ఆరోగ్యశ్రీకి భారీగా కోతలు | Sakshi
Sakshi News home page

వైద్యం... దైవాధీనం!

Published Fri, Mar 9 2018 9:33 AM

Heavy cuts to Healthcare In Ap Budget - Sakshi

సాక్షి, అమరావతి : ప్రజారోగ్యానికి సంబంధించి నిత్యం అవసరమైన, రోజూ లక్షలాది మందికి లబ్ధి చేకూర్చే పథకాలకు ఈ ఏడాది కూడా రాష్ట్ర బడ్జెట్‌లో సర్కారు మొండిచెయ్యి చూపించింది. ఎప్పటిలాగే అతిముఖ్యమైన ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్‌ వైద్యసేవ), 108 అంబులెన్సులు, 104 (చంద్రన్న సంచార చికిత్స) వంటి పథకాలకు కోతలు విధించారు. బడ్జెట్‌లో ఈ రంగాలకు నిధుల కేటాయింపు చూస్తే.. వైద్యం దైవాధీనం అన్నట్లుగా ఉంది. అలాగే, ఈ ఏడాది ఆరోగ్య రంగానికి మొత్తం రూ.9,849కోట్లు ప్రతిపాదిస్తే, కేవలం రూ.8,463కోట్లు కేటాయించారు.

అంటే.. మొత్తం బడ్జెట్‌లో ఆరోగ్యానికి కేటాయించింది కేవలం 4.42శాతం. మొత్తం మీద ఈ ఏడాది వివిధ పథకాలకు ప్రతిపాదనలు, కేటాయింపులకు మధ్య రూ.1,386 కోట్లు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. దీనినిబట్టి ఈ రంగంపై సర్కారు చిత్తశుద్ధి తేటతెల్లమవుతోంది. కాగా, కేటాయింపుల్లోని 70శాతం మొత్తం సిబ్బంది జీతాలకే పోతుంది. మిగిలిన 30శాతంతోనే పథకాల నిర్వహణ ఆధారపడి ఉంది. ఇక జాతీయ ఆరోగ్య మిషన్‌ నుంచి వచ్చే రూ.1,900కోట్ల పైచిలుకు నిధుల పైనే భారం వేశారు. కేంద్రం నుంచి నిధులొస్తేనే పథకాలు అమలయ్యే పరిస్థితి నెలకొంది. ఇక ఇతర అంశాలు పరిశీలిస్తే..

  • రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లు, పీజీ సీట్లు పెరగాలంటే ఏర్పాటుచేయాల్సిన మౌలిక వసతులకు కేవలం రూ.20 కోట్లు మాత్రమే కేటాయించారు. 
  • నర్సింగ్‌ కళాశాలలు, కుటుంబ సంక్షేమశాఖ పరిధిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కొత్త భవనాలు వంటి వాటికి నామమాత్రంగా కూడా కేటాయించలేదు. 
  •  ఇప్పటికే పల్లెలకు వెళ్లలేక దయనీయ స్థితిలో ఉన్న చంద్రన్న సంచార చికిత్స పథకానికి కేవలం రూ.64 కోట్లు మాత్రమే కేటాయించారు. 
  •  ఆయుష్‌ విభాగానికి రూ.20 కోట్లలోపే కేటాయించడంతో ఆ శాఖ పరిస్థితి గందరగోళంలో పడింది.

మెడ్‌టెక్‌ జోన్‌కు నిధుల వరద
విశాఖపట్నంలో ఏర్పాటుచేసిన మెడ్‌టెక్‌ జోన్‌ (వైద్య పరికరాల తయారీ కేంద్రం)కు నిధుల వరద పారించారు. ఇప్పటికే దీనికి గతంలో రూ.43 కోట్లు ఒకసారి, రూ.30 కోట్లు మరోసారి కేటాయించారు. పూర్తి అవినీతి కూపంలో కూరుకుపోయిన ఈ పథకానికి ఇప్పుడు బెడ్జెట్‌లో ఏకంగా రూ.274 కోట్లు కేటాయించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇప్పటివరకూ ఒక్క కంపెనీ కూడా ఇక్కడికి పెట్టుబడి పెట్టేందుకు రాకపోగా, ప్రభుత్వం మాత్రం వందల కోట్లు నిధులు కేటాయించడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది.

ఆరోగ్యశ్రీకి పదే పదే కోత
ఈసారి కూడా ఆరోగ్యశ్రీ పథకానికి (ఎన్టీఆర్‌ వైద్యసేవ) నిధులు కేటాయింపులో కోత వేశారు. వాస్తవానికి ఈ పథకానికి రూ.1,554 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదన ఇవ్వగా.. కేవలం వెయ్యి కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యానికి నిరాకరించడం, మూణ్ణెళ్లు రేషన్‌ తీసుకోకపోతే రేషన్‌ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ కార్డు కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తూ వస్తోంది. అలాగే, ఇప్పుడు పథకానికి అవసరమైన నిధుల్లోనూ కోత వేసింది.  

Advertisement
Advertisement