ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ అని నమ్మి వెళ్లినందుకు.. | Facebook friend rapes minor girl in Bengaluru | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ అని నమ్మి వెళ్లినందుకు..

Sep 8 2016 2:11 PM | Updated on Jul 28 2018 8:53 PM

ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ అని నమ్మి వెళ్లినందుకు.. - Sakshi

ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ అని నమ్మి వెళ్లినందుకు..

ఫేస్‌బుక్‌ స్నేహితుడు అని నమ్మి వెళ్లినందుకు ఓ 16 ఏళ్ల అమ్మాయి దారుణంగా మోసపోయింది.

బెంగళూరు: ఫేస్‌బుక్‌ స్నేహితుడు అని నమ్మి వెళ్లినందుకు ఓ 16 ఏళ్ల అమ్మాయి దారుణంగా మోసపోయింది. మత్తుమందు ఇచ్చి ఆమెపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఈ ఘటనను తాను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించానని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఆ వీడియోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తానని హెచ్చరించాడు. మైనర్ బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఆ కిరాతకుడిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నగరంలో జరిగిన ఈ ఘటన తాలుకు వివరాలివి..

బాధితురాలికి ఆరు నెలల కిందట నిందితుడు డానియెల్ (24)  అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. గత సోమవారం సాయంత్రం ఆమె తన స్నేహితురాలి పుట్టినరోజు విందుకు వెళ్లింది. అక్కడికి డానియెల్‌ కూడా వచ్చి ఆమెతో మాట్లాడాడు. తాను కూడా ఓ చిన్న పార్టీ ఇస్తున్నానని, దానికి నువ్వు కూడా రావాలని బలవంతపెట్టాడు. మొదట బాధితురాలు ఒప్పుకోలేదు. చాలా బలవంతపెట్టడంతో చివరకు ఒప్పుకుంది. దీంతో డానియెల్‌ ముందే వెళ్లిపోయాడు. ఆ తర్వాత డానియెల్‌ స్నేహితుడు బాధితురాలిని తన బైక్‌పై తీసుకెళ్లి.. అతడు ఉన్న ఇంటివద్ద విడిచిపెట్టాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో బాధితురాలు అనుమానించింది. అయితే, ఆమెతో బలవంతంగా మత్తుపదార్థం కలిపిన కూల్‌ డ్రింక్ తాగించిన నిందితుడు.. స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన ఘటన తెలుసుకొని బాధితురాలు నిర్ఘాంతపోయింది. జరిగిన ఘటనను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించానని, దీని గురించి పోలీసులకు చెప్తే ఆ వీడియోను ఇంటర్నెట్‌లో పెడతానని డానియెల్‌ బెదిరించాడు. అనంతరం ఆమెను ఇంటివద్ద వదిలేశాడు. అయితే, బాధితురాలు జరిగినదంతా ఇంట్లో చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు డానియెల్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement