ఏపీ హిస్టరీ : కాంపిటీటివ్ గైడెన్స్ | a p history :competitive-guidance | Sakshi
Sakshi News home page

ఏపీ హిస్టరీ : కాంపిటీటివ్ గైడెన్స్

Oct 17 2013 10:49 PM | Updated on Sep 1 2017 11:44 PM

ఏపీ హిస్టరీ : కాంపిటీటివ్ గైడెన్స్

ఏపీ హిస్టరీ : కాంపిటీటివ్ గైడెన్స్

రెడ్డి రాజుల చరిత్ర - ఆధారాలు (క్రీ.శ. 1324 - 1434) కాకతీయుల పతనానంతరం ఏర్పడిన సామాజిక సంక్షోభాన్ని రెడ్డి రాజులు అంతం చేసి, దాదాపు ఒక శతాబ్దం పాటు ఆంధ్రదేశ మనుగడను కాపాడారు. వీరు సింహాచలం - విక్రమసింహపుర(నెల్లూరు) మధ్యస్త తీరాంధ్రాన్ని పాలించి, సంస్కృత, తెలుగు భాషా సంస్కృతులకు మెరుగులు దిద్దారు

 రెడ్డి రాజుల చరిత్ర - ఆధారాలు
 (క్రీ.శ. 1324 - 1434)
 కాకతీయుల పతనానంతరం ఏర్పడిన సామాజిక సంక్షోభాన్ని రెడ్డి రాజులు అంతం చేసి, దాదాపు ఒక శతాబ్దం పాటు ఆంధ్రదేశ మనుగడను కాపాడారు. వీరు సింహాచలం - విక్రమసింహపుర(నెల్లూరు) మధ్యస్త తీరాంధ్రాన్ని పాలించి, సంస్కృత, తెలుగు భాషా సంస్కృతులకు మెరుగులు దిద్దారు. మహ్మదీయులకు వ్యతిరేకంగా రెడ్డి రాజులు, ముసునూరి కమ్మ వంశీయులు, రేచర్ల వెలమలు వీరోచితంగా పోరాడారు. ఇదేకాలంలో తుంగభద్రా నదీతీరంలో విజయనగర సామ్రాజ్యం వెలిసింది. అద్దంకి, కొండవీడు, కొండపల్లి, రాజమహేంద్రవరం, కందుకూరు ప్రాంతాలను క్రీ.శ.1324 నుంచి క్రీ.శ.1434 వరకు.. దాదాపు 110 సంవత్సరాలు కొండవీటి రెడ్లు పాలించారు.
 
  రాచకొండ, దేవరకొండ పాంతాల్లో ప్రధాన పాత్ర వహించారు. మధ్య యుగానికి చెందిన ఈ రాజవంశాల చరిత్రకు ప్రధానంగా రాగి, శిలా శాసనాలు, సంస్కృత - తెలుగు సాహిత్యం, మెకంజీ సేకరించిన కైఫీయత్‌లు(స్థానిక చరిత్రలు), చాటుకృతులు(పొగడ్తలు), వంశానుగత బిరుదావళులు, వంశావళులు వంటివి ముఖ్యమైన ఆధారాలు.
 
 శాసనాలు: క్రీ.శ.13వ శతాబ్దం నాటి ముట్లూరి, రెడ్డిరాణి అనితల్లి కలువచేరు, మో టుపల్లి అభయ, విలసతామ్ర, ఆర్యావట, ద్రాక్షారామ శాసనాలు ముఖ్యమైనవి. ముసునూరి ప్రోలయ నాయకుడు వేయించిన విలసతామ్ర శాసనం ముస్లింలు ఆంధ్రులపై జరిపిన దురాగతాలను వర్ణించింది. వెంకటాధ్వరి రచించిన విశ్వగుణ దర్పణం అనే గ్రంథం తెలుగునాడుపై మహ్మదీయుల దాడులను వివరిస్తోంది. వెలుగోటివారి వంశావళి రేచర్ల-పద్మనాయకుల వంశ చరిత్రను వెల్లడిస్తోంది. కొండవీటి కైఫీయత్ రెడ్డి రాజుల స్థానిక చరిత్రను తెలుపుతోంది.
 
 సంస్కృత సాహిత్యం: కాళిదాసు సంస్కృత భాషలో రచించిన మూడు నాటకాలు - అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్పశీయం, మాళవికాగ్నిమిత్రంలపై కుమారగిరి రాజీయం అనే పేరుతో కాటయ వేమారెడ్డి సంస్కృత భాషలో వ్యాఖ్యానం రాశాడు. అమరశతకానికి శృంగారదీపిక పేరుతో పెదకోమటి వేమారెడ్డి వ్యాఖ్యానం రాశాడు. వామన భట్టబాణుడు రచించిన వేమభూపాల చరితం, రేచర్ల సింగభూపాలుడి రసార్ణవ సుధాకరం, విశ్వేశ్వర కవి విరచిత చమత్కార చంద్రిక, అమృతానందయోగి రచించిన అలంకార సంగ్రహం వంటి సంస్కృత సాహిత్యం ద్వారా రెడ్డి- వెలమ రాజుల చరిత్ర, నాటి సామాజిక అంశాలు తెలుస్తున్నాయి.
 
 తెలుగు సాహిత్యం: పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పని చేసిన మహాకవి శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణం, కాశీఖండం, క్రీడాభిరామం, చాటుకృతులు(పొగడ్తలు), కొమ్మనకవి రాసిన శివలీలా విలాసం, కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక, మంచెన కేయూర బాహుచరిత్ర, ఎర్రాప్రెగడ - నృసింహ పురాణం, ఉత్తర హరివంశం, గౌరన-నవనాధ చరిత్ర, మెకంజీ వెలువరించిన కైఫీయత్‌లు ఆనాటి తెలుగు సాహిత్య చరిత్రను వివరిస్తున్నాయి.
 
 మహ్మదీయ చరిత్ర కథనాలు: ఢిల్లీ  సుల్తాన్‌ల కాలంనాటి అమీర్‌ఖుస్రో రచించిన తారీఖ్-ఇ-అలాయి, జియావుద్దీన్ బరనీ రచించిన తారీఖ్-ఇ-ఫిరోజ్ రచనల ద్వారా అప్పటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులు తెలుస్తున్నాయి.
 
 రెడ్డి రాజుల వంశ చరిత్ర: మహ్మదీయుల పారతంత్య్రం నుంచి ఆంధ్రదేశం విముక్తి చెందిన తర్వాత వెలసిన స్వతంత్ర రాజ్యాల్లో రెడ్డిరాజ్యం ఒకటి. ఈ రాజులు కొండవీడు, రాజమహేంద్ర వరాలను రాజధానులుగా చేసుకొని, మధ్యాంధ్రదేశాన్ని సుమారు వందేళ్లకు పైగా పాలించారు. వీరిని పంటరెడ్లు అని కూడా పిలుస్తారు. పంటరాష్ర్ట నివాసులైనందున పంటరెడ్లుగా గుర్తింపు పొందారు. పంట రాష్ర్టం పాకనాడులో అంతర్భాగమైన ముట్టింబాకు గ్రామం(నేటి గూడూరు ప్రాంతం) వీరి నివాసం అని శాసనాధారాలున్నాయి.
 
  రెడ్డిరాణి అనితల్లి వేయించిన కలువచేరు శాసనం ప్రోలయ వేమారెడ్డిని పంటవంశోద్భవుడని వర్ణించింది. వీరిది దేసటి కులం. వెల్లచేరి గోత్రం. వీరి కులదేవత మూలగూరమ్మ. పాకనాటిలో విక్రమ సింహపురం(నెల్లూరు), దువ్వూరు, గండవరాధి పట్టణాలు పంటదేసటి వంశానికి అధికార కేంద్రాలని శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణంలో పేర్కొన్నాడు. పంట రెడ్లు క్రమంగా పంటరాష్ర్టం నుంచి విస్తరించి, తమ తమ నివాస ప్రాంతాలను బట్టి మోటాటి, వెలనాటి, మొరస, చాంగలునాటి తదితర 14 శాఖలుగా విడిపోయారు. వడ్లలో ఎన్ని రకాలు ఉన్నాయో రెడ్లలోనూ అన్ని శాఖలున్నట్లు తెలుగులో ఒక సామెత ఉంది. కొండవీటి కైఫీయత్ వీరిని దొంతి వంశస్థులని పేర్కొంది. ఎర్రాప్రెగడ, శ్రీనాథుడు వంటి కవులు వీరిని దేసటి వంశస్థులని రాశారు. ఎర్రాప్రెగడ ప్రోలయ వేముడిని దేసటి వేమా సమస్త ధీరలలామా అని, శ్రీనాథుడు వీరభద్రారెడ్డిని శ్రీమద్దేసంటి వంశగ్రామణి అని ప్రశంసించారు. పంటరాష్ర్టంలో దేసటి దుర్గం ఒకటుందని, ఆ దుర్గాదీశ్వరులే దేసటి పంట వంశస్థులయ్యారని చరిత్రకారులు నిర్ణయించారు.
 పంట దేసటి రెడ్డిరాజ వంశానికి కోమటి ప్రోలారెడ్డి మూలపురుషుడు. వీరి వంశంలో కోమటి, వేమా అనే పేర్లు తరచుగా కనిపిస్తాయి. పరుసవేది వల్ల ధనికుడైన వేముడనే కోమటిని హత్యచేసి, అతడి ధనాన్ని సంగ్రహించి, ఆ పాప పరిహారార్థమై కోమటి, వేమా అనే పేర్లను ధరించారని స్థానిక చరిత్రలు వివరిస్తున్నాయి. కోమటి ప్రోలారెడ్డి కుమారుడే స్వతంత్ర రెడ్డి రాజ్య స్థాపకుడైన ప్రోలయ వేమారెడ్డి. ఇతడి రాజధాని అద్దంకి.
 
 ప్రాచీనాంధ్ర కావ్యాల్లో, శాసనాల్లో -రెడ్డి పదానికి రట్టడి, రడ్డి, రడ్డు అనే రూపాలున్నాయి. రట్టడి పదం క్రమేణా రడ్డు, రడ్డె, రెడ్డిగా మారింది. కాలక్రమంలో పేరు ముందు కోమటి, వేమా అనే పదాలను చేర్చడం ఆచారంగా మారింది. రెడ్డిరాజుల పూర్వీకులు మొదట కాకతీయ ప్రతాపరుద్రుడి కాలంలో పాకనాడు, పూగినాడు, వెలనాడు ప్రాంతాల్లో నాయంకర్లుగా వ్యవహరించారని కొందరు చరిత్రకారుల భావన. క్రీ.శ. 13వ శతాబ్దంలో పంటరెడ్లు నెల్లూరు ప్రాంతంలో తెలుగుచోడుల సామంతులుగా రాజకీయ ప్రాముఖ్యం సంపాదించారు. రెడ్లకు జగనొబ్బగండడు అనే బిరుదు ఉంది. హోయసాల రెండో సోమేశ్వర సేనానులు అప్పయ, గోపయలను ఓడించి ఈ బిరుదును ఆపాదించుకున్నారు. పాండ్యులను ఓడించిన తర్వాత పాండ్యరాజ గజకేసరి, చెంచుమల చూరకార అనే బిరుదులు కూడా రెడ్డిరాజులకు సంక్రమించాయి. ప్రోలయ వేమారెడ్డికి పల్లవ త్రినేత్ర అనే బిరుదు ఉండడం వల్ల వీరి మూలపురుషులు పల్లవులు అని కొందరు చరిత్రకారులు అంచనా వేశారు. కానీ అందుకు తగిన ఆధారాలు లేవు.
 
 ప్రోలయ వేమారెడ్డి (క్రీ.శ.1325-1353)
 ఇతడు కోమటి ప్రోలయరెడ్డి రెండో కుమారుడు. మల్లవరం శాసనం ప్రకారం ప్రోలయ వేమారెడ్డి క్రీ.శ.1324 -1325 నాటికి అద్దంకి రాజధానిగా స్వతంత్ర రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు. ఇతడు క్రీ.శ.1353 వరకు పాలించినట్లు మణికేశ్వరం శాసనం తెలియజేస్తోంది.
 ప్రోలయ వేమారెడ్డి ఆంధ్ర స్వాతంత్య్రోద్యమంలో ముసునూరి ప్రోలయ నాయకుడికి సహకరించాడు. మహ్మదీయులు ఓరుగల్లును ఆక్రమించిన తర్వాత వారితో యుద్ధాలు చేసి తరిమివేశాడు. యుద్ధాల్లో వేమారెడ్డికి గుజ్జరిభట్టు విభాళ(అశ్వదళాన్ని ఓడించినవాడు), అనెయ(అనెగొంది), మాండలిక గండర వంటి బిరుదులు సంక్రమించాయి. నెకరికంటి, చీమకుర్తి శాసనాల ప్రకారం గుంటూరు, త్రిపురాంతకం, శ్రీశైలం, అహోబిలం ప్రాంతాలు ఈయన ఆధీనంలోకి వచ్చాయి. ఎర్రాప్రెగడ ఈయనను యవననృపబలాబి అని వర్ణించాడు. తుగ్లక్‌లను ఎదరించడం వల్ల వీరిని యవనులని పేర్కొన్నారు. ముట్లూరి శాసనం ఈయనను మ్లేచ్ఛాబ్ది కుంభోద్భవుడని వర్ణించింది. రెడ్డి రాజ్యానికి బహమనీ రాజ్యం నుంచి ప్రమాదం ప్రోలయ వేముడి కాలంలోనే ప్రారంభమైంది.  మొదటి బహమనీ సుల్తాన్ అల్లావుద్దీన్ తెలంగాణ మీదుగా కృష్ణాతీరం వరకు దాడి జరిపినట్లు, ఈ దాడిని మల్లారెడ్డి తిప్పికొట్టి రెడ్డి రాజ్యాన్ని రక్షించినట్లు తెలుస్తోంది. ఈ దాడి క్రీ.శ.1357లో జరిగిందని చరిత్రకారుల అభిప్రాయం. ప్రోలయ వేమారెడ్డి రాజ్యం కృష్ణానది, శ్రీశైలం, అహోబిలం, కందుకూరు సీమ, తూర్పుతీరాల మధ్య విస్తరించింది. రాజ్యంలో ధరణికోట, చందోలు(చందవోలు), వినుకొండ, బెల్లంకొండ, కొండవీడు, కొండపల్లి, కం దుకూరు దుర్గాలను నిర్మించాడు.  భావిరాజధానిగా కొండవీడును శత్రుదుర్భేద్యమైన దుర్గంగా రూపొందించాడు. ప్రోలయ వేమారెడ్డికి అతడి సోదరులు, మేనమామలు అండగా నిలిచారు.
 
 ప్రోలయ వేమారెడ్డి వైదిక ధర్మాభిమాని, సాహిత్య పోషకుడు. అనవరత పురోమిత కృత సోమపాన అని, ధర్మప్రతిష్టాగురువు అని కవులు ఇతడిని కీర్తించారు. తురుష్క దండయాత్రల్లో నష్టపోయిన అగ్రహారాలను ప్రోలయ వేముడు పునరుద్ధరించడమే కాకుండా 44 గ్రామాలను దానం చేసినట్లు ఒక సంప్రదాయ కథనం ప్రచారంలో ఉంది. ఇతడికి నిస్సీమ భూదాన పరశురామ అనే బిరుదు ఉంది. ప్రోలయ వేమారెడ్డి శైవమతాభిమాని కూడా. ఇతడు శ్రీశైలం, అహోబిల క్షేత్రాల్లో సోపానాలు(మెట్లు) నిర్మించాడు. కవిత్రయంలో చివరివాడైన ఎర్రాప్రెగడను వేమారెడ్డి ఆదరించాడు. ఎర్రాప్రెగడ తన హరివంశాన్ని ప్రోలయ వేమారెడ్డికి అంకితమిచ్చాడు. శ్రీశైలంలోని  పాతాళ గంగకు ప్రోలయ వేమారెడ్డి మెట్లు నిర్మించాడు.
 
 అనవోతారెడ్డి(క్రీ.శ.1354-1364): ప్రోలయ వేముడి పెద్ద కుమారుడు అనవోతా రెడ్డి. ఇతడు తన తండ్రి మరణానంతరం రాజ్యానికొచ్చాడు. తండ్రి కాలంలో అనేక యుద్ధాల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించి వీరాన్నవోతుగా ప్రసిద్ధి చెందాడు. కళింగ గాంగులు, పద్మనాయకులు, విజయనగర రాజులతో పోరాడాడు. కృష్ణా జిల్లాలోని దివిసీమను ఆక్రమించాడు. అనవోతారెడ్డి కాలంనాటికి శ్రీశైలం ప్రాంతం విజయనగర రాజు మొదటి బుక్కరాయల ఆధీనంలో ఉంది. భవిష్యత్తులో విజయనగర రాజుల వల్ల రెడ్డి రాజ్యానికి ముప్పు ఏర్పడుతుందని భావించిన అనవోతారెడ్డి తన రాజధానిని అద్దంకి నుంచి పటిష్టమైన కొండవీటి దుర్గానికి మార్చినట్లు క్రీ.శ.1364 నాటి మాన్యమాపురం శాసనం ద్వారా తెలుస్తోంది. క్రీ.శ.1361లో బహమనీలు కృష్ణా నదిని దాటి ధరణికోట(అమరావతి)లోని అమరేశ్వరాలయాన్ని ధ్వంసం చేశారు. అనవోతారెడ్డి మంత్రిైయెున మల్లయ వేమన ఆ దాడిని తిప్పికొట్టి, అమరేశ్వర స్వామిని పునఃప్రతిష్ట చేసినట్లు అతడి శాసనం ద్వారా తెలుస్తోంది.  అనవోతారెడ్డి వర్తకాభివృద్ధికి మోటుపల్లి రేవును అభివృద్ధి చేశాడు. ఈ రేవు నుంచి వివిధ ద్వీపారాంతరాలకు వర్తకం జరిగేది.
 
 
 మాదిరి ప్రశ్నలు
 1.    ‘కర్పూర వసంతరాయలు’ అనే ఆధునిక కావ్య రచయిత?
 1) దాశరథీ కృష్ణమాచార్యులు
 2) ఆరుద్ర    3) శ్రీశ్రీ
 4) డా.సి.నారాయణరెడ్డి
 
 2.    తన రాజధానిని అద్దంకి నుంచి కొండవీటికి మార్చిన రెడ్డిరాజు?
 1) ప్రోలయ వేమారెడ్డి
 2) అనవోతారెడ్డి
 3) పెదకోమటి వేమారెడ్డి
 4) కాటయ వేమారెడ్డి
 
 3.    కొండవీటి దుర్గాన్ని నిర్మించిన రాజు?
 1) కుమార గిరిరెడ్డి     2) కాటయ వేముడు
 3) అనవోతారెడ్డి     4)  రాచవేమారెడ్డి
 
 4.    రెడ్డిరాజుల కులదేవత?
 1) మూలగూరమ్మ     2) పద్మాక్షి
 3) భ్రమరాంబ     4) అన్నపూర్ణాదేవి
 
 5.    గుంటూరు జిల్లా ఫిరంగిపురం వద్ద సంతాన సాగరం అనే పెద్ద చెరువును తవ్వించినవారు?
 1) కాటయ వేమారెడ్డి
 2) పెదకోమటి వేమారెడ్డి
 3) రుద్రమదేవి     4) సూరాంబిక
 
 6.    చాటుకృతులు అంటే?
 1) నాటికలు     2) పొగడ్తలు
 3) హాస్యగీతాలు     4) శతకాలు
 
 7.    పురిటి సుంకాన్ని విధించిన రెడ్డిరాజు?
 1) రాచవేమారెడ్డి     2) కుమారగిరి రెడ్డి
 3) కాటయ వేమారెడ్డి
 4) పెదకోమటి వేమారెడ్డి
 
 8.    రెడ్డిరాజుల ప్రథమ రాజధాని?
 1) పిఠాపురం    2) రాజమహేంద్రవరం
 3) అద్దంకి       4) కొండపల్లి
 
 9.    ‘వేమభూపాల చరిత్ర’ రచయిత?
 1) గౌరన          2) కాటయ వేమారెడ్డి
 3) ఎర్రాప్రెగడ   4) వామనభట్టబాణుడు
 
 10.    మాళవికాగ్నిమిత్రం అనే గ్రంథ రచయిత?  
 1) సింగభూపాలుడు
 2) వామనభట్టబాణుడు
 3) కాళిదాసు   4) పెదకోమటి వేమారెడ్డి
 
 11.    మాచల్దేవి ఏ తెలుగు సాహిత్య గ్రంథంలోని పాత్ర?
 1) ప్రేమాభిరామం     2) క్రీడాభిరామం
 3) యక్షగానం     4) భాగవతం
 
 12.    కంఠక శోధన దేనికి సంబంధించినది?
 1) న్యాయవ్యవస్థ     2) రెవెన్యూ పాలన
 3) ఆర్థిక వ్యవస్థ    4) పరిపాలనా వ్యవస్థ
 
 13.    జక్కుల పురంద్రి ఏ జానపద కళకు సంబంధించినది?
 1) తోలుబొమ్మలాటలు 2) కోలాటం    
 3) యక్షగానం     4) చెక్కభజన
 
 14.    కాళిదాసు రచించిన మూడు నాటకాలపై కుమారగిరి రాజీయం అనే పేరుతో వ్యాఖ్యానం రాసిన రెడ్డిరాజు?
 1) పెదకోమటి వేమారెడ్డి
 2) కాటయ వేమారెడ్డి
 3) రాచ వేమారెడ్డి     
 4) కుమారగిరి రెడ్డి
 
 15.    }నాథ మహాకవి ఏ రెడ్డి రాజు ఆస్థానంలో విద్యాధికారిగా నియమితుడయ్యాడు?
 1) ప్రోలయ వేమారెడ్డి
 2) కాటయ వేమారెడ్డి 3) అనవోతారెడ్డి     
 4) పెదకోమటి వేమారెడ్డి
 
 సమాధానాలు
 1)  4;    2)  2;   3) 3;    4) 1;   5)  4;
 6)  2;    7)  1;   8) 3;    9) 4;   10) 3;
 11) 2;    12) 1;  13) 3;   14) 2;  15) 4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement