తెరిచిన తలుపులు

And The Bride Close The Door Book Review By Padma Priya - Sakshi

కొత్త బంగారం

నవల : అండ్‌ ద బ్రైడ్‌ క్లోజ్డ్‌ ద డోర్‌
హీబ్రూ మూలం : రానిత్‌ మెటలోన్‌
ఇంగ్లిష్‌ అనువాదం : జెస్సికా కోహెన్‌ 

పెళ్లికూతురు మార్జీ గదిలోకి వెళ్లి తలుపు బిగించేసుకుని, అయిదు గంటల తరవాత ‘ఈ పెళ్లి చేసుకోను. చేసుకోను. చేసుకోను’ అని తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. అంతవరకూ ఆమె మాట కోసం ఆత్రంగా ఎదురుచూసిన వాళ్లందరూ, ఆమె చెప్పింది నిజమని నమ్మాల్సి వస్తుందేమో అన్న భయంతో ఒకరిని ఒకరు చూసుకోవడం కూడా మానేస్తారు. పచ్చగా ఉన్న పెళ్లింట్లో అసలు పెళ్లి జరుగుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది.

ఇజ్రాయెల్‌ రచయిత్రి రానిత్‌ మెటలోన్‌ (1959–2017) రాసిన ‘అండ్‌ ద బ్రైడ్‌ క్లోజ్డ్‌ ద డోర్‌’ ఈ  సంక్షోభంతో ప్రారంభమవుతుంది. ఇజ్రాయెల్‌ సాహితీ ప్రపంచంలో ప్రముఖమైన ‘బ్రెన్నెర్‌ అవార్డ్‌’ పొందిన ఈ హీబ్రూ నవలకి జెస్సికా కోహెన్‌ చేసిన ఇంగ్లిష్‌ అనువాదాన్ని న్యూ వెసెల్‌ ప్రెస్‌ 2019లో ప్రచురించింది.
ఒక్కరోజు కథ ఇది. మార్జీ, మాటి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆ సాయంత్రమే పెళ్లి.  మార్జీతో మాట్లాడటానికి ఎవరు ప్రయత్నించినా, మౌనమే సమాధానం. కేంద్రబిందువు మార్జీ అయినప్పటికీ, కథను నడిపేది మిగతా పాత్రలే. హాస్యం, స్త్రీవాదం, ఇజ్రాయెల్‌లో పెళ్లిళ్లు, సామాజిక ఆర్థిక పరిస్థితులు, పాలెస్తీనియన్‌లు, వలస వచ్చిన యూదుల ఇబ్బందులు– ఇవన్నీ చదువరి గమనంలోకి వచ్చేలా నవలలో ప్రవేశపెట్టబడతాయి.

తన అభిప్రాయాలను నిష్కర్షగా చెప్పే అమ్మాయిలా, తనకు తనే బలం అని నమ్మిన వ్యక్తిలా మార్జీ వ్యక్తిత్వం ఆవిçష్కృతమౌతుంది. ఈ సంక్షోభం మొత్తంలో మార్జీ కేవలం ఒక్క కాగితాన్ని మాత్రం తలుపు కిందనుంచి బయటకు పంపుతుంది. ‘నీ అడుగులు బరువెక్కాయి, గమ్యాన్ని చేరగలవా? అని దారిలో రాళ్లు నన్ను ప్రశ్నించాయి,’ అని మొదలయ్యే కవిత, కట్టుబాట్లను  ఛేదించటానికి ఆమె లోనవుతున్న అంతర్గత సంఘర్షణకి ప్రతిరూపంగా ఉంటుంది.  

కథ పరిధికి లోబడి డీటెయిలింగ్‌ చేసిన విధానం అనుపమానం. పెళ్లింటి వాతావరణంలోని వస్తువులూ, సెంటు పరిమళాలూ, వంటింటి వాసనలూ, మేకప్పులూ, అలంకరణలూ, కేటరర్సూ, ఫొటోగ్రాఫర్లూ, ఫోన్లూ ఓవైపు; పెళ్లికూతుర్ని ఒప్పించటమెలా, అతిథులకేం చెప్పాలీ, ఇంతవరకూ అయిన ఖర్చు ఎవరు భరించాలీ లాంటి మీమాంసలు మరోవైపు. వర్ణనలు, పోలికలు చాలావరకు స్త్రీ పరంగా ఉండటం కొత్త అందం. 
ఆలోచనలను స్పష్టంగా చెప్పలేని పెళ్లికొడుకు మాటీ, తనకి నచ్చని చెప్పులు మార్జీ కొన్నప్పుడు వద్దనికూడా చెప్పలేడు. అతనికీ మార్జీకి మధ్య ఏదో కనపడని గోడ ఉండేది. అసలు, మార్జీతో ఉన్న అనుబంధంలో అతనిలో అతనికే ఏదో అడ్డుగా ఉండేది. మార్జీ తీసుకున్న ఈ నిర్ణయం మాటీకి కూడా కొంతమేరకు ఉపశమనాన్ని కలిగించి, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగల స్థైర్యాన్ని అతనికీ ఇస్తుంది. 

మార్జీ పరంగా ఆలోచించగలిగిన అమ్మమ్మ మరో ముఖ్యమైన పాత్ర. ఆ రోజు ఆవిడ పాడిన ‘నేను నా మనసులో ఉన్నది చెప్పటానికి భయపడతాను, నీ హృదయం ఎక్కడ గాయపడుతుందోనని’ అన్న పాట మంద్రంగా సాగుతూ ఆవిడ గదిని దాటి, చుట్టూపరుచుకున్న నిశీథిలోని వేలవేల గొంతుకలతో కలిసి తెరలుతెరలుగా విశ్వమంతా వ్యాపించి, తరతరాలుగా స్త్రీలు మోస్తున్న భారాన్ని పెళ్లగిస్తున్నట్టుగా సాగుతుంది. ఈ పాట ప్రభావమా అన్నట్టు, పెళ్లికూతురి గది తలుపు తెరుచుకుంటూ ఉంటుంది నెమ్మదిగా!

మార్జీ పెళ్లిని నిరాకరించడానికి కారణాలు కథ చివర్లో కూడా స్పష్టం కావు. కానీ స్త్రీ నిర్ణయాన్ని గౌరవించడం అనేది ముఖ్య విషయమనీ, కారణాలు తదనంతర విషయాలనీ నవల అన్యాపదేశంగా సూచిస్తుంది. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో స్త్రీకి ఎక్కడైనా ఈ స్థాయిలో స్వాతంత్య్రం ఉందా అన్నది పక్కనపెడితే, ఉండటం మాత్రం అభిలషణీయం!

- పద్మప్రియ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top