదాల దగ్గర దాస్యం చేస్తుంటాయి. ఇంకో మాటలో చెప్పాలంటే సంస్పందిచే నాడి (రక్తనాళం) అమ్మయితే నరం నాన్న. - ఒక కొడుకు కొడుకు గొప్ప... నాన్న గొప్ప... నాకు డ్రాయింగ్ అంటే పిచ్చి. మా నాన్నకు మాత్రం పిచ్చికోపం. బొమ్మలు తప్ప సైకిల్ షాపులోనైనా, మోటర్ మెకానిక్ షాపులోనైనా ఏదో ఒకటి చదువుతోపాటు నేర్చుకుంటే బతుకు బస్టాండ్ కాదని అనే వాడు. నేను దొంగతనంగా డ్రాయింగ్ వేస్తుంటే బస్టాండ్ ముందు ఆంజనేయస్వామి, ఏసు ప్రభువు బొమ్మలు వేస్తూ అడుక్కునే వాళ్లను చూపించి అలా కావద్దని అనేవాడు. లైన్మెన్ ఆయన. పైగా మా నాన్న కింద పని చేసినోళ్లు మంచి వర్కర్స్‌గా తయారయ్యారు. నాకు మాత్రం డ్రాయింగ్ పిచ్చి వదల్లేదు. దాని నుంచి తప్పించాలని నన్ను చివరికి మా నాన్న ఓ రేడియో షాపులో పెట్టాడు. మధ్యమధ్యలో వచ్చి సూపర్వైజింగ్ చేసేవాడు. నేను డ్రాయింగ్ వేస్తూ నాన్న వచ్చే టయానికి రేడియోతో ఫోజు పెట్టేవాడిని. నాన్న దిల్ ఖుష్! మేరే దిల్ పసంద్! నేను ఓవారం రోజులు కూర్చుని లక్ష్మీదేవి బొమ్మలు గీసిన. ఆభరణాలు, పోలికలు వగైరా వగైరా అన్నీ వచ్చినయ్ ఒక ఫేస్ తక్క. కళు,్ల ముక్కు వేయడం.. చెరపటం ఓ ఇరవైసార్లు! నేను గీసిన డ్రాయింగ్ షీట్ ఫేస్ భాగం వరకూ ఉల్లిపొర కాగితం అయ్యింది. ఇంకొకసారి గీయడమే చెడిపే ఛాన్స్ లేదు. చినిగే ఛాన్స్ మిగిలింది. క్లాసుకు తీసుకుపోయిన. మా డ్రాయింగ్ సార్ శ్రీరాములు నా బొమ్మ చూసి ఇంత అద్భుతంగా ఉంది, ఫేస్ వేయరాకపోవడానికి ఏముందిరా శంకర్ అని పెన్సిల్‌తో నా కళ్ల ముందే లక్ష్మీదేవి కళ్లు, ముక్కు గీసేసరికి నాకు ఆర్టిస్ట్ కావాలనే కోరిక ఇంకా గట్టిగా ఫిక్సయిపోయింది. ఆ ఒక్క ఫేసుతో బొమ్మ వెలిగిపోయింది. సీన్ కట్‌చేస్తే ... అలా డ్రాయింగ్ వేస్తూ చిన్నగా కార్టూన్ల వైపు మళ్లింది మనసు. కార్టూన్లు గీస్తూ వారపత్రికలకు పంపేవాడిని. కొన్ని పత్రికలు పారితోషికం కూడా పంపేవి. ఒకసారి నా కార్టూన్లు అచ్చయిన ఓ వారపత్రిక కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చి నాన్నకు చూపించలేక అమ్మకు చూపించిన. నాన్నకు కూడా చూపించురా సంతోషపడ్తడు అంది. నేను ఆ ధైర్యం చేయలేకపోయిన. అమ్మ చూపిస్తే ఒకింత ఆశ్చర్యపోతూ మనోడి కార్టూన్లు ఇందులో పడ్డాయా అని ఖుషీ అయిండని చెపితే నేను మస్తు ఖుషి. ఓ పత్రిక నుంచి ఓరోజు మా నాన్న ఇంట్లో ఉండగానే మనియార్డర్ వచ్చింది. సంతకం చేసి తీసుకున్నా. అలా ఆయన ముందు ఓ నాలుగుసార్లు మనియార్డర్లు వచ్చాయి. కార్టూన్స్‌కు పైసలు కూడా ఇస్తారా అని ఆయన మా అమ్మను అడిగితే అవునని చెప్పేసరికి నా మీద ఓ చిన్న పాజిటివ్ దృక్పధం ఏర్పడింది. అలా నా ముందు నాన్న ఉన్నా కార్టూన్లు గీసే స్థాయికి చేరాను. ఓ రోజు నేను ఇంట్లోకి అడుగుపెడుతూంటే పత్రికల్లో అచ్చయిన కార్టూన్లు మా నాన్న తన దోస్తులందరినీ పిలిచి చూపిస్తూ... మావోడు మామూలోడు కాదు వాడు గీసిన బొమ్మలను పత్రికలోళ్లు వేసుకుంటారు మళ్లీ వాటికి పైసలు కూడా ఇస్తారు తెల్సా... చాలా ఫేమస్.. అని కార్టూన్ కింద నా సంతకం చూపిస్తే వాళ్లకు నా గురించి గొప్పగా చెపుతూ తను ఇంకా గొప్పగా ఫీలవుతుంటే ఇంట్లోకి రాకుండా గోడ పక్కనే నిలబడిపోయా... కళ్లలోకి వచ్చిన నీళ్లతో! - శంకర్, కార్టూనిస్ట్ ఆ కళ్లు! ఒకసారి నేను తెల్లకాగితం మీద ఇలా రాసుకున్నాను... ‘తెల్లగోడ మీద బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో మా అబ్బ నా చిన్నప్పుడు... యవ్వనమప్పుడు...ఇప్పుడు... అచ్చు అలాగే ఉన్నాడు. అమ్మ మాత్రం...మారిపోయింది’ అని. క్రాఫ్ చెరగని, తల వెంట్రుకలు నెరవని, యవ్వనం చెదరని అబ్బ ఎంత అదృష్టవంతుడు. చాలామంది ‘మా నాయిన ఇట్లా’ ‘మా నాయిన అట్ల’ అని చెబుతుంటారు. మా అబ్బ ‘ఇట్లా’ ‘అట్లా’ అని చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. ‘శ్రీరామకృష్ణ శిశుమందీర్’లో రెండో క్లాసో, మూడో క్లాసో చదువుతున్నప్పుడు ఒక మధ్యాహ్నం మా సజ్జు మామ కావచ్చు... స్కూల్‌కు వచ్చి ‘చిట్టిబాబును ఇంటికి తీసుకపోవాలె’ అని హెడ్మాస్టర్తో చిన్నగా ఏదో మాట్లాడి తీసుకెళ్లాడు. చిట్టి గంట మోగకుండానే ఇంటికి వెళ్లడం అంత సంతోషం ఏముంటుంది? ఆ సంతోషపు నావలో ఆడుతు పాడుతూ వస్తుండగానే...మా ఇంటి ముందు నుంచి దుఃఖపు సముద్రం ఎదురొచ్చింది. బీమారితో వారం రోజులు అమృల్లా హస్పటల్లో ఉలుకూపలుకు లేకుండా బెడ్ మీద ఉన్న అబ్బ చనిపోయాడట. మా అమ్మ, అన్న, తమ్ముడు...అక్కలు...అందరూ ఏడుస్తున్నారు. ఆ దుఃఖపు నది ఇప్పటికీ ఎండిపోలేదు. ఏ కాలనికి ఎండిపోదు! నేను ఊళ్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మా అబ్బ ఫోటో చూస్తాను. ఆయన పలకరిస్తున్నట్లు అనిపిస్తుంది. తిడుతున్నట్లు అనిపిస్తుంది. జాగ్రత్తలు చెబుతున్నట్లు అనిపిస్తుంది. అబ్బ లేకపోవచ్చు అమ్మ రెండు కళ్లు ఉన్నాయి. ఆ కళ్లలో అబ్బ ఉన్నాడు. ఆ కళ్లు నాతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నాయి! - పాషా మా చిన్నాయన.... నాయన అన్నా, అమ్మ అన్నా నాకు మా చిన్నాయన మహబూబ్ బాషే. నేను పుట్టగానే ఏం పనిబడిందో ఏమో నాతో చెప్పా చేయకుండా మా అమ్మ దేవుని ఊరికి వెళ్ళిపోయింది. మా తండ్రి మిలట్రి మనిషి. పరాయి రాష్ట్రాల్లో కాపురం. చుట్టపు చూపుగా వచ్చేవాడు, అట్లాంటి దిక్కులేనితనంలో మా చిన్నాయన, జేజీ, మేనత్త నన్ను సాకినారు. అందరిలోకీ మా మాబ్బాష చిన్నాయన అన్నీ తనై నన్ను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ప్రాణంపోయేంత జబ్బు చేసిన పసిగుడ్డుని నానా తంటాలు పడి కాపాడుకున్నాడట! ఎంత అన్న కొడుకైనా, రక్తపాశం వున్నా ఎంతోటి కరుణ, ఎంత దయ లేకపోతే ఆయన ఆ వయసులో నాకు నాయనగా మారిపోతాడు? వయసుకు మించి గంభీరం ఆయనది. పేద పెద్ద కుటుంబం ఆయనకి పెద్దరికం తొడిగింది. దాన్నే ఆలంబనగా చేసుకుని తన పెద్దకుటుంబానికి పెద్ద దికైై్క నిలబడినాడు, యవ్వనమంతా నొవామాదిరి కుటుంబాన్ని నావలో కూచోబెట్టి లాగినాడు, తను నీళ్ళల్లొనే వుండి. స్ఫురద్రూపం అనే కఠినమైన మాటకు అర్థం నాకు తెలియదు కానీ అటువంటిది ఏదైనా వుంది అంటే మా మాబ్బాష నాయన మొహమే నా కళ్ళ ముందుకు వస్తుంది. చక్కని రూపం, ఇక ముక్కు సంగతి చెప్పనక్కరలేదు. నూనెపల్లె గ్రామంలో మా సూటి ముక్కుల తీరు మరెక్కడా ఇంకెక్కడా కానరాదు, అటువంటి ముక్కుకింద కోర తిరిగిన మీసాలతో కనపడే చక్కని రూపం ఆయనది. ఏనాడూ ఆయన నన్ను ప్రేమారాగాలతో సాకలేదు. భయభక్తులతో పెంచాడన్నదే నిజం. ఆ భయభక్తుల్లోంచే మేం నేర్చుకోవాల్సిందేమైనా వుంటే అది నేర్చుకున్నాం. ఆ మాదిరి భయభక్తుల వల్లే పుట్టి భూమ్మీద పడి నలభై యేళ్ళయినా ఈ రోజుకు మా చిన్నాయన ముందు కూచుని ఎరుగం, పట్టుమని అయిదు నిముషాలు ఆయనతో మాటకలిపే ధైర్యం చేయం, అదే బావుంటుంది కూడా నాకు. జన్మకు నాయన ఒకరే వుంటారు, చిన్నాయన రెండ్లు, మూడ్లు, నాలుగయిదులు. అంటే ఎక్కువ ప్రేమలు అని దేవుడు నాకు మాత్రమే తెలిపిన వరం. - అన్వర్, ఆర్టిస్ట్ పోర్చుగీస్ నాన్న - ది బెస్ట్ ప్రపంచంలో అత్యుత్తమ తండ్రులు ఏ దేశం వాళ్ళు? చిన్నపిల్లల సంరక్షణ, బాధ్యతల విషయంలో ఏ దేశం వాళ్ళు ఎలా ఉంటారన్న దానిపై ప్రధానమైన 15 దేశాల్లో ‘ఫాదర్‌హుడ్ ఇన్స్టిట్యూట్’ అధ్యయనం జరిపింది. బ్రిటన్‌కు చెందిన తండ్రులు ప్రపంచంలోకెల్లా ‘వరస్ట్’ అని ఇందులో తేలింది. బ్రిటన్‌లో తల్లులు తమ పిల్లల్ని చూసుకోవడానికి గంట గడిపితే, అక్కడి తండ్రులు మాత్రం పిల్లల సంరక్షణకు కేవలం 24 నిమిషాల సమయమే వెచ్చిస్తున్నారట! దాంతో, అధ్యయనం చేపట్టిన 15 దేశాల్లో అన్నిటి కన్నా అట్టడుగున బ్రిటన్ నిలిచింది. అభివృద్ధి చెందిన దేశాలన్నిటిలోకీ చిట్టచివరి ర్యాంకు తెచ్చుకుంది. విశేషం ఏమిటంటే, ఈ దేశాల్లోకెల్లా మొట్టమొదటి ర్యాంకు పోర్చుగల్‌కు దక్కింది. ఆ దేశంలో తల్లులు ఒక గంట పాటు పిల్లల సంరక్షణలో గడిపితే, తండ్రులు 39 నిమిషాల సమయం పిల్లల బాధ్యతలు చూస్తున్నారు. ఈ అధ్యయనంతో సంబంధం లేదు కానీ, ఆ మధ్య కొన్నేళ్ళ క్రితం ఇండియాలో కూడా ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో మన దగ్గర తండ్రులు తమ పిల్లలతో రోజుకు 8 నిమిషాలే మాట్లాడుతున్నారట! ఇక, ఉద్యోగినులైన తల్లులు 11 నిమిషాలు, గృహిణులైన అమ్మలైతే రోజుకు 30 నిమిషాల పైగా పిల్లలతో సంభాషిస్తున్నారట! అంకెల మాట ఎలా ఉన్నా, పిల్లల సమగ్ర వికాసం కోసం వాళ్ళతో రోజూ వీలైనంత ఎక్కువ టైమ్ గడపడమే మంచిదని విశ్లేషకుల మాట! కేవలం పిల్లల స్కూలు విషయాలు, హోమ్ వర్క్ విషయాలే కాకుండా, వాళ్ళ ఆలోచనలు, అనుమానాలు కూడా పంచుకోవడం మంచిదని చెబుతున్నారు. అప్పుడే తల్లితండ్రులతో పిల్లలకు బంధం బలపడుతుంది. ఉత్తమ తండ్రులుగా, తల్లులుగా తలెత్తుకు నిలబడడానికి వీలవుతుంది. నాన్నతో గడిపితే తెలివితేటలు... పిల్లలు తమ తండ్రులతో కాలక్షేపం చేస్తుంటే ఏ తల్లి ఆనందానికైనా అవధులు ఉండవు. ఎందుకంటే, దాని వల్ల ఒకపక్క తనకు కాస్తంత విశ్రాంతి చిక్కడమే కాకుండా, మానసికంగా కూడా ఆనందంగా ఉంటుంది. అయితే, తల్లుల ఆనందం కోసమే కాదు, పిల్లల తెలివితేటలు పెరగడానికి కూడా తండ్రులతో హాయిగా కాలక్షేపం చేయడం అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. తండ్రులతో ఎక్కువసేపు గడపడం వల్ల పిల్లల ఐ.క్యు పెరుగుతుందనీ, చిన్నతనంలో పిల్లలపై పడే తండ్రి ప్రభావం వల్ల పిల్లల భవిష్యత్ కెరీర్ బాగుంటుందనీ తేలింది. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ న్యూక్యాజిల్‌కు చెందిన పరిశోధకులు 1958లో పుట్టిన కొన్ని వేల మంది బ్రిటీషు స్త్రీ పురుషుల్ని సర్వే చేసి, ఈ సంగతి తేల్చారు. పిల్లల కోసం పుస్తకాలు చదివి వినిపించడం, వాళ్ళతో ఆటలు ఆడడం, కలసి బయటకు విహారానికి వెళ్ళడం లాంటివాటికి తండ్రులు ఎంత టైమ్ వెచ్చిస్తున్నారన్న దాన్ని బట్టి, పిల్లల ఐ.క్యు ఉందట! ‘ఎవల్యూషన్ అండ్ హ్యూమన్ బిహేవియర్’ అనే పత్రికలో ఈ సర్వే ఫలితాలను ప్రచురించారు. గమ్మత్తేమిటంటే, ఈ పిల్లలు పెద్దవాళ్ళయి, ముప్ఫై ఏళ్ళు వచ్చిన తరువాత కూడా చిన్నప్పుడు తండ్రితో గడిపిన క్షణాలు ప్రభావం చూపుతాయి. దీన్నిబట్టి, పిల్లలకూ, తల్లితండ్రులకూ మధ్య ఉండాల్సిన బంధం విషయంలో మన భారతీయ విలువలు ఎంత గొప్పవన్నది తెలుస్తోంది. పాశ్చాత్య దేశాల్లో లాగా మన దేశంలో పిల్లలు పెద్దవగానే, వాళ్ళతో తల్లితండ్రుల బంధం తెగిపోదు. తల్లితండ్రులతో కలిసే ఉండడం, ఒక వేళ విడిగా ఉన్నప్పటికీ తరచూ వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవడం లాంటివన్నీ ఉపయోగమని తాజాగా సైన్స్ కూడా నిరూపించినట్లయింది. ఆ తెగలో... మగ అమ్మలు ప్రపంచంలోని అత్యుత్తమ తండ్రుల గురించి చెప్పమంటే, ఆంథ్రొపాలజిస్ట్లు ఆఫ్రికన్ గిరిజన్ తెగ ‘అకా’లోని మగవాళ్ళ ముచ్చటే ఎత్తుతున్నారు. ఆఫ్రికాలోని ఈ సంచార గిరిజన తెగలోని మగవారు పిల్లల పెంపకంలో అమ్మను తలపిస్తుంటారు. అమ్మ దగ్గర లేక పసిబిడ్డ గుక్కపెడుతుంటే, తండ్రులే తల్లులై తమ చనుమొనల్ని పిల్లల నోట పెడతారు. అలా అప్రయత్నంగా అమ్మలు అవుతారు. పసిబిడ్డలు వాటిని చప్పరిస్తూ, నాన్నలోనే అమ్మను చూసుకుంటారు. ఇలా పిల్లలకు మగవాళ్ళు చనుబాలు ఇవ్వడమనే విచిత్రమైన అలవాటు గురించి అమెరికన్ ఆంథ్రొపాలజిస్ట్ ఒకరు తొలిసారిగా ప్రపంచానికి చాటిచెప్పారు. ఆఫ్రికా మధ్య ప్రాంతంలో నివసించే ఈ ‘అకా పిగ్మీ’ గిరిజన తెగ మొత్తం జనాభా దాదాపు 20 వేల దాకా ఉంటుందని అంచనా. విశేషం ఏమిటంటే, ఈ గిరిజన తెగలోని తండ్రులు రోజు మొత్తంలో దాదాపు 47 శాతం సమయం తమ పిల్లలకు అందుబాటులో ఉంటారు. ఈ భూమండలం మీద ఏ ఇతర సాంస్కృతిక బృందంలోనూ తండ్రులు ఇంతగా అందుబాటులో ఉండరంటే అతిశయోక్తి కాదని నిపుణుల మాట. అందుకే, ‘అకా’ తెగ పురుషుల్ని ‘‘ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ తండ్రులు’’గా అభివర్ణిస్తుంటారు. అవును... నేను ఆయన కూతుర్నే.... ‘నన్నెందుకు వదిలేసారు వాళ్ళు?’ మూడోసారి అడిగానా ప్రశ్న. నాకు పెరుగన్నం తినిపించిన చేతి మునివేళ్ళను వసారాలో కడుక్కుంటూ ‘అప్పుడు నువ్వు ముప్ఫయ్ రోజుల పసిగుడ్డువి’ అన్నాడాయన. ‘అమ్మ జైల్లోనూ, నాన్న అడవిలోనూ ఉన్నారు మరి నిన్నెవరు చూస్తారు? అందుకే నీకు జోలపాడమని నా దగ్గరుంచారు’ నులక మంచంమీద పక్క సర్దుతూ అన్నాడు. అడవిలోనూ, జైల్లోనూ ఎందుకున్నారు? నా ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండానే నన్ను జోకొడుతూ రోజూ పాడే పాట ‘జో అచ్చుతానంద...జోజోముకుందా...’ పాటెప్పుడాగిపోయిందో తెలియదు. తెల్లవారి కళ్ళు తెరిచి చూసేసరికి ఇంటిముందు రాకాసి బొగ్గు దుమ్ము రేపుకుంటూ రయ్యిన వచ్చి ఆగింది పోలీసు జీపు. ‘దిగు శేషయ్యా...’ కరుకుగా వచ్చింది మాట. ఆయన దిగాడు. రాత్రి పెరుగన్నం ముద్దలు తినిపించిన తమలపాకుల్లాంటి మునివేళ్ళకొసలు రక్తమోడుతున్నాయి. అడుగుతీసి అడుగువేయలేకపోతున్నాడు. తూలిపడబోతూ ఇంటిబయటి గుంజను పట్టుకుని నిలదొక్కుకున్నాడు. తెల్లటి లాల్చీ, పంచెపై అక్కడక్కడా నెత్తుటి మరకలు. బిక్కచచ్చిపోయి భయం భయంగా చూస్తున్న నన్ను రమ్మన్నట్టు సైగచేసాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి కాళ్ళకు చుట్టుకుపోయి బోరుమన్నాను. నాకేదో అర్థం అయ్యి కాదు. పోలీసుల ఇనుపబూట్లు చిగురుటాకులాంటి వేళ్లను ఎలా చిదిమేస్తాయో ఆయన చెప్పిన కథ గుర్తుకొచ్చి. రాత్రి పోలీసులొచ్చి ఆయనను పట్టుకెళ్ళి ఒక నక్సలైటు కూతురిని పెంచడానికి నీకెంత ధైర్యం అంటూ రోకలి బండ కాళ్ళసందుల్లో దూర్చి, ఎలా చిత్రహింసలు పెట్టారో చెపుతుంటే విని వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ రాత్రే నా కథని పూర్తి చేసాడాయన. నన్ను కన్న తల్లిదండ్రులు నక్సలైట్లని, నాన్న పైలా వాసుదేవరావు ఎవరికీ కనిపించడని, అమ్మ చంద్రమ్మని జీవితాంతం జైల్లోనే ఉంచారని, వాళ్ళంతా తినటానికి తిండికూడాలేని పేదజనం కోసం తుపాకులు పట్టుకొని పోరాడుతున్నారని, నన్నీ ఇంటికి చేర్చిన ఆయన పెద్దన్నయ్య అత్తలూరి మల్లికార్జునరావు చిలకలూరి పేట పోలీస్ స్టేషన్‌పై దాడి లో చనిపోయాడని, ఆయన గుర్తుగా నిన్ను గుండెల్లో పెట్టుకుని దాచుకుంటున్నామని చెప్పాడు. గుంటూరు జిల్లా చింతలపూడిలో పోలీసుల దాడులనుంచి కాపాడుకునేందుకు ఓ గొడ్ల చావిట్లో తలదాచుకుంది ఈ కుటుంబం. 11 మంది సంతానంలో కటిక దారిద్య్రం మధ్య అనుకోని విధంగా ఆ యింట్లో చేరాను నేను. నన్ను బతికించుకోవడమే వారికోసవాల్గా మారింది. ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తున్న నాకు పక్కింటోళ్ళిచ్చిన మజ్జిగన్నంతోనే కడుపినింపాడు. ఓ అర్థరాత్రి చుట్టుపక్కలెవ్వరికీ తెలియకుండా కుట్టుమిషన్ని పట్టుకుని ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపురంకి వలసవెళ్ళింది మా కుటుంబం. నన్ను మొదటి సారిగా, చివరిసారిగా అడిగింది ఒక్కటే తన ఇంటిపేరుని నా పేరుచివరనుంచి తొలగించొద్దని. అందుకే నా ఇంటిపేరు పైల అయినా నా పేరు చివర అత్తలూరి అనే పెట్టుకుంటాను. అవును... నేను అత్తలూరి శేషయ్య కూతుర్ని. కనక పోయినా నన్ను పెంచిన... నేను నాన్న అని పిలిచిన ఆయనే మా నాన్న. - అత్తలూరి అరుణ నాన్న కళ్లలో నీళ్లు! మా ఇంట్లో అది తొలి పెళ్లి. నా పెళ్లి. నన్ను పట్టుచీర, పూలజడతో అలంకరించారు. నాకెంతో ఉత్సాహంగా ఉంది. నేను పుట్టిపెరిగిన అమ్మమ్మ ఇల్లే నా అత్తవారిల్లు కావడాన ఎప్పుడెప్పుడు వెళ్లాలా అని ఉరకలు వేస్తోంది మనసు. ‘ఇంక బయలుదేరాలి. రాహుకాలం వచ్చేలోపు చేరాలి కదా’ అని ఎవరో అన్నారు. నేను మా వారితోపాటు ఇంట్లో నుంచి బయటకొచ్చాను. వరండాలోకి రాగానే పందిట్లోనే ఉన్న నాన్న కుర్చీలో నుంచి లేచి నిలుచున్నాడు. ఎప్పుడూ తెల్ల బట్టలతో మెరిసిపోయే నాన్న ఆ రోజు కూడా తెల్లబట్టలే వేసుకున్నారు. కానీ ఆయన ముఖమే వివర్ణమై, చిన్నదిగా మారిపోయింది. ఆయన చెప్పింది చేయడమే కానీ ఆయన ముఖంలోకి చూసి మాట్లాడాలన్నా నాకు భయమే. అలాంటిది ఎందుకలా ఉన్నాడో అని అడిగే ధైర్యం లేదు. నా పక్కనే ఉన్న మా అమ్మ, పెద్దమ్మ... ‘ఊరికెళ్లొస్తానని నాన్నతో చెప్పు’ అన్నారు. అలాగేనని తలూపి నాన్న ముఖంలోకి చూస్తూ ‘వెళ్లొస్తా’నన్నట్లు తలూపాను. ఆయనా అలాగేనన్నట్లు తలూపారు. వెంటనే టవల్ అంచుతో కన్నీటిని అద్దుకున్నారు. ‘నాన్న కూడా ఏడుస్తాడా’ ఆశ్చర్యం వేసింది. మా నాన్న కళ్లలో కన్నీటిని చూడడం అదే మొదటిసారి. ఆయన జీవితంలో పంటలు వరదలో కొట్టుకుపోవడం, వ్యాపారంలో రావాల్సిన డబ్బు చేజారిపోవడం, బంధువులు దూరం కావడం, స్నేహితులు అనుకున్న వాళ్లు ముఖం చాటేయడం వంటివెన్నో జరిగాయి. కానీ అప్పుడెప్పుడూ ఆయన కళ్లు చెమర్చలేదు. అలాంటిది కూతురికి పెళ్లి చేసినప్పుడు ఒకవైపు పొంగిపోతూనే మరోవైపు కూతుర్ని ఇంటి నుంచి పంపించడానికి నలిగిపోవడం ఆయన వల్ల కాలేకపోయింది. ఒక్కసారికే అలా తల్లిడిల్లిపోయిన ఆయన గుండె మా చెల్లికి పెళ్లి చేసినప్పుడు మరోసారి అంతే ఆటుపోట్లకు లోనయింది. ఆ గుండె అనేక గాయాల్ని తట్టుకోగలిగింది. కానీ అనుబంధాల కోతకు మాత్రం తల్లడిల్లి పోయింది. ఇది జరిగి పాతికేళ్లయింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మా నాన్న మా అమ్మతో ‘మా ఇంటి ఆడపడుచులు అత్తగారిళ్లలో కీలకమవుతారు అని నా ముగ్గురు అక్కలు నిరూపించారు. నా కూతుళ్లూ అదే వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు’ అని చెప్పుకుని మురిసిపోతుంటారు. - మను అది నాన్న మనసు పెళ్లయ్యాక తొలిసారి అమ్మా వాళ్లింటికి వెళ్లాను. మా బాంబే ట్రిప్ గురించి అడిగారు అమ్మానాన్న. ముభావంగానే చెప్పాను. నా ముభావాన్ని అమ్మ గమనించలేదు కాని నాన్న కనిపెట్టారు. మా ఇంట్లో తూగుటుయ్యాల ఉండేది. రాత్రి భోజనలయ్యాక దాని మీద కాసేపు సేదతీరడం నాన్నకు ఆలవాటు. ఎప్పటిలాగే ఆ రోజూ రాత్రి భోజనలయ్యాక ఉయ్యాల మీద కూర్చుని ‘ఏమైంది బెటా... మీ ఆయన ఏమన్నా అన్నాడా?’ అని అడిగారు. ఏం లేదు అని చెప్పానే కానీ దుఃఖమాగక ఏడ్చేశాను. ‘మీరంతా మంచివాడు, మర్యాదస్తుడు అంటేనే కదా అతన్ని చేసుకున్నాను’ అన్నాను. ఆప్యాయంగా నా వెన్ను నిమురుతూ ‘విషయం ఏంటి బేటా...?’ అని అడిగేసరికి మా బాంబే ట్రిప్‌లో జరిగింది చెప్పేశాను. ‘అక్కడ నేను ఎత్తుమడమల చెప్పుల జత ఒకటి చూశాను. మొదటిసారి నోరు తెరిచి కొనివ్వమని అడిగాను. నువ్వేమన్నా సినిమా యాక్టర్‌వా అలాంటి చెప్పులు వేసుకోవడానికి? అంటూ వెటకారమాడాడు. ఆ చెప్పుల రూపం నా మనసులో నాటుకుపోయింది. అవి ఎంత బాగున్నాయో’ అంటూ ఆత్రంతో ఓ కాగితం తీసుకొని వాటి బొమ్మ కూడా వేశాను. రంగునూ వర్ణించాను. అంతా విని నాన్న నవ్వారు. ‘ఇక్కడ నువ్వు కూతురువి. ఇది నీ రాజ్యం. అక్కడ భార్యవు. అది ఆయన రాజ్యం. సర్దుకుపోవాలి’ అంటూ నచ్చజెప్పారు. కాని ఆ రాత్రి ఆయన నిద్రపోలేదు. తెల్లవారి పదింటికి నేను గీసిచ్చిన చెప్పుల బొమ్మ కాగితం పట్టుకొని ఇంటి నుంచి బయటపడ్డారు. ఊర్లోని ప్రతి చెప్పుల షాపూ తిరిగారు. ఎక్కడా నేను కోరుకున్న చెప్పులు దొరకలేదు. ఆ సాయంత్రమే బాంబే రైలు ఎక్కి మూడో రోజు తెల్లవారు జామున ఆరున్నరకు వచ్చారు. నేనింకా నిద్రలేవనే లేదు. నా మంచం దగ్గరకు వచ్చి ‘బేటా..’ అంటూ ఆత్మీయంగా పిలిచాడు. దిగ్గున లేచి కూర్చున్నాను. కళ్లు తెరిచి చూద్దును కదా.. నేను మనసు పడ్డ ఎత్తమడమల చెప్పులు! పట్టలేని సంతోషం. అది నా కళ్లల్లో చూసుకొని తృప్తిగా అక్కడి నుంచి వెళ్లాడు. చెప్పులు అరుగుతాయి.. కాని తండ్రి ప్రేమ అరిగేది కరిగేది కాదు కదా... ఆ ప్రేమకు రూపమైన ఆ ఎత్తుమడమలను అరగనీయకుండా దాచుకున్నాను! - లక్ష్మీశాస్త్రి అలా వెళ్లిన నాన్న మళ్లీ రాలేదు... మా నాన్న జగమెరిగిన మాస్టారు. కుంచనపల్లి, నంబూరు, వేజండ్ల, వడ్డేశ్వరం, కొలనుకొండ గ్రామాలలో ట్యుటోరియల్ సెంటర్లు నిర్వహించారు. ఎంతోమందికి చదువు చెప్పారు. తన దగ్గర చదువుకున్న విద్యార్థుల చేత ప్రైవేట్ క్యాండిడేట్లుగా పరీక్షలు రాయించేవారు. అందుకోసం పరీక్షాకేంద్రానికి దగ్గరలో ఒక ఇల్లు తీసుకుని, దాదాపు నెలరోజుల పాటు అక్కడే ఉండి, వాళ్లకు పాఠాలు చెప్పి శ్రద్ధగా పరీక్షలు రాయించేవారు. మేము పరీక్షలు రాసేటప్పుడు కూడా నాన్న మమ్మల్ని దగ్గరుండి పరీక్ష హాలుకి తీసుకెళ్లేవారు. తిరిగి మేము పరీక్ష రాసి హాలు బయటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చేవారు. చిన్నప్పుడు నాన్నను చూస్తే చచ్చేంత భయం. అల్లరి చేసేటప్పుడు గట్టిగా ఒక్క కేక వేశారంటే చాలు. చెడ్డీ తడిసిపోయేది. అలాగని కోపిష్టి ఏమీ కాదు. ఆయన్ని చూస్తే మాకు భయంతో కూడిన భక్తి అంతే! మేమంటే ఆయనకు చాలా ప్రేమ. ఎక్కడికైనా వెళ్లినప్పుడు మాకోసం పండ్లు, స్వీట్లు, ఇంకా ఏవైనా చిరుతిళ్లు తెచ్చేవారు. అప్పటికి మేము నిద్రపోతుంటే లేపి, నోట్లో పెట్టేవారు. మేము నిద్రలోనే నాన్న తినిపించిన వాటిని తినేవాళ్లం. మర్నాడు మళ్లీ మాకోసం ఏమి తెచ్చావు నాన్నా అని అడిగితే, పండ్ల తొక్కలు చూపించేవారు నవ్వుతూ. మిన్ను విరిగి మీద పడుతోందన్నా చలించేవాడు కాదు నాన్న. నిబ్బరంగా ఉండేవారు. మా అక్క పెళ్లి కొద్దిరోజుల్లోకి వచ్చింది. చేతిలో పైసా లేదు. అయినా ఆయన పట్టించుకునేవాడు కాదు. ఊళ్లో ఆయన అంటే అభిమానమున్న వాళ్లు కొందరు ‘పంతులుగారూ, అమ్మాయిగారి పెళ్లంట కదా, ఇది ఉంచండి’ అంటూ తలా కాస్త చేబదులుగా ఇచ్చారు. ఒకరి కింద ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేకనే, ట్యుటోరియల్సు, కాన్వెంటూ పెట్టుకుని సంసారాన్ని ఎలాగో నెట్టుకొచ్చాడు. చివరి రోజుల్లో అందరూ చెబుతుండడంతో అయిష్టంగానే విజయవాడలోని ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం చేశాడు. మా ఊరినుంచి రోజూ ఓ సెకండ్ హ్యాండ్ టీవీఎస్ ఫిఫ్టీ మీద స్కూలుకు వెళ్లి వచ్చేవారు. ఓ రోజు పొద్దున్నే అలా స్కూలుకని ఇంటినుంచి బయలుదేరి వెళ్లిన మా నాన్న మళ్లీ రాలేదు. లారీ ఢీకొట్టడంతో ఆయన శరీరం మాత్రమే ఇంటికి వచ్చింది. దాంతో ఇప్పటికీ నాకు ద్విచక్రవాహనమంటే అలర్జీ. ఎన్ని ఇబ్బందులున్నా సరే, బస్సు తప్ప, బండి ఎక్కను. ఒకవేళ ఎక్కాలన్నా, నాన్న పోయిన రోజున మా అమ్మ ఏడుపులే గుర్తొస్తాయి. - బాచి -
నాన్నకు ప్లేటులో...
ఆకలిలో మర్చిపోయే ప్రేమను కూడా ప్రేమ అనవచ్చు.ప్రేమలో ఆకలిని కూడా మరిచిపోయేలా చేసేది నాన్న ప్రేమ అనవచ్చు. నిజమే! నాన్న ప్రేమ కడుపు నింపేస్తుంది.రేపు ఫాదర్స్ డే! నిజానికి ప్రతిరోజూ ఫాదర్స్ డే! రేపు ఫాదర్స్ డే వేడుకలు.నాన్నకు ఏమైనా వండిపెడితే బాగుంటుంది కదూ! ప్రేమగా వండిపెడితే ఇంకా బాగుంటుంది కదూ! పెసరట్టు అమ్మ ఆరు నెలలుగా అమెరికాలో ఉంటోంది. ఇంకో రెండు మూడు నెలల్లో వచ్చేస్తుంది. అమ్మ ఉన్నప్పుడు వంటిల్లు ఎలా ఉంటుందో కూడా నాన్నకు తెలియదు. ఇప్పుడు నాన్న నేను లేచేసరికి టిఫిన్లు చేసి సిద్ధంగా ఉంచుతారు. ‘ఎందుకు నాన్నా.. పనివాళ్లు ఉన్నారుగా’ అంటే వినరు. సండే అయితే స్పెషల్స్‌తో అదరగొట్టేస్తారు. నాన్నకు పెసరట్టు అంటే చాలా ఇష్టం. నాన్నను సర్ప్రైజ్ చేయడానికి పెసరట్టు ట్రై చేస్తుంటాను. పెసరట్టు కాలుతుంటే దాని మీద అన్ని ఉల్లిపాయలు, ఇన్ని పచ్చిమిర్చి ముక్కలు, అంత కొత్తిమీర వేస్తే ఆ టేస్ట్ ఉంటుందీ.. అదన్నమాట. - నానీ కావల్సినవి: గుండు పెసరపప్పు - కప్పు; కొత్తిమీర - కొద్దిగా బియ్యం - 2 టీ స్పూన్లు; ఉల్లిపాయ - 1 (తగినన్ని) అల్లం - చిన్నముక్క; జీలకర్ర - టీ స్పూన్ పచ్చిమిర్చి - 4; ఉప్పు - తగినంత తయారీ: పెసరపప్పును కడిగి, కనీసం 5 గంటల సేపు నానబెట్టాలి. మిక్సర్జార్లో నానిన పప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బాలి. స్టౌపై పెనం పెట్టి వేడిచేయాలి. పెనం మధ్యలో పిండి వేసి గరిటెతో గుండ్రంగా తిప్పాలి. దోసెలా వేయాలి. అట్టు మీద తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర చల్లి చుట్టూ టీ స్పూన్ నూనె వేయాలి. మంట తగ్గించి పెనం మీద మూత పెట్టాలి. 2-3 నిమిషాలాగి మూత తీసి, అట్టు కాలిందేమో చూసుకొని, జాగ్రత్తగా రెండోవైపుకు తిప్పాలి. తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. పెసరట్టుకు అల్లం పచ్చడి కాంబినేషన్ అద్దిరిపోతంది. ట్రై చేయండి. కొబ్బరిపాల పాయసం నాన్నకు కొబ్బరి పాల పాయసం అంటే చాలా ఇష్టం. నా పుట్టిన రోజున, పండగలప్పుడు అమ్మ అదే చేస్తుంది. నేనూ అమ్మ దగ్గరే ఈ పాయసం చేయడం నేర్చుకున్నాను. బాగా కిస్మిస్లు, జీడిపప్పులు, నెయ్యి వేస్తే కొబ్బరి పాల పాయసం ఎంతైనా లాగించవచ్చు. ఈ ఫాదర్స్ డే కి నాన్నకోసం కొబ్బరి పాలపాయసం చేస్తాను. - ఆదాశర్మ కావల్సినవి: వెన్నతీయని పాలు - 4 కప్పులు; కొబ్బరి పాలు - కప్పు; పచ్చికొబ్బరి పేస్ట్ - కప్పు (కొబ్బరి ముక్కలను మిక్సర్జార్లో వేసి మెత్తగా చేయాలి, పేస్ట్ మెత్తగా అవ్వాలంటే 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కలపచ్చు); పచ్చికొబ్బరి తరుగు - పావు కప్పు, పంచదార - కప్పు, యాలకుల పొడి - పావు టీ స్పూన్, జాజికాయ పొడి - పావు టీ స్పూన్; నెయ్యి - టీ స్పూన్; జీడిపప్పు పలుకులు - 10; కిస్మిస్ - తగినన్ని తయారీ: మందపాటి గిన్నెలో పాలు మోసి మరిగించాలి. దీంట్లో కొబ్బరి పాలు, పేస్ట్, సన్నగా తరిగి కొబ్బరిముక్కలు వేసి ఉడికించాలి. మిశ్రమం బాగా చిక్కబడ్డాక పంచదార కలపాలి. ఈ మిశ్రమం ఉడుకుతుండగా యాలకులపొడి, జాజికాయపొడి, నెయ్యి వేసి కలపాలి. చివరగా నెయ్యిలో వేయించి జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసిదించాలి. గోంగూర పచ్చడి నాకు నార్త్ ఇండియన్ వంటకాల రుచులే తెలుసు. అమ్మ చేసే వంటలన్నీ బాగా ఇష్టంగా తింటాను. టాలీవుడ్‌కి వచ్చాక ఇక్కడి పచ్చళ్లు బాగా నచ్చాయి. మా నాన్నగారు గోంగూర పచ్చడిని బాగా ఇష్టపడతారు. ఎప్పుడైనా సరదాగా ట్రై చేస్తుంటాను. కావల్సినవి: గోంగూర - 300 గ్రాములు నూనె - టీ స్పూన్; ఎండుమిర్చి - 10 ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు మెంతులు - 1/2 టీ స్పూన్; జీలకర్ర - టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు - 3; ఉప్పు - తగినంత ఎర్ర ఉల్లిపాయ - 1 (పెద్ద ముక్కలుగా కట్ చేయాలి) పోపులోకి: నూనె - 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి - 4 రెబ్బలు (కచ్చాపచ్చాగా దంచాలి); నల్ల గుండు మినప్పప్పు - టీ స్పూన్; కరివేపాకు - రెమ్మ; శనగపప్పు - టీ; స్పూన్; ఎండుమిర్చి - 2; ఆవాలు - అర టీ స్పూన్ తయారీ: గోంగూరను శుభ్రపరిచి తడిపోయేంతవరకు ఆరబెట్టాలి. కడాయిని పొయ్యి మీద పెట్టి నూనె వేసి, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మెంతులు వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో గోంగూర వేసి మెత్తగా అయ్యేంతవరకు ఉడికించి, చల్లారనివ్వాలి. రోట్లో లేదా మిక్సర్జార్లో వెల్లుల్లి రెబ్బలు, వేయించిన దినుసులు, ఉప్పు వేసి మెత్తగా చేయాలి. దీంట్లో ఉడికించిన గోంగూర వేసి బ్లెండ్ చేయాలి. రుబ్బిన పచ్చడిని గిన్నెలోకి తీసుకోవాలి. మూకుడులో టీ స్పూన్ నూనె వేసి వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చివేయించాలి. కరివేపాకు వేసి పోపు చల్లారాక గోంగూర పచ్చడిలో కలపాలి. కావాలనుకుంటే చిటికెడు ఇంగువ కూడా పోపులో వేసుకోవచ్చు. - రకుల్ ప్రీత్‌సింగ్ సింధీ ఆలూ టుక్ ‘నాన్నకు ఆలూ టుక్ ఇష్టం’ కావల్సినవి: బేబీ పొటాటోలు (చిన్న బంగాళదుంపలు) - 20 కారం - 3/4; ఉప్పు - తగినంత; మిరియాలపొడి - పావు టీ స్పూన్ తయారీ: గిన్నెలో నీళ్లు పోసి, ఉప్పు వేసి బంగాళదుంపలను ఉడికించాలి. తర్వాత నీళ్లు వడకట్టి బంగాళదుంపలను పక్కన ఉంచాలి. బాణలిలో తగినంత నూనె పోసి కాగాక ఉడికిన బంగాళదుంపలను గోధుమరంగు వచ్చేవరకు వేయించి, తీయాలి. చల్లారాక ఒక్కో బంగాళదుంపను అరచేతితో అదమాలి. మళ్లీ కాగుతున్న నూనెలో వేసి వేయించి, ప్లేట్లోకి తీసుకొని కారం, మిరియాల పొడి, ఉప్పు చల్లి వెంటనే సర్వ్ చేయాలి. - తమన్నా గుత్తొంకాయ నేను కిచెన్‌లోకి వెళ్తానంటే నాన్న కంగారు పడతారు. సరదాగా అమ్మతో కలిసి ఆటపట్టిస్తుంటారు. నాన్నకు గుత్తొంకాయ అంటే చాలా ఇష్టం. గుత్తొంకాయ కూరంటే చాలా పెద్ద పనే! కానీ, అమ్మ సాయంతో ఈ కర్రీ చేసి నాన్న చేత మార్కులు కొట్టేస్తా! కావల్సినవి: పల్లీలు, నువ్వులు, ఎండుకొబ్బరి తురుము - ఒకొక్కటి 100 గ్రాముల చొప్పున; చింతపండు - నిమ్మకాయ పరిమాణం (నీళ్లు పోసి నానబెట్టాలి); వంకాయలు - 6; ఉల్లిపాయలు - 1 (పెద్దది. సన్నగా తరగాలి); ఎండుమిర్చి - 4; నూనె - 2 టేబుల్ స్పూన్లు; కారం - టీ స్పూన్; అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు; కరివేపాకు - రెమ్మ; ఉప్పు - తగినంత కొత్తిమీర - టీ స్పూన్ తయారీ: పల్లీలు, నువ్వులు వేయించి చేసిన పొడి, కొబ్బరి, చింతపండు గుజ్జు, కారం, తగినంత ఉప్పు కలిపి ముద్ద చేయాలి. వంకాయలను నాలుగువైపు లా కట్ చేయాలి. పైన సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని కట్ చేసిన వంకాయల్లో కూరాలి. కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కలపాలి. కరివేపాకు, ఉల్లిపాయ తరుగు, స్టఫ్డ్ వంకాయలు, మిగిలిన గ్రేవీ వేసి కలిపి ఉడికించాలి. వంకాయలు, మిశ్రమం చక్కగా ఉడికాక కొత్తిమీర చల్లి దించాలి. - నిహారిక -
హ్యాపి ఫాదర్స్ డే