సాగు.. ఇక బాగు!

Full Of Water Irrigation Projects Kadapa Project - Sakshi

ప్రాజెక్టులతో పాటు చెరువులను నింపేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

జిల్లాలో 216 చెరువులు, 79,976 ఎకరాలకు అందనున్న సాగునీరు

చెరువులు నింపేందుకు చర్యలు తీసుకుంటున్న అధికారులు

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు 

సాక్షి, చాపాడు(కడప) : అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అనాసక్తి కారణంగా గత కొన్నేళ్లుగా జిల్లాలోని చెరువులను నింపకపోవటంతో ఏటా 79, 976.495 ఎకరాల ఆయకట్టులో సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతూ వచ్చింది. అయితే ఈ ఏడాది మాత్రం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జిల్లాలోని ప్రాజెక్టులతో పాటు అన్ని చెరువులను నింపి రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఏడాది ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వలన ప్రాజెక్టుల్లో వరద నీరు సమృద్ధిగా చేరటం, వరద నీటిని సాగునీరుగా అందించేందుకు సీఎం చర్యలు తీసుకోవటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రాజెక్టులతో పాటు చెరువులకు జలకళ..
కరువు నేల వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరుకోవటంతో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 44వేల క్యూసెక్కులు, హంద్రీనీవా ద్వారా 2,022 క్యూసెక్కులు, ముచ్చిమర్రి ఎత్తిపోతల ద్వారా 927 క్యూసెక్కుల నీటిని రాయలసీమ, నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టులకు తరలిస్తున్నారు. మరో 50 రోజుల పాటు కృష్ణానదిలోకి వరద జలాలు వచ్చే అవకాశం ఉండటంతో రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాల్లోని ప్రాజెక్టులు, చెరువులను నింపాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జల వనరుల శాఖకు దిశానిర్దేశం చేశారు. వెలుగోడు నుంచి జిల్లాలోని తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్, ఎస్సార్‌–1, 2 ప్రాజెక్టులకు, గోరకల్లు, అవుకు ప్రాజెక్టుల నుంచి గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం, చిత్రావతి, మైలవరం ప్రాజెక్టులకు వరద నీరు అందనుంది. వరద నీటి ఉధృతి మేరకు ఈ ప్రాజెక్టులను నింపే క్రమంలోనే చెరువులను పూర్తి స్థాయిలో నింపేందుకు సాగునీటి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

చెరువు ఆయకట్టు రైతులకు మహర్దశ..
కొన్నేళ్లుగా జిల్లాలోని అధిక భాగం ప్రాజెక్టులకు సాగునీరు చేరని పరిస్థితుల్లో ఆయా ప్రాజెక్టుల పరిధిలోని చెరువు ఆయకట్టు రైతులు సాగునీరు లేక సాగుకు దూరమయ్యేవారు. ఈ ఏడాది మాత్రం పూర్తి స్థాయిలో సాగునీరు అందనుండటంతో కేసీ కెనాల్‌ రైతాంగంతో పాటు చెరువు ఆయకట్టు రైతులు పంటలను సాగు చేసుకోవచ్చు. జిల్లాలోని 9 జలాశయాల కింద 16,987.481 ఎకరాల విస్తీర్ణంలో 216 చెరువులు ఉన్నాయి. ప్రతి మండలంలో ఈ చెరువుల కింద 79,976.495 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడి వేలాది మంది రైతులు చెరువు నీటితోనే పంటలు సాగు చేసుకోవాలి. ఈ ఏడాది సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం వలన సాగునీరు ప్రతి ఎకరాకు పుష్కలంగా అందనుండటంతో రైతుల్లో ఆనందం కనిపిస్తోంది.

చెరువు నింపితే రెండు కార్లలో పంటల సాగు
వర్షాలు వస్తేనే చెరువులు నిండుతాయి. ఈ సారి వర్షాలు పడకపోయినా ప్రాజెక్టులు నిండాయి. గ్రామ పరిధిలోని చెరువును నింపితే ఏటా వరితో పాటు వేసవి కాలంలో మరో పంట సాగు చేస్తాము. చెరువులను త్వరగా నింపితే వరి సాగు చేసుకుంటాము. చెరువులను నింపాలని సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయంతో రైతులకు మేలు జరుగుతుంది. 
– వడ్ల నాయబ్‌రసూల్, రైతు, ఖాదర్‌పల్లె, చాపాడు మండలం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top