
బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించాలి
బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించాలని ఆదివారం ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో జీపు జాత నిర్వహించారు.
బెల్లంపల్లిరూరల్/నెన్నెల : బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించాలని ఆదివారం ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో జీపు జాత నిర్వహించారు. మండలంలోని పెర్కపల్లి, బట్వాన్‌పల్లి, తాళ్లగురిజాల, మాలగురిజాల, రంగపేట, దుగినేపల్లి గ్రామాలతోపాటు, నెన్నెల మండలంలోనూ ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుంచి బెల్లంపల్లి పట్టణాన్ని జిల్లాగా ప్రకటించాలని ఆమరణ నిరాహార దీక్షలు చేశామన్నారు. బంద్‌లు , రాస్తారోకోలు, సంతకాలు సేకరణ, కలెక్టర్‌ను కలవడం, జీపు జాతలు చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశామన్నారు.
బెల్లంపల్లి జిల్లా కోసం అనువైన ప్రాంతమని, కేంద్ర బిందువుగా ఉన్న బెల్లంపల్లి జిల్లా అయితే ఆసిఫాబాద్, సిర్పూర్, మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాలకు అనుకూలంగా ఉంటుందన్నారు. మంచిర్యాలను జిల్లా చేస్తే తూర్పు ప్రాంతంలోని ప్రజలు చూస్తూ ఊరుకోలేరన్నారు. అన్ని అవకాశాలు ఉన్న బెల్లంపల్లి పట్టణాన్ని కాదని ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే, ఎంపీలు మంచిర్యాలలోని పెట్టుబడిదారులు, దళారులతో కుమ్మక్కై మంచిర్యాలను జిల్లా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
బెల్లంపల్లిని పాలకులు జిల్లా చేయకపోతే హైదరాబాద్ ఇందిరాపార్కు దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని, హైకోర్టులో కేసు వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) నాయకు లు జోగాటి రాజలింగం, పిట్టల ఈశ్వర్, సబ్బని రాజేం ద్రప్రసాద్, మేకల నర్సయ్య, ఎం.నరేశ్ పాల్గొన్నారు.