breaking news
BIBA brand
-
పవర్ఫుల్ లీడర్స్
కాండీర్ హురున్ ఇండియా ఉమెన్ లీడర్స్ లిస్ట్‌లో పన్నెండు విభాగాలకు చెందిన 117 మంది మహిళలు చోటు సాధించారు. గ్రామీణ రేడియో ‘కన్ ఖజురా టేసన్’తో మారుమూల పల్లెలకు తమ ప్రాడక్ట్‌లను పరిచయం చేసిన హిందుస్థాన్ లివర్ సీయీవో, మేనేజింగ్ డైరెక్టర్ ప్రియా నాయర్... డ్రోన్, ఏరోస్పేస్ రంగాలలో మహిళల ఉనికి అంతంత మాత్రంగానే ఉన్న కాలంలో ఆ రంగంలోకి అడుగు పెట్టి సత్తా చాటిన ‘గరుడ ఏరోస్పేస్’ కో–ఫౌండర్, చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రితికా మోహన్... ఎనిమిది వేల రూపాయల పెట్టుబడితో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం ప్రారంభించి కోట్లకు పడగలెత్తిన రెడీ–టు–వేర్ ఎత్నిక్ ఫ్యాషన్ బ్రాండ్ ‘బిబా’ వ్యవస్థాపకురాలు మీనా బింద్రా గురించి...మిస్డ్‌కాల్ ఇస్తే చాలు...హిందుస్థాన్ యూనీలివర్ (హెచ్‌యుఎల్)లో చేరిన రోజు నుంచే ఆ దిగ్గజ కంపెనీలో స్టార్‌గా వెలుగుతున్నారు ప్రియా నాయర్. హెచ్‌యుఎల్‌లో చేరిన తరువాత తొలిరోజుల్లో నాయర్ చేసిన పని... కొత్త ప్రాడక్ట్ రిలీజ్ కాదు. ‘కన్ ఖజురా టేసన్’ అనే విచిత్రమైన పేరుగల గ్రామీణ రేడియో నిర్వహణ బాధ్యతలను భుజాలకెత్తుకున్నారు. కనెక్టివిటీ తక్కువగా ఉన్న మారుమూల గ్రామాల్లోని పేదప్రజల కోసం ఈ రేడియోను తీసుకువచ్చారు. శ్రోతలు ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు పదిహేను నిమిషాల పాటు మ్యూజిక్, జోక్స్ వినిపిస్తారు. దీంతోపాటు తమ బ్రాండ్‌కు సంబంధించి విషయాలను కూడా వినిపించే ఈ ప్రోగ్రామ్ సూపర్ హిట్.ఈ గ్రామీణ రేడియోను నాయర్ ప్రారంభించడానికి కారణం....ప్రియా నాయర్ తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు సాధారణంగా పట్టణ మార్కెట్లో అమ్మే కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండీషనర్‌ను ఒక పేదరైతు కొనడాన్ని ఆమె గమనించారు. ప్రీమియర్ ప్రాడక్ట్‌లను పట్టణ ప్రాంతవాసులు మాత్రమే కాదు పల్లెల్లోని పేదలు కూడా కొంటారనే విషయం ప్రియకు అర్థమైంది.‘ ప్రాడక్ట్ గురించి వింటేనే కదా ప్రజలు వాటిని కొనేది’ అనే ఆలోచనతో తమ ప్రాడక్ట్‌ల గురించి గ్రామీణ ప్రజలకు తెలియజేయడానికి ‘కన్ ఖజురా టేసన్’ పేరుతో గ్రామీణ రేడియోను ప్రారంభించి, మారుమూల గ్రామాల మనసును గెలుచుకున్నారు నాయర్. రితిక... తనదైన రీతిలో...‘ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించడానికి స్ట్రాంగ్ ఐడియాలు, స్మార్ట్ స్కిల్స్ అత్యవసరం’ అంటున్నారు ‘గరుడ ఏరోస్పేస్ కో–ఫౌండర్, చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రితికా మోహన్. డ్రోన్, ఏరో స్పేస్ రంగాలలో మహిళలు చాలా తక్కువగా ఉన్నారు. మహిళలు ఈ రంగంలో నిలదొక్కుకోవడమే కాదు నాయకత్వ స్థానాల్లో కూడా రాణించగలరని నిరూపించారు.రితిక ఏరో స్పేస్ రంగంలోకి అడుగు పెట్టినప్పుడు డ్రోన్ పరిశ్రమ దాదాపుగా ఉనికిలోనే లేదు.డ్రోన్ తయారీ సంస్థగా గుర్తింపు ఉన్న ‘గరుడ ఏరోస్పేస్’ పైలట్ శిక్షణ, డ్రోన్–యాజ్–ఎ–సర్వీస్ ఆపరేషన్స్, ఏఐ–సామర్థ్యం గల డేటా వర్క్–ఫ్లో... మొదలైన వాటితో డ్రోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీగా తన పరిధిని విస్తరించుకుంది. కంపెనీకి సంబంధించి మౌలిక సదుపాయాలను నిర్మించడంలో రితిక కీలక పాత్ర పోషించారు.అయితే రితిక ప్రయాణం నల్లేరు మీద నడకేమీ కాదు. పురుషాధిక్య పక్షపాతాలతో పాటు ఎన్నో రకాల సవాళ్లు ఆమెకు ఎదురయ్యాయి. అవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగిన రితిక ‘స్ట్రాంగ్ ఉమన్’ అనిపించుకున్నారు. సవాలు విసిరే సంక్లిష్టమైన ప్రాజెక్ట్‌లలోకి ‘గరుడ ఏరోస్పేస్’ అడుగు పెట్టినప్పుడు, కంపెనీకి తగిన కార్యాచరణ ప్రణాళికను అందించడంలో రితిక కీలక పాత్ర పోషించారు. రెడీ టు వేర్‌తో తొలి అడుగులు దిల్లీలో పుట్టి పెరిగిన ఎథ్నిక్ వేర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి ఆ రంగంలో మార్గదర్శకురాలిగా నిలిచారు. రెడీ–టు–వేర్ ఫ్యాషన్ బ్రాండ్ ‘బిబా’ను ప్రారంభించడానికి ముందు ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూస్తూ ఇంటికే పరిమితం అయ్యారు మీనాబింద్ర. ఇరవైఏళ్ల వయసులో ఆమెకు వివాహం జరిగింది.‘నేవీ ఆఫీసర్ భార్య’గానే మీనాకు గుర్తింపు ఉండేది.పిల్లలు పెద్దవాళ్లయ్యాక, ఖాళీగా ఉన్న రోజుల్లో వ్యాపారరంగంలోకి అడుగు పెట్టాలనుకున్నారు మీనా. అయితే ఆమెకు వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేదు. నలభై ఏళ్ల వయసులో తన ఇంటినుంచే సాధారణ కాటన్ ప్రింటెడ్ సూట్లను అమ్మడం మొదలు పెట్టారు. అలా 1988లో ‘బిబా’ మొదలైంది. రెడీమెడ్ చుడీదార్–కుర్తాలకు అవసరమైన వస్త్రాలను సేకరించడం సవాలుగా ఉన్న రోజుల్లో ఈ రంగంలోకి అడుగు పెట్టిన మీనా బింద్రా తనదైన ప్రత్యేకతతో మార్కెట్లో దూసుకుపోయారు.ఎనిమిది వేల రూపాయలతో ప్రారంభమైన చిన్న బొటిక్‌ను కొట్లాది రూపాయల విలువైన ‘బిబా అపెరల్స్’ కంపెనీగా మార్చారు. దీని వార్షిక టర్నోవర్ ఆరువందల యాభై కోట్లు!‘సందేహాలు వద్దు, ప్రయాణంలోనే ఒక్కటొక్కటిగా అన్నీ నేర్చుకుంటాం. మీలో ఎక్కడో దాగి ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీయండి. తప్పకుండా విజయం సాధిస్తారు’ అంటున్నారు మీనా బింద్ర. -
విజయం: ఆమె ఆలోచనే ఒక బ్రాండ్!
వ్యాపారంలో విజయవంతం అయిన ప్రతి ఒక్కరి వెనుక ఒక వైవిధ్యభరితమైన మార్కెటింగ్ ఐడియా ఉంటుంది. రొటీన్‌గా పడే కష్టాలుంటాయి. ఈ రెండు మిళితమైతే అద్భుతమైన సక్సెస్‌ను సాధించి పెడతాయి. అలా ఎనిమిది వేల రూపాయలతో మొదలు పెట్టిన వ్యాపారాన్ని పాతికేళ్లలో ఆరు వందల కోట్ల రూపాయల స్థాయికి చేర్చిన మహిళ మీనా బింద్రా. బ్యాంక్లోన్తో మొదలుపెట్టి వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన సాధారణ గృహిణి ఈమె. ‘బిబా’ బ్రాండ్ గురించి తెలియని అర్బన్ ఆడపిల్లలు దాదాపుగా ఉండరు. టాప్స్, కుర్తా, లెగ్గింగ్స్లలో బిబా బ్రాండ్ చాలా మంది అమ్మాయిల ఫేవరెట్. ఈ డిజైనర్ వేర్ సృష్టికర్త మీనా బింద్రా. ఆమె ఆలోచన, కష్టం, అదృష్టం బిబా కు ప్రాణం పోశాయి. ఒక బ్రాండ్‌గా ఎదిగేలా చేశాయి. ‘కష్టాలు, కడగండ్లు ఎదురైనప్పుడు సహనం, పట్టుదలలు మంత్రాల్లాంటివి. వీటిని ఆయుధంగా చేసుకుంటే ఎటువంటి పరిస్థితులతోనైనా పోరాడవచ్చు...’ అంటారు మీనా బింద్రా. ఎనిమిది వేలతో మొదలైంది... బ్యాంక్ వాళ్లు లోన్‌గా ఇచ్చిన ఎనిమిది వేల రూపాయలతో ముంబై లోని ఒక ఏరియాలో 1986లో మీనా బింద్రా ఫ్యాబ్రిక్ వేర్ మొదలైంది. చిన్నపిల్లలకు, అమ్మాయిలకు డ్రస్‌ల అమ్మకం జరిగేదక్కడ. సరుకును తెచ్చుకోవడం, అమ్మడం.. లాభాలు మొదటి వారం నుంచే కళ్ల ముందు కనిపించేవి. ఆ ఉత్సాహంతో మీనాలోని డిజైనర్ నిద్రలేచింది. అమ్మాయిలను ఆకట్టుకొనేలా చుడీదార్లను డిజైన్చేయడం మొదలైంది. అనతి కాలంలోనే ఆ ఏరియాలో మీనా వాళ్ల షాప్ ఫేమస్ అయ్యింది. షాప్‌లోకి సేల్స్‌గర్ల్స్ వచ్చారు. మీనా తన డిజైన్లతో డీలర్ స్థాయికి ఎదిగారు. మొత్తంగా ఎనిమిది సంవత్సరాల్లో ముంబైలోని చాలా షాప్‌లలో మీనా డిజైనర్ వేర్ లభించడం మొదలయ్యింది. ప్రతిబంధకాలూ... ఉన్నాయి 80వ దశకం దాటి 90 వ దశకం వచ్చింది అంతలోనే ఒక కుదుపు. డిజైనింగ్ వచ్చింది మీనాకు మాత్రమే కాదు. అనేక షాప్‌ల వారు సొంతంగా డిజైనర్లను పెట్టుకొని డ్రస్సులను డిజైన్ చేయించుకోవడం మొదలుపెట్టారు. మీనాకు భయం మొదలైంది. తను కొత్త ప్రయోగాలు చేస్తున్నా డిమాండ్ తగ్గిపోయింది. ఈ సమయంలోనే మీనా ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో షాప్‌ల వారి దగ్గరకు వెళ్లారు. ఆ వైవిధ్యమైన ఆలోచనే ‘ఎథికల్ వేర్’. అమ్మాయిల ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కుతున్న ఆ సమయంలో, ఆడపిల్లల డ్రస్సుల్లో అసభ్యత తొంగి చూస్తున్న సమయంలో... భారతీయతను ప్రతిబింబించే నిండైన డిజైన్లతో మీనా ‘బిబా’ను మొదలుపెట్టింది. పంజాబీలో చిన్న పిల్లను బిబా అని పిలుస్తారు. ఆ విధంగా బిబా అనే పేరు ను తన బ్రాండ్‌కు పెట్టుకున్నారు మీనా. టైమ్ కలిసొచ్చింది... 28 యేళ్ల క్రితం మన దేశంలో రెడీ మేడ్ దుస్తులు అప్పుడప్పుడే వినియోగంలోకి వస్తున్న రోజుల్లో నా ప్రయత్నం మొదలుపెట్టాను. ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి అది వందశాతం కచ్చితమైన సమయం. దాంతో నాకు బాగా కలిసొచ్చింది. ఇక తమ పిల్లలు చూడచక్కని బట్టలు వేసుకోవాలని అందరు తల్లిదండ్రులూ అనుకొంటారు. అయితే ఫ్యాషన్ పేరుతో అసభ్యకరమైన డ్రస్సింగ్‌ను మాత్రం ఒప్పుకోరు. అలాంటి వారికి సౌలభ్యంగా ఉండేందుకు ఎథికల్ వేర్‌ను మొదలుపెట్టాను. ఇది బాగా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా స్టోర్స్ ఉన్నాయి. కొత్తగా నెలకు నాలుగైదు కొత్త స్టోర్లు ప్రారంభిస్తున్నాం. ప్రత్యేకమైన డిజైనింగ్ టీమ్ ఉంది. మొదట బట్టలషాప్ పెట్టిన రోజు ఈ స్థాయికి ఎదుగుతామని ఊహించలేదు. ఇపుడు అంతర్జాతీయ స్థాయికి కూడా ఎదగగలమనే నమ్మకం ఉంది. వందల కోట్ల టర్నోవర్ సాధించాం. వేల కోట్లకు సులభంగానే చేరుకొంటామనే విశ్వసిస్తున్నాను. ఈ విషయంలో నా భర్త, నా పిల్లలు, నా టీమ్ సహకారం మాత్రం అద్వితీయమైనది...’ అని మీనా బింద్రా అంటారు. - ప్రకాష్ చిమ్మల


