ఉత్తుత్తి ఫలకాలు... దండగమారి ఖర్చులు...

Chandrababu naidu Funds Wastage on Groundbreakings - Sakshi

ఎన్నికల ముందు టీడీపీ  హడావుడి శంకుస్థాపనలు

ఏ ఒక్కదానికీ నిధులు విదల్చని బాబు సర్కారు

ప్రజలను మభ్యపెట్టేందుకు అనవసర ఖర్చులు

గత ప్రభుత్వ దుబారాకు ఆనవాళ్లీ శిలాఫలకాలు

పదవీకాలాన్ని సొంత ప్రచారానికే వాడుకుని... ఎన్నికలు సమీపిస్తున్న వేళ శంకుస్థాపనలు చేసేస్తే జనం నమ్మేస్తారనుకున్నారు. అడ్డగోలు తాయిలాలతో మళ్లీ అధికారం చెలాయించొచ్చని భావించారు. శిలాఫలకాలకు చిల్లిపెంకుల్లా నిధులు వెచ్చించారు. అనవసర ఆర్భాటానికి నిధులు దుబారా చేశారు. కానీ విజ్ఞులైన జనం వారి ట్రిక్కులకు లొంగిపోలేదు. గిమ్మిక్కులకు మోసపోలేదు. ఇంకా వారిని నెత్తినెక్కించుకుంటే చిప్ప చేతికిస్తారని గట్టిగా నమ్మారు. రాష్ట్రాన్ని ఇంకా అప్పుల ఊబిలోకి నెట్టేయకూడదని దృఢంగా అనుకున్నారు. అందుకే వారిని సాగనంపి తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నారు. ఇప్పుడు టీడీపీ దుబారాకు ఆ శిలాఫలకాలు సాక్షీభూతాలుగా కనిపిస్తున్నాయి.

సాక్షి ప్రతినిధి, విజయనగరం:ఎన్నికల ముందు ఓట్ల కోసం టీడీపీ ప్రభుత్వం కొన్ని పనులకు శంకుస్థాపనలు చేసింది. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. వాస్తవానికి ఆ శిలాఫలకాలన్నీ ఉత్తుత్తివే. నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా లేకున్నా... కేవలం జనాన్ని మభ్యపెట్టేందుకే అప్పట్లో ఈ ఆర్భాటాలకోసం ప్రజాధనం వృథా చేశారు. భోగాపురం విమానాశ్రయం, మెడికల్‌ కళాశాల, గురజాడ యూనివర్శిటీ, తాగునీటి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, నీటి కుళాయిలు అంటూ చివరి నిమిషంలో గుర్తొచ్చిన అన్నింటికీ శంకుస్థాపనలు చేసేసి జనాన్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ వారి నాటకాలను జనం నమ్మలేదు.

టెండర్లు కాకుండానే విమానాశ్రయానికి శంకుస్థాపన
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంటూ జిల్లా ప్రజలను ఐదేళ్లపాటు ఊరించారు. 2700 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోదీని నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. అయితే పదవీకాలం మొత్తం రకరకాల కారణాలతో కాలక్షేపం చేసి చివరి నిమిషంలో జనాన్ని మభ్యపెట్టేందుకు టెండర్లయినా ఖరారుకాకుండానే ఆగమేఘాలమీద శంకుస్థాపన చేశారు. సాధారణంగా టెం డర్లు పూర్తయి పనులు అప్పగించాకనే శంకుస్థాప న చేయాలి. కానీ ఇక్కడ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు వచ్చి మరీ గారడీ చేసిపోయారు.

శృంగవరపుకోట పట్టణంలో కన్నెంగెడ్డ ప్రక్షాళనకు రూ.1.64కోట్లు కేటాయించారు. ఈ పనుల కోసం అప్పటి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మూడు దఫాలు శంకుస్థాపనలు చేశారు. కాం్ర టాక్టర్లు రాకపోవటంతో పనులు ప్రారంభం కాలే దు. వేపాడ మండలం బల్లంకిలో సామాజిక భవ న నిర్మాణానికి రూ.3లక్షలు కేటాయించి, శంకుస్థాపన చేసినా పనులు ప్రారంభం కాలేదు. కొత్తవలస మండలం  నిమ్మలపాలెం–వి.బి.పురం తారురోడ్డు నిర్మాణానికి రూ.2కోట్లు, కొత్తవలసలో టీ టీడీ కల్యాణ మండపానికి నిధులు కేటాయించి, శంకుస్థాపన చేసినా పనులు ప్రారం భం కాలేదు.
బొబ్బిలిలో 15వేల కుటుంబాలకు తాగునీరు అందించేందుకు నిధులు మంజూరు కాని భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పటి మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు రూ.95 కోట్లతో తాగునీటి పథకాన్ని నిర్మిస్తున్నామని అట్టహాసంగా ప్రకటించి ఫొటోలు దిగారు. కాని ఒక్క రూపాయైనా మంజూరు కాలేదు. శివారు కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రూ.25కోట్లతో ఇందిరమ్మ కాలనీ, నాయుడు కాలనీ తదితర ప్రాంతాల్లో శిలాఫలకాలు వేసేశారు. బొబ్బిలి 30 పడకల ఆస్పత్రిని 50 పడకలుగా విస్తరిస్తున్నామని శిలాఫలకాలు వేశారు. కానీ ఈ పనులేవీ ఒక్క అడుగైనా ముందుకు వెళ్ళలేదు.
చీపురుపల్లి మండలంలో ఇంటింట కుళాయి పథకం కోసం 2019 ఫిబ్రవరి 9న అప్పటి ఎమ్మె ల్యే కిమిడి మృణాళిని పైలాన్‌ ఆవిష్కరించారు. కానీ దానికి ఒక్క పైసా విడుదల కాలేదు. పనులు ప్రారంభం కాలేదు. గుర్ల మండలంలో జమ్ముపే ట నుంచి వల్లాపురం మధ్య బీటీ రోడ్డు నిర్మాణానికి, గడిగెడ్డ రిజర్వాయర్‌ అభివృద్ధి పనులకు, మెరకముడిదాం మండలంలో గర్భాం– ఉత్తరావల్లి ప్రధాన రహదారి నుంచి పులిగొమ్మి మీదుగా ఆకులకట్ట వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనలు చేసినా పనులు ప్రారంభించలేదు.
పార్వతీపురం మునిసిపాలిటీలో ఎన్టీఆర్‌ ఆవా స్‌ యోజన పథకం కింద గ్రూప్‌ హౌస్‌ నిర్మాణాని కి అడ్డాపుశీల గ్రామం వద్ద కొండపోరంబోకు స్థ లాన్ని టిడ్కోకు అప్పగించారు. హడావుడిగా శం కుస్థాపన చేశారు. కానీ పనులు పునాది స్థాయిలో నే ఉన్నాయి. పార్వతీపురానికి తాగునీటి సరఫరా కోసం ఫైలెట్‌ ప్రాజెక్టు పనుల నిమిత్తం రూ. 60.34 కోట్లతో ప్రణాళికలు తయారు చేసి టెండ ర్లు లేకుండానే హడావుడిగా ప్రారంభించారు. ఏ ఒక్కటీ ఒక్క అడుగైనా ముందుకు పడలేదు.

గందరగోళంలో... గురజాడ వర్శిటీ
ఎన్నికల ముందు జిల్లాకు మెడికల్‌ కళాశాల, గురజాడ యూనివర్శిటీ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనతో అప్పటి విజయనగరం ఎమ్మెల్యే మీసాలగీత పలు ప్రాంతాల్లో హడావుడిగా స్థల పరిశీలన, ప్రారంభోత్సవాలు చేసేశారు. జిల్లా కేంద్రంలోని గాజులరేగ శివారు, ఆంధ్రయూనివర్శిటీ ప్రాంగణంలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు రెవెన్యూ అధికారులతో స్థల పరిశీలన చేసిన అప్పటి ఎమ్మెల్యే, గురజాడ అప్పారావు యూనివర్శిటీ ప్రారంభోత్సవం అంటూ శిలాఫలకాన్ని సిద్ధం చేసేశారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు భోగాపురం నుంచి యూనివర్శిటీకి శంకుస్థాపన చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు సైతం యూనివర్శిటీ సమీపంలోనే స్థల పరిశీలన చేసినా, వాటికి నిధులు కేటాయించలేదు. ఇప్పటికీ ఆ వర్శిటీ గందరగోళంగానే ఉంది.

వందపడకలు అంతా మాయ...
సాలూరు పట్టణంలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి అప్పటి మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావు భూమి పూజ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి కూడా ఎమ్మెల్సీ సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌తో కలిసి భూమి పూజ చేశారు. కందులపదం గ్రామ సమీపంలో సువర్ణ ముఖి నదిపై వంతెన  నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌ భూమి పూజ చేశారు. ఆ పనులేవీ ప్రారంభం కాలేదు. గజపతినగరం జూనియర్‌ కళాశాల ఆవరణలో ఎడ్యుకేషన్‌ హబ్‌ పేరిట ప్రభుత్వ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదుల కోసం శిలాఫలకాలను ఆవిష్కరించారు. మరుపల్లిలో కస్తూర్బా గాంధీ జూనియర్‌ కళాశాల నిర్మిస్తామని శిలాఫలకాలను ఆవిష్కరించారు. గజపతినగరం చంపావతి నది వద్ద రూ. 48 లక్షలతో పార్కు, పురిటిపెంటలో ఎన్‌హెచ్‌–26 నుంచి మండల పరిషత్‌ వరకూ రూ. 12లక్షలతో రహదారికి శిలాఫలకాలను ఆవిష్కరించి వదిలేశారు. ఇలాంటివి జిల్లా వ్యాప్తంగా ఎన్నో శిలాఫలకాలున్నాయి. అవన్నీ జనాన్ని వెక్కిరిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top