ఆ సిరీస్ పనికిమాలినది | Sakshi
Sakshi News home page

ఆ సిరీస్ పనికిమాలినది

Published Wed, Mar 4 2015 12:18 AM

ఆ సిరీస్ పనికిమాలినది

ప్రపంచకప్ ముందు ముక్కోణపు టోర్నీపై రవిశాస్త్రి వ్యాఖ్య
 పెర్త్: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్, ఆ తర్వాత ముక్కోణపు సిరీస్‌లోనూ భారత జట్టు దారుణ పరాజయాలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ప్రతిష్టాత్మక ప్రపంచకప్ ముందు ట్రై సిరీస్‌ను ఆడించడం తెలివితక్కువ పనిగా భారత టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి ఘాటుగా స్పందించారు. దాని వల్ల సమయం, శక్తి వృథా కావడం మినహా మరేమీ ఒరగలేదని అన్నారు. ‘నిజానికి ముక్కోణపు సిరీస్ అనంతరం ఆటగాళ్లంతా మానసికంగా తీవ్రంగా అలసిపోయారు. ప్రపంచకప్ కోసం వారు తమ బ్యాటరీలను రీచార్జి చేసుకుని తాజాగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే క్రికెట్ నుంచి వారు తీసుకున్న విశ్రాంతి కారణంగా మెగా టోర్నీకి పూర్తిగా సన్నద్ధమైనట్టయ్యింది. ఆ సిరీస్ కారణంగా సమయంతో పాటు మా శక్తి కూడా వృథా అయ్యింది’ అని రవిశాస్త్రి అన్నారు.
 
 ఆటగాళ్ల జోష్ ఊహించిందే..
 ఎవరి అంచనాలకు అందని రీతిలో భారత జట్టు ప్రపంచకప్‌లో దుమ్మురేపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నా రవిశాస్త్రి మాత్రం ఇదంతా తాను ఊహించిందేనని చెబుతున్నారు. ‘మా ఆటగాళ్ల ప్రదర్శన నన్నేమీ ఆశ్చర్యపరచడం లేదు. ఓ అద్భుతమైన విజయంతో టోర్నీని ప్రారంభించిన భారత జట్టుపై ఎవరికైనా సందేహం ఎందుకుంటుంది? ఆటగాళ్ల శక్తిసామర్థ్యాలపై నాకు పూర్తి నమ్మకముంది.
 
  స్థాయికి తగ్గ ఆటతీరును చూపితే ఏం జరుగుతుందో తొలి రెండు మ్యాచ్‌ల్లో చూపారు. ఆసీస్ గడ్డపై విరాట్ కోహ్లి కన్నా మిన్నగా ఆడిన భారత ఆటగాడిని నేనిప్పటి దాకా చూళ్లేదు. నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిని చూపించండి’ అని సవాల్ విసిరారు. చాలా కాలం తర్వాత ఫీల్డింగ్ విభాగంలోనూ ఇదే ఉత్తమ భారత జట్టు అని అన్నారు. పేసర్ మోహిత్ శర్మలో అపార ప్రతిభ ఉందని, మున్ముందు మరింత రాటుదేలుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
 

Advertisement
Advertisement