శక్తి అంతా మీలోనే ఉంది... ధీరులై లేచి నిలబడండి..!

శక్తి అంతా మీలోనే ఉంది... ధీరులై లేచి నిలబడండి..!


 సుబోధ శక్తి అంతా మీలోనే ఉంది... ధీరులై లేచి నిలబడండి..!

 కలకత్తాలో భువనేశ్వరీదేవి, విశ్వనాథ దత్తా దంపతులకు 1863 జనవరి 12న నరేంద్రనాథ్ దత్తాగా జన్మించిన ఓ బాలుడు, చిన్న వయసులోనే శ్రీ రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో ఒదిగాడు. స్వామి వివేకానందగా ఎదిగాడు. కేవలం తన ఒక్కడి మోక్షం కోసం సాధన చేేన  సాధారణ తపస్విలా కాక, సమాజంలోని దీనులను ఉద్ధరించాలని తపించిన మహోన్నతుడిగా చివరి  దాకా జీవించారు వివేకానంద.

 ఆధ్యాత్మికత అంటే, ముక్కు మూసుకొని, ప్రపంచానికి దూరంగా బతకడమని ఆయన చెప్పలేదు. తోటి మానవుడిలోనే మాధవుడున్నాడన్న వాస్తవాన్ని బలంగా ప్రతిపాదించారు. అందుకే ఆయన ఓ సందర్భంలో, ‘‘నా మాటంటే మీకు ఏమైనా విలువ ఉంటే, నేనొక సలహా ఇస్తాను. మీ ఇంటి కిటీకీలు, తలుపులు తెరిచేయండి! మీ వాటాలో పతనావస్థలో, దుఃఖంలో పేదవాళ్ళు కుప్పలుగా పడి ఉన్నారు. వారి దగ్గరకు వెళ్ళి, ఉత్సాహంతో, పట్టుదలతో సేవచేయండి.జబ్బుపడిన వారికి మందులివ్వండి. యావచ్ఛక్తితో వారికి ఉపచర్య చేయండి. తిండి లేక మాడిపోతున్నవాళ్ళకు ఆహారం అందించండి. అజ్ఞానులైన వారికి మీలో ఉన్న జ్ఞానం మేరకు బోధనలు చేయండి..’’ అని అతి పెద్ద ధర్మసూక్ష్మాన్ని అత్యంత సరళంగా చెప్పేశారు. ‘‘ప్రతి పురుషుణ్ణీ, స్త్రీనీ, ప్రతి జీవినీ దైవంగా చూడండి.అత్యంత నిష్ఠను పాటించిన అనంతరం నేను ప్రతి జీవిలోనూ భగవంతుడున్నాడనే పరమ సత్యాన్ని కనుగొన్నాను. అది వినా వేరే దైవం లేదు’’ అని తేల్చారు. మరో అడుగు ముందుకు వేని,... ‘‘ప్రత్యక్ష దైవమైన నీ సోదర మానవుణ్ణి పూజించలేనివాడివి, ప్రత్యక్షం కాని పరమాత్ముణ్ణి ఎలా పూజించగలవు?’’ అని సూటిగానే ప్రశ్నించారు. ‘జీవాత్మ సేవ చేసేవాడు పరమాత్ముని సేవించినట్లే!’ అని పదే పదే గుర్తు చేశారు. మహాత్మాగాంధీ అన్నట్లు ‘‘స్వామి వివేకానందుని బోధనలకు ప్రత్యేకంగా ఎవరి నుంచీ ఎటువంటి పరిచయమూ అవసరం లేదు. చదివేవారి మీద వాటంతట అవే చెరగని ముద్ర వేస్తాయి.’’ భౌతికంగా కనుమరుగైన 111 ఏళ్ళ తరువాత కూడా ఇప్పటికీ నిత్య చైతన్య దీప్తిగా స్వామీజీని నిరంతరం తలుచుకోవడం, అన్నేళ్ళ క్రితం ఆయన చెప్పిన మాటలతో నవతరం స్ఫూర్తి పొందడమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

 

  చింతన జెన్ అంటే ఏమిటి?

 భారతదేశంలో పుట్టి, చైనాలో చిన్‌గా మారి, కొరియా, జపాన్ నేలల్లో ఇంకి, ఆ దేశాలను సారవంతం చేసిన ఒక అద్భుత, సజీవ చైతన్యమే జెన్. బౌద్ధ, జైన మతాలలోని కఠోర నిబంధనలను అనుసరించలేని వారికోసం ఆ రెండు మతాల మేలు కలయికగా పుట్టిందే జెన్. దీనిని ఎవరు ప్రతిపాదించారో ఇతమిత్థంగా తెలియదు.


అయితే బోధిధర్ముడే దాని మూలపురుషుడని కొన్ని గ్రంథాలు చెబుతాయి. ఇంతకీ జెన్ అంటే ఏమిటి... చతురోక్తులు, సునిశిత హాస్యం, విషాదం, సరసం తదితరాలు కలిసిన ఓ నవరస గుళిక. మనలోని నైపుణ్యాల వెలికితీతకు ప్రతీక. ప్రాపంచికమైన జీవితానికి, విషయాలకు సంబంధించి ఒక కొత్త దృక్పథాన్ని ఏర్పరచుకునేందుకు అనువైన మార్గమే జెన్. జీవితాన్ని తాజాగా, మరింత సంతృప్తిగా ఉంచే మార్గం జెన్.


గురువుల సహకారంతో వ్యక్తిగత అనుభవం ద్వారా సమకూరే ఒక ఆధ్యాత్మిక సంపూర్ణ జ్ఞానం జెన్. మనం ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో జీవన సరళినే ఉదాహరణగా సరళమైన కథల రూపంలో.. కళ్లకు కడుతుంది. జెన్ కథలను చదివితేమన లోపాలు ఏమిటో మనకే తెలిసిపోతాయి. సమస్యను ఎలా ఎదుర్కోవాలో బోధపడుతుంది. అందుకే జెన్ కథలు ఇటీవల కాలంలో బహుళ ప్రాచుర్యం పొందాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top