రషీద్‌ ఆ బ్యాట్‌ ఐపీఎల్‌కు తీసుకురా..

SunRisers Hyderabad Ask Rashid Khan To Bring Camel Bat To IPL - Sakshi

మెల్‌బోర్న్‌ : అఫ్గానిస్తాన్‌  క్రికెట్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ ప్రస్తుతం బిగ్‌ బాష్‌ లీగ్‌లో(బీబీఎల్‌) ఆడుతున్న సంగతి తెలిసిందే. బీబీఎల్‌లో ఆదివారం అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ లీగ్‌లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ తరఫున ఆడుతున్న రషీద్‌ సరికొత్త బ్యాట్‌తో మెల్‌బోర్న్‌ జట్టుపై విరుచుకుపడ్డాడు. కేవలం 16 బంతుల్లోనే 25 పరుగులు సాధించాడు. అందులో 2 ఫోర్ల్‌, 2 సిక్స్‌లు ఉన్నాయి. అలాగే 4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి, 2 వికెట్లు తీసిన రషీద్‌.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

అయితే రషీద్‌ ఉపయోగించిన బ్యాట్‌ను ‘ది కెమల్‌’ అంటూ పేర్కొంటూ క్రికెట్‌ ఆస్ట్రేలియా ట్వీట్‌ చేసింది. దీనిపై ఐపీఎల్‌లో రషీద్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న సన్‌రైజర్స్‌ టీమ్‌ స్పందించింది. రషీద్‌ ఆ బ్యాట్‌ను 2020 ఐపీఎల్‌కు  తీసుకురా అంటూ ట్వీట్‌ చేసింది. సన్‌రైజర్స్‌ ట్వీట్‌కు బదులు ఇచ్చిన రషీద్‌.. ఐపీఎల్‌ 2020 కి తప్పకుండా కెమల్‌ బ్యాట్‌ తీసుకువస్తా అని పేర్కొన్నాడు. 

ఆశ్చర్యపరిచిన అంపైర్‌ చర్య
అలాగే రషీద్‌ బౌలింగ్‌ చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 17వ ఓవర్‌లో అతను వేసిన బంతి మెల్‌బోర్న్‌ బ్యాట్స్‌మెన్‌ వెబ్‌స్టార్‌ ప్యాడ్‌లను తగలడంతో.. రషీద్‌ ఎల్‌బీడబ్ల్యూకు అప్పీలు చేశాడు. అయితే ఆ సమయంలోనే అంపైర్‌ గ్రెగ్‌ డేవిడ్సన్‌ ముక్కు రుద్దుకోవడానికి చేయి పైకి లేపాడు. అయితే అంపైర్‌ చేయి పైకి లేపినట్టు కనిపించడంతో అడిలైడ్‌ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. వెబ్‌స్టార్‌ కూడా క్రీజ్‌ వదిలి ముందుకు కదిలాడు. వెంటనే తెరుకున్న అంపైర్‌.. తను జౌట్‌ అని ప్రకటించలేదని.. ముక్కు రుద్దుకున్నానని తెలిపాడు. దీంతో అడిలైడ్‌ నిరాశ చెందారు. వెబ్‌స్టార్‌ కూడా తిరిగి క్రీజ్‌లోకి వచ్చేశాడు. మొదట ఈ దృశ్యాన్ని చూసినప్పుడు ఆటగాళ్లతో పాటు స్టేడియంలోని జనాలు ఆశ్చర్యపోయినప్పటికీ.. ఆ తర్వాత జరిగింది తెలుసుకుని నవ్వుకున్నారు. 

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అడిలైడ్‌ 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మెల్‌బోర్న్‌ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితమైంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top