బాగుపడ్డాం... హాపీగా ఉన్నాం!

బాగుపడ్డాం...  హాపీగా ఉన్నాం! - Sakshi


వెలుగులు విరజిమ్ముతున్న సేంద్రియ వ్యవసాయ సంస్కృతి

 

అప్పులపాలైన బడుగు రైతు బతుకు ఏం చేస్తే నిజంగా బాగుపడుతుంది?



అదికూడా.. ఎడతెగని కరవుకు, అన్నదాతల ఆత్మహత్యలకు నెలవైన అనంతపురం జిల్లా నుంచి వలస పోయి పొట్టపోసుకుంటున్న



రైతు జీవితాన్ని ఆకుపచ్చగా మార్చడానికి ఏం చేస్తే బాగుంటుంది?



నాలుగేళ్ల క్రితం కల్యాణ్ అనే ఓ కార్పొరేట్ ఉద్యోగి తనకు తాను ఇవే ప్రశ్నలు వేసుకున్నాడు. నెలకు రూ.2 లక్షల ఆదాయం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టి.. ఈ ప్రశ్నలకు బాధ్యత గల పౌరుడిగా చిత్తశుద్ధితో సమాధానాలు వెతికాడు. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం, స్వయం సమౄద్ధ జీవనాన్నే కల్యాణ్ కలగన్నాడు. ఈ కలను సాకారం చేసుకోవడానికి నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన నిర్మాణాత్మక కృషి సత్ఫలితాలనిస్తోంది. ఓ చిన్న రైతు కుటుంబాన్ని అప్పుల ఊబి నుంచి, వలస వెతల నుంచి రక్షించి సగర్వంగా తన కాళ్లపై తనను నిలబెట్టింది. ఆ అదృష్టవంతుడైన రైతు పేరు లచ్చన్నగారి రామచంద్రారెడ్డి. దండగ మారి ‘గవర్నమెంటు ఎరువులు’ వదిలేసి.. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని పండుగలా మార్చుకున్నాడాయన. ఇప్పుడా రైతు కుటుంబానికి ఆదాయ భద్రతతోపాటు బతుకుపై భరోసా కూడా చేకూరింది! దిశానిర్దేశం చేసి, తగిన తోడ్పాటునందిస్తే బడుగు రైతు బతుకు శాశ్వతంగా బాగుపడుతుందనడానికి రామచంద్రారెడ్డి అనుభవమే ఉదాహరణగా నిలుస్తుంది.



 లచ్చన్నగారి రామచంద్రారెడ్డి(36), సుగుణమ్మ దంపతులకు 13 ఏళ్ల కుమారుడు ఆనంద్‌రెడ్డి ఉన్నాడు. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం ఆరుమాకులపల్లి వారి స్వగ్రామం. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రామచంద్రారెడ్డి చదువు పదో తరగతితో ముగిసింది. 3 ఎకరాల్లో పొలంలో ‘గవర్నమెంటు(రసాయనిక) ఎరువుల’తో వ్యవసాయం చేస్తే.. రూ. 1.75 లక్షల అప్పులు మిగిలాయి. కాడి కింద పడేసి పొట్టచేతపట్టుకొని కుటుంబ సమేతంగా బెంగళూరెళ్లి కూలి పని చేసుకుంటూ పొట్ట పోసుకుంటుండగా.. హిందూపురానికి చెందిన విశ్రాంతాచార్యులు రాజారావు కుమారుడు కల్యాణ్ తారసపడ్డాడు. తిరిగి సొంతూరు వచ్చేస్తే పచ్చగా పంటలు పండించుకుంటూ బతుకును బాగు చేసుకునే దారి చూపుతానన్నాడు. వలస బాటపట్టిన రామచంద్రారెడ్డి ఆ విధంగా మరల సేద్యానికి మళ్లాడు. ఇది జరిగిన నాలుగేళ్ల తర్వాత.. ‘అప్పులు తీరిపోయాయి. ఆనందంగా ఉన్నాం’ అంటున్నాడు. అంతేకాదు.. వ్యవసాయం దండగ కాదు.. పండగ చేసుకునే దారిదీ అని నలుగురికీ చెప్ప గలిగే స్థితికి ఎదిగాడు.



పంటకు, ఇంటికీ సొంత ఇంధనమే!   



ఎంబీఏ చదివి జెనరల్ ఎలక్ట్రికల్‌లో నెలకు రూ. 2 లక్షలు సంపాదించే కల్యాణ్ గ్రామీణ పేదలకు సేవ చేసే లక్ష్యంతో ‘ఇంటిగ్రేటర్ ఫౌండేషన్’ను నెలకొల్పారు. ఆయన సమకూర్చిన మౌలిక సదుపాయాలు, పర్యావరణహితమైన స్వతంత్ర జీవన విధానం, సేంద్రియ సాగు పద్ధతి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఉన్నతంగా నిలబెట్టింది. సొంతంగా తయారు చేసుకున్న పంకాతో ఇంటి అవసరాలకు పవన విద్యుత్ అందుతోంది. సోలార్ విద్యుత్‌తో బోరు నడుస్తోంది. బయోగ్యాస్‌తో వంట అవసరాలు తీరుతున్నాయి. రామచంద్రారెడ్డి కుటుంబంతోపాటు కల్యాణ్ కుటుంబం, ఇంతియాజ్ అనే మరో విద్యాధిక యువకుడు కూడా పొలంలో నిర్మించిన మట్టి ఇళ్లలో నివాసం ఉంటూ.. పొలం పనుల్లో నిమగ్నమవుతున్నారు. 3 ఎకరాల పొలంలో మూడేళ్ల క్రితం 300 అడుగులు తవ్విన బోరు నుంచి ఇప్పటికీ 3 అంగుళాల నీరు వస్తుండడంతో పొలానికి సాగునీటి సమస్య తీరిపోయింది. భూమిని రామచంద్రారెడ్డి దంపతులే స్వయంగా చదును చేసుకున్నారు. మూడు సొంత నాగళ్లతోనే దుక్కి దున్నడం అంతా. వ్యవసాయ పనులేవైనా సాధ్యమైనంత వరకు సొంతంగా చేసుకోవడమే. మరీ అవసరమైనప్పుడే కూలీలను పెట్టుకునేది. ఈ ఏడాది 3 ఎకరాల సాగుకు రూ. 10 వేలకు మించి కూలీలకు ఖర్చు పెట్టలేదు. 26 గిర్ ఆవులతో కల్యాణ్ ఏర్పాటు చేసిన డెయిరీ అందుబాటులో ఉండడంతో.. రామచంద్రారెడ్డి వ్యవసాయానికి పశువుల పేడ, మూత్రం కొరత లేకుండాపోయింది. సొంతంగా తయారు చేసుకునే వర్మీ కంపోస్టు, జీవామృతం, పంచగవ్యతో వ్యవసాయం చేస్తున్నారు. మరీ అవసరమైతే తప్ప ఏమీ కొనకూడదన్నది సూత్రం. ఈ ఏడాది బెల్లం, వస్త్రాలు తప్ప ఏమీ కొనలేదని రామచంద్రారెడ్డి చెప్పారు.  



రైతుబజారులో రెట్టింపు ధరకు అమ్మకాలు



సొంతానికి అవసరమైన అన్ని పంటలూ పండించుకోవడం, అదనంగా ఉన్న పంట దిగుబడులను మాత్రమే అమ్మటం- ఇదే మూల సూత్రం. రామచంద్రారెడ్డి తమ సేంద్రియ ఉత్పత్తులను హిందూపురం రైతుబజారుకు తీసుకెళ్లి రెట్టింపు ధరకు విక్రయిస్తుండడంతో మంచి ఆదాయం వస్తోంది. గడచిన ఖరీఫ్‌లో పంటల ద్వారా చక్కటి ఆదాయం పొందారు. అరెకరంలో 30 బస్తాల ధాన్యం పండించి, సొంత వినియోగం కోసం ఉంచుకున్నారు. అరెకరంలో 800 కిలోల రాగులు పండించి కొన్ని అమ్మారు. అరెకరంలో 800 కిలోల వేరుశనగలు పండించారు. ఎకరంలో కొత్తిమీర వేసి 45 రోజుల్లోనే రూ. లక్ష ఆదాయం పొందారు. టమాటా నాటబోతున్నారు. అరెకరంలో మిర్చి వేశారు. వారం వారం కాయలు కోసి రైతుబజార్‌కు తీసుకెళ్లి అమ్ముతున్నారు. ఇప్పటికి రూ. 42 వేల ఆదాయం వచ్చింది. మరో రూ. 50 వేలు వస్తుందని అంచనా వేస్తున్నారు. 3 ఎకరాల్లో పంటల సంగతి అట్లా ఉంచితే.. ఇంటి వద్ద 3ఁ5 సైజ్ గల 8 ఫైబర్ టబ్‌ల(వికింగ్ బెడ్స్)లో ఇంటికి కావలసిన కూరగాయలు, ఆకుకూరలను సేంద్రియ ఎరువులతో పండించుకుంటున్నారు. రామచంద్రారెడ్డి సాధించిన విజయం గ్రామంలో పలువురు రైతులను ఆకర్షిస్తోంది. ఈ ఏడాది కొందరు రైతులు ఈ పద్ధతిలో సాగు చేస్తున్నారు. రైతులందరకూ ఈ తరహా జీవన శైలిని, విషరహిత వ్యవసాయ పద్ధతిని అలవరచుకొని నిశ్చింతగా బతికేలా శిక్షణ ఇవ్వాలని.. గ్రామీణ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కల్యాణ్ (097417 46478) ఆశిస్తున్నారు.

 - హెబ్బార్ చక్రపాణి, హిందూపురం, అనంతపురం జిల్లా

 

విషం లేని ఆహారం పండిస్తున్నాం..



 కల్యాణ్ సారు చెప్పినట్టు చేస్తూ.. విషం లేని ఆహారం పండించి తింటున్నాం. ఖర్చు లేని వ్యవసాయం చేస్తున్నాం. పెద్దోళ్లు చేసిన వ్యవసాయం ఇది. మొదటి ఏడాది సరిగ్గా దిగుబడి రాలేదు. తర్వాత బాగుంది. భూమి రంగు మారి సత్తువ పెరిగింది.  అప్పులు తీరాయి. బాగుపడ్డాం. హాపీగా ఉన్నాం. ఇతర రైతులూ ఇలాగే బాగుపడాలని అడిగిన వారికి చేతనైన సాయం చేస్తున్నాం.

 - లచ్చన్నగారి రామచంద్రారెడ్డి (85009 86728),

 ఆరుమాకులపల్లి, చిలమత్తూరు మండలం, అనంతపురం జిల్లా.

 

 

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top