గిరిజనులతో చిందేసిన రాహుల్‌!

Rahul Gandhi Attends Chhattisgarh Tribal Fest Dance With Tribals - Sakshi

రాయ్‌పూర్‌: కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. సంప్రదాయ తలపాగా ధరించి... డోలు వాయిస్తూ ఉల్లాసంగా గడిపారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న జాతీయ గిరిజన నృత్య మహోత్సవాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులతో కలిసి రాహుల్‌ వేదిక మీద సందడి చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

ఈ మేరకు... ‘ఇది ఒక ప్రత్యేకమైన పండుగ. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు, వారసత్వాన్ని రక్షించేందుకు ఇలాంటివి ఎంతగానో ఉపయోగపడతాయి’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. కాగా ఈ ఉత్సవంలో 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఆరు దేశాలకు చెందిన దాదాపు 1350పైగా గిరిజన కళాకారులు పాల్గొంటున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించనన్ను ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.

ఇక ఈ కార్యక్రమానికి ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌ సహా కాంగ్రెస్‌ పార్టీ ఇతర నాయకులు హాజరయ్యారు. కాగా ఈ నృత్యోత్సవంలో గిరిజన వివాహాలు, ఆచార వ్యవహారాలు, పండుగలు, వ్యవసాయ పనులు తదితర విషయాలను ప్రతిబింబించేలా కళాకారులు నృత్యరీతులు ప్రదర్శించనున్నారు. మొత్తం 29 గిరిజన సమూహాలు 43కు పైగా సంప్రదాయ పద్ధతులను నృత్య రూపంలో ఆవిష్కరించనున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు గులాం నబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ, అహ్మద్‌ పటేల్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తదితర నాయకులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top