టైంస్లాట్‌తోనే శ్రీవారి దర్శనం సులువు

TTD Eo Anil kumar singhal spceles interview

 సాక్షితో టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌
దేశంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) కార్య నిర్వహణాధికారిగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఈ ఏడాది మే 6వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. తాను భక్తుడిగా చాలా కాలం నుండి తిరుమలేశుని దర్శించుకునే ఆనవాయితీ ఉందని, అయితే అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు  వచ్చాయన్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న భక్తులందరికీ ఒకేరోజులో దర్శనం కల్పించటం కష్టసాధ్యమని, తిరుమలలో క్యూలైన్లు కనిపించకుండా వచ్చేవారందరికీ సులువుగా, సంతృప్తిగా స్వామి దర్శనం కల్పించాలంటే టైం స్లాట్‌తోనే సాధ్యం అవుతుందని అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అభిప్రాయపడ్డారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సాక్షి ఫన్‌డే ప్రత్యేక సంచికతో ఆయన పంచుకున్న విశేషాల సమాహారమిది.

టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టక ముందు తిరుమలతో మీకున్న అనుబంధం? అప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పులు వచ్చాయి?
శ్రీవారి భక్తుడిగా తరచూ తిరుమలకు వచ్చి స్వామిని దర్శించుకునేవాడిని. అప్పటికీ ఇప్పటికి పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగ్గట్టు టీటీడీ సకల సౌకర్యాలు కల్పిస్తూనే ఉంది. టీటీడీ యంత్రాంగం అవిశ్రాంతంగా పనిచేస్తూ భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తూనే ఉంది.

ధార్మిక సంస్థ ఈవోగా మీరు ఎంచుకున్న ప్రాధాన్యతాంశాలు వివరిస్తారా?
ఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. దివ్యదర్శనం భక్తులకు టైంస్లాట్‌ ద్వారా నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శనం కల్పించే విధానాన్ని అమలు చేస్తున్నాం. క్యూకాంప్లెక్స్‌ల్లో మౌలిక సదుపాయాలు పెంచాము. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉంటున్న భక్తుల నుంచి ఫిర్యాదులు, సూచనలు సలహాలను స్వీకరిస్తున్నాం.హెల్ప్‌డెస్క్‌లు, ఉచిత ఫోన్, డిస్‌ప్లే స్క్రీన్లు ఏర్పాటు చేశాం. అందరికీ భోజనం, అల్పాహారం, చంటిపిల్లలకు పాలు అందిస్తున్నాం. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా రోజుకు 1,500 టోకెన్లు జారీ చేస్తున్నాం. నెలలో రెండురోజులు అదనంగా నాల్గు వేల మందికి దర్శన సౌకర్యం కల్పిస్తున్నాం.

భక్తులకు సంతృప్తి దర్శనం చర్చకు మాత్రమే పరిమితమైనట్లుంది. భక్తుల నుంచి ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. దీనికి సంబంధించి మీ వద్ద సరికొత్త ప్రణాళికలేమైనా ఉన్నాయా?
దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాం. కంపార్ట్‌మెంట్ల లో భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించే చర్యలు చేపట్టాం. వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్ల జారీపై విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. అందరికీ ఆర్జితసేవలు లభించాలనే సంకల్పంతో ప్రతినెలా మొదటి శుక్రవారం ఆన్‌లైన్‌ డిప్‌ విధానాన్ని ప్రవేశపెట్టాం. ఆన్‌లైన్‌లో గదులు బుక్‌ చేసుకున్న భక్తులు 48 గంటల ముందు రద్దు చేసుకుంటే 100 శాతం నగదును తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేశాం. వెండివాకిలి వద్ద తోపులాటలకు ఆస్కారం లేకుండా మార్పులు తీసుకొచ్చాం.

పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దర్శనంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రకరకాల క్యూలైన్లు పెరుగుతున్నాయి. వాటిని తగ్గించేందుకు రూ.300 టికెట్లు, కాలిబాట టికెట్ల తరహాలోనే సర్వదర్శనం, ఇతర దర్శనాలకు టైంస్లాట్‌ అమలు చేసే యోచన ఉందా?
ప్రస్తుతం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్యదర్శనం భక్తులకు టైంస్లాట్‌ విధానం అమల్లో ఉంది. భవిష్యత్తులో సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్‌ ప్రవేశపెట్టేందుకు విస్తృతంగా చర్చిస్తున్నాం. త్వరలో సర్వదర్శనంలోనూ  వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా టైంస్లాట్‌ విధానాన్ని ప్రవేశపెడతాం. ఈ అనుభవాల ఆధారంగా అనువైన నిర్ణయం తీసుకుంటాం.

ఆలయ క్యూలైన్లో మీరు తీసుకొచ్చిన మార్పులు ఏమిటి? అవి ఎలా ఉపయోగకరంగా ఉన్నాయి? దీనివల్ల భక్తుల సంఖ్య పెరిగిందా? తోపులాటలు తగ్గాయా?  
ఆలయంలో ఇదివరకే మూడు క్యూలైన్ల విధానం అమల్లో ఉండేది. వెండివాకిలి వద్ద తోపులాటలు జరిగేవి. ఆలయం లోపలికి, వెలుపలికి వెళ్లేందుకు భక్తులు ఇబ్బందులు పడేవారు. వెండివాకిలి వద్ద ఒకే క్యూను ఏర్పాటుచేశాం.తద్వారా తోపులాటలు  నివారించాం. భక్తులు సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు.

 తరలివచ్చే భక్తులందరికీ తిరుమలలో మౌళిక సదుపాయాలు కల్పించటం కష్టసాధ్యం కదా! దీన్ని అధిగమించేందుకు మీ వద్ద ప్రణాళికలు, ప్రత్యామ్నాయ మార్గాలేమైనా ఉన్నాయా?
తిరుమలలోని భక్తులకు  ఇబ్బందులు తలెత్తకుండా పలు సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. భక్తులకు ఉచితంగా దర్శనం, అన్నప్రసాదాలు, ఆర్‌వో తాగునీటి ప్లాంట్లు, యాత్రికుల వసతి సముదాయాల్లో బస, ఉచిత లగేజి, సెల్‌ఫోన్‌ డిపాజిట్‌ కౌంటర్లు, అదనపు మరుగుదొడ్లు, కంపార్ట్‌మెంట్లలో ఉచిత ఫోన్, ఉచిత వైద్య సౌకర్యం అందుబాటులో ఉన్నాయి. అన్నప్రసాద భవనం, పీఏసీ–2, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌–1లో భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నాం. భక్తుల రద్దీ ప్రాంతాల్లో ఫుడ్‌కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం వసతి సముదాయాలు, బర్డ్, స్విమ్స్, రుయా, మెటర్నిటి ఆసుపత్రుల్లోనూ, తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నాం. తిరుమలలో 13, తిరుపతిలో 3.. మొత్తం 16 ధర్మరథాలతో ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం. తిరుమలలో ఉన్న దాదాపు 7 వేల గదులను భక్తులు వినియోగించుకునేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నాం. గదుల కేటాయింపులో మరింత పారదర్శకత పెంచేందుకు, ఎక్కువసేపు క్యూలో వేచి ఉండకుండా నివారించేందుకు సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టాం.

 ఆలయంలో నేత్రద్వారాలు (వెండివాకిలికి అటుఇటుగా ప్రత్యేక ద్వారాలు, సన్నిధిలో రాములవారి మేడ నుంచి వైకుంఠద్వారం ప్రవేశం వరకు కొత్తద్వారం) తెరవాలని కొందరు, వద్దని మరికొందరు వివాదాస్పద అంశాలు తెరపైకి తెచ్చారు... ఈ నేత్రద్వారాలు, కొత్త నిర్మాణాల ఏర్పాటు సాధ్యమా? మీ అభిప్రాయం చెప్పగలరు?
తిరుమల శ్రీవారి ఆలయంలో నూతన మార్పులకు సంబం«ధించిన విషయాలను ఆగమ సలహాదారులు, ఇతర నిపుణుల అంగీకారం మేరకు పరిశీలించటం జరుగుతుంది.

శ్రీవారికి కనీస విరామం కొరవడుతోందని కొందరు మఠాధిపతులు, పీఠాధిపతులు, అర్చకులు ఆవేదన చెందుతున్నారు. దీనివల్ల తరతరాల ఆలయ ఆగమ సంప్రదాయం పక్కదారి పట్టడంతోపాటు దేశంలో అరిష్టాలు, సంక్షోభ పరిస్థితులు చవిచూడాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు. స్వామి కైంకర్యాలకు ఎలాంటి అనుకూల పరిస్థితులు చేయబోతున్నారు?
ఆగమ సలహాదారులు, పండితుల సూచనల మేరకే సంప్రదాయబద్ధంగా తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు జరుగుతున్నాయి.

 బ్రహ్మోత్సవాల్లో రద్దీ వల్ల కొన్నేళ్లుగా గరుడ వాహనాన్ని రాత్రి 7.30 గంటలకే ఊరేగిస్తున్నారు. దీనివల్ల త్వరగా ఉత్సవమూర్తిని దర్శించుకున్న భక్తులు తిరుమల నుండి తిరుపతికి వెళ్లిపోవటంతో గదుల కొరత, నీటి వినియోగం, ఇతర ఇబ్బందులు తగ్గుతున్నాయి. ఇదే తరహాలోనే మిగిలిన వాహనసేవల్లో మార్పులు చేసే అవకాశం ఉందా?
ఆగమపండితులు, సలహాదారుల సూచన మేరకు తగు నిర్ణయం తీసుకోగలం.

హిందూ ధర్మప్రచార విస్తరణ, యువతలో   ధార్మిక చింతన పెంపొందేందుకు టీటీడీ పరంగా ఎలాంటి  కార్యక్రమాలు అమలు చేస్తున్నారు?
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ద్వారా మనగుడి, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు అర్చక శిక్షణ, ఎస్‌సీ, ఎస్‌టీ కాలనీల్లో భజన మందిరాల నిర్మాణం, భజనమండళ్లకు శిక్షణ, భక్తి చైతన్యయాత్రలు, స్వామీజీల ద్వారా ధార్మిక సందేశాలు, యజ్ఞయాగాల నిర్వహణకు ఆర్థికసాయం, శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తున్నాం. డిజిటల్‌ గ్రంథాలయం, సప్తగిరి మాసపత్రిక, శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌ ద్వారా ధర్మప్రచారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళుతున్నాం. టీటీడీ వెబ్‌సైట్‌ ద్వారా పుస్తకాలు, భక్తి సంకీర్తనలు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించాం. శుభప్రదం, గీతాజయంతి, సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల ద్వారా విద్యార్థులు, యువతలో హిందూ ధార్మిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. టెక్నాలజీని ఉపయోగించి సనాతన ధర్మాన్ని యువతకు చేరువ చేసేందుకు ప్రత్యేకంగా హెచ్‌డిపిటి వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నాం. రూ.25 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత, గిరిజన, మత్స్యకార ప్రాంతాల్లో 500 ఆలయాల నిర్మాణం జరుగుతోంది. విదేశాల్లో ఉన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయాల్లోని అర్చకులకు కూడా శిక్షణ ఇచ్చి తిరుమల శ్రీవారి ఆలయం తరహాలోనే ఆగమశాస్త్ర బద్ధంగా కైంకర్యాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. వేద పరిరక్షణ కోసం దేశంలోనే ఏకైక వేద విశ్వ విద్యాలయం తోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 7 వేద పాఠశాలలు నిర్వహిస్తున్నాం.

∙టీటీడీ ఈవోగా పరిపాలనలో కొత్త సంస్కరణలేమైనా ఉన్నాయా... ?
పరిపాలన అనేది నిరంతర ప్రక్రియ.  మార్పులకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటున్నాం. బర్డ్‌లో అదనపు భవనాన్ని అత్యాధునిక వసతులతో నిర్మించాం. శస్త్ర చికిత్సల కోసం నమోదు చేసుకుని, వేచి చూసే గడువును రెండేళ్లలోపే పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాం. తిరుపతిలో టాటా క్యాన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఎంఓయూ కుదుర్చుకున్నాం. అరవింద నేత్ర వైద్యశాల నిర్మాణం జరుగుతోంది. పాలనను సులభతరం చేసేందుకు ఈ–ఆఫీస్‌ విధానానికి శ్రీకారం చుట్టాం. తెలుగు వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నాం.

దేశంలో ప్రకృతి ప్రకోపాలు, జనోద్యమాలు, అశాంతి పెరిగిపోతున్నాయి కదా... ప్రకృతిని ప్రసన్నం చేసుకునేందుకు, లోక కల్యాణం కోసం టీటీడీ పాత్ర ఎలాంటిది?
వర్షాలు కురవాలని వరుణదేవుని ప్రార్థిస్తూ ప్రతి ఏటా వరుణజపం, పర్జన్యశాంతి హోమం, ప్రకృతిని ప్రసన్నం చేసుకునేందుకు అద్భుత శాంతి యాగం నిర్వహిస్తున్నాం. ఇక ప్రతిరోజూ ఆలయంలో జరిగే నిత్యపూజలన్నీ లోకకల్యాణం కోసమే.

తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు తొలిసారి మీ చేతుల మీదుగా జరుగుతున్నాయి. మీ స్పందన.
టీటీడీలో సేవ చేసే అవకాశం రావటం పూర్వజన్మ సుకృతం. ఇక ఆ స్వామివారికి  బ్రహ్మోత్సవాలు నిర్వహించే భాగ్యం కలగటం మహదానందంగా ఉంది. సంప్రదాయాలను పాటిస్తూ ఉత్సవ వైభవాన్ని చాటేలా స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top