
ఏపీలో భారీగా పెరిగిన ఇంజినీరింగ్ ఫీజులు
ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులు భారీగా పెరిగాయి.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులు భారీగా పెరిగాయి. 273 కాలేజీల్లో ఫీజులు పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే మూడేళ్ల వరకు పెంచిన ఫీజుల విధానం అమలు కానుంది. బీటెక్ కోర్సులకు గరిష్ట ఫీజు రూ. లక్షా 8వేలు, కనిష్ట ఫీజు రూ.35 వేలుగా నిర్ధారించారు. ఎంటెక్ గరిష్ట ఫీజు రూ. లక్ష, కనిష్ట ఫీజు రూ.45 వేలు చేశారు.
బీటెక్లో గరిష్ట ఫీజులు ఉన్న కాలేజీల వివరాలు..
వీఆర్ సిద్ధార్థ కాలేజీ రూ. లక్షా 2వేలు
ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజీ లక్షా 8వేలు
గాయత్రి విద్యా పరిషత్ లక్షా 3వేలు,
జీఎమ్ఆర్ఐటీ లక్షా వెయ్యి
గాయత్రి ఉమెన్స్ కాలేజ్ 97 వేల 600 రూపాయలు
ఈనెల 26న సాయంత్రం 6 గంటలకు ఆన్లైన్లో ఫీజుల వివరాలు ఉంచనున్నారు. 27న వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలు కానుందని మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. 29న విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు. జూలై 1 నుంచి ఇంజినీరింగ్ క్లాసులు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు.