గేటు వేస్తే...  గంట ఆగాల్సిందే...! | Traffic Problems At Railway Gate In Ichapuram, Srikakulam District | Sakshi
Sakshi News home page

గేటు వేస్తే గంట ఆగాల్సిందే...!

Jun 16 2019 8:59 AM | Updated on Jun 16 2019 8:59 AM

Traffic Problems At Railway Gate In Ichapuram, Srikakulam District - Sakshi

గేటు వేయడంతో నిలిచిపోయిన వాహనాలు

సాక్షి, ఇచ్ఛాపురం (శ్రీకాకుళం): మండలంలోని ఎం.తోటూరు– రత్తకన్న వద్ద ఉన్న రైల్వే నార్త్‌ కేబిన్‌ ఎల్‌సీ రైల్వే గేటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి పాలిట శాపంగా మారింది. ఈ గేటు వద్ద ఫ్లైౖ ఓవర్‌ నిర్మాణం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూపులు తప్పడం లేదు. ఈ గేటు పడిదంటే చాలు ప్రయాణికులు సుమారు అరగంట వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

22 గ్రామాల ప్రజలు ఎదురు చూపులు
ఇక్కడ వంతెన నిర్మాణం కోసం ఆంధ్రా– ఒడిశా గ్రామాలతో పాటు ఇచ్ఛాపురం, చీకటి నియోజకవర్గాలకు చెందిన 22 గ్రామాల ప్రజలు నిరీక్షిస్తున్నారు. ముఖ్యంగా మండపల్లి తోటూరులో రెండు కాన్వెంట్లతో పాటు ప్రైవేటు జూనియర్, సీనియర్‌ కళాశాలు, మున్సిపాలిటీ పరిధి రత్తకన్నలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు ప్రైవేటు కాన్వెంట్‌ ఉంది. ఎం.తోటూరులో సినిమా హాల్‌ ఉండడంతో ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ఇదిలా ఉండగా, బిర్లంగి, కొళిగాం ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఇటుక బట్టీలు ఉండడంతో నిత్యం ఇటుక లారీలు, ట్రాక్టర్లు రాకపోకలు సాగిస్తునే ఉంటున్నాయి.

గేటు పడితే అంతే సంగతి..!
ప్రతీ పదిహేను నిమిషాలు, అరగంటకో రైలు వస్తుండడంతో పది నిమిషాలు ముందుగానే గేటు వేయడంతో వాహనాలు కిలో మీటర్‌ పొడవునా బారులుగా తీరుతున్నాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు వెళ్లేం దుకు కూడా ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బిర్లంగి బాహుదానదిలో మునిగిపోయిన నాథం కమల కొన ఊపిరితో ఉండగా, వాహనంపై ఇచ్ఛాపురం సామాజికి ఆస్పత్రికి తరలిస్తుండగా, సుమారు 15 నిమిషాల పాటు గేటు వేయడంతో ఆస్పత్రికి చేరుకునే కొద్ది క్షణాల్లోనే ఆమె మృత్యు ఒడిలోకి చేరుకుంది.

నీటిమూటలుగా ఎంపీ, ఎమ్మెల్యే హామీ
గతంలో ఇచ్ఛాపురంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కె.రామ్మోహన్‌నాయు డు, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ దృష్టికి స్థానికుల ఫ్లై ఓవర్‌ పరిస్థితిని వివరించారు. వెంటనే సమస్యను పరిష్కారిస్తామంటూ హామీ ఇవ్వడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కానీ నేటికి సుమారుగా రెండేళ్లు కావస్తున్నా ఇచ్చిన హామీ మాత్రం నీటి మూటలుగా మిగిలిపోయాయి.

మరుగునపడ్డ ప్రతిపాదనలు
రైల్వే అధికారులు ఎల్‌సీ గేటును పరిశీలించిన తరువాత దాసన్నపేట యర్కర చెరువు జంక్షన్‌ నుంచి బెల్లుపడ కాలనీ మీదుగా భవానీపురం వరకు ఫ్లై ఓవర్‌ నిర్మించేందుకు ప్రతిపాదనలు చేసినప్పటికీ ఆ ప్రతిపాదనలు మరుగునపడ్డాయి.

తప్పని తిప్పలు
రైల్వే గేటుకు ఇరువైపులా విద్యాసంస్థలు, ఆస్పత్రులు, తహసీల్దార్, ఎంపీడీఓ తదితర ప్రభుత్వ కార్యాలయాలు ఉండడంతో అటు విద్యార్థులకు, ఇటు ఉద్యోగులకు  అవస్థలు తప్పడం లేదు. సమయానికి పాఠశాలలు, కళాశాలలకు చేరుకోలే విద్యార్థులు నష్టపోతుంటే...సమయానికి బయోమెట్రిక్‌ వేయకపోతే పూట సెలవు పెట్టాల్సిందేనని ఉద్యోగులు వాపోతున్నారు. గేటు పడితే ద్విచక్రవాహనాలు, పాదాచారులు వెళ్లేందుకు ఉన్న ఒక్కగానొక్క అండర్‌ పాసేజ్‌ పూర్తిగా మురికి నీటితో నిండిపోయింది. ఇటీవల రైల్వే ట్రాక్‌ పక్కన మట్టి పోయడంతో ప్రస్తుతం చిన్నపాటి వర్షం కురిస్తే అటువైపుగా వెళ్లేందుకు వాహనచోదకులు సాహసించడంలేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు, పాలకులు స్పందించి ఫ్లై ఓవర్‌ వంతెన నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని, అండర్‌ పాసేజ్‌ను మరమ్మతులు చేపట్టి వాహనాల రాకపోకలకు అవకాశం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రయోజనం లేకపోకపోయింది
ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. ప్రతి అరగంటకో రైలు వస్తుండడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో నిత్యం ఇబ్బందులు పడుతున్నాం. ఫ్లై ఓవర్‌ కోసం పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించినా ప్రయోజనం లేకపోకపోయింది.
– యు.సూర్య, డ్రైవర్, ఎం.తోటూరు 

నిరుపయోగంగా అండర్‌పాసేజ్‌
గేటు పడినప్పుడు ద్విచక్రవాహనదారులు అండర్‌పాసేజ్‌ గుండా వస్తుండడంతో పలుమార్లు ప్రమాదాలకు గురయ్యారు. మా సేవా సంస్థ ద్వారా పలుమార్లు శ్రమదానం చేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేసినప్పటికీ వర్షాలు కురిసినప్పడు మురుగునీరుతో ఈ రహదారి పూర్తిగా మూసుకుపోతుంది. ప్రస్తుతం జనాభాతో పాటు వాహనాల రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో మరింత సమస్య ఉత్పన్నమవుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి.
– ఎం.రాంబాబు, యువసూర్య చారిటీబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్, ఎం.తోటూరు   

1
1/1

గేటు తీసినా ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనచోదకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement