
రేపు భేటీలో నిర్ణయం తీసుకోనున్న నిపుణుల కమిటీ
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో 60 రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఇంకా దొరకని మరో ఆరుగురు కార్మికుల ఆచూకీ
చివరి 43 మీటర్లు ప్రమాదకరం అంటున్న నిపుణులు
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో శిథిలాల కింద ఉన్న మిగతా కార్మికుల ఆచూకీ కోసం 60 రోజులుగా పనులు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 22న సొరంగం పైకప్పు కూలి ప్రమాదం చోటుచేసుకోగా, ఇప్పటివరకు ఇద్దరు కార్మికుల మృతదేహాలు లభించాయి. ఇంకా ఆరుగురు కార్మికుల ఆచూకీ కోసం నిరాటంకంగా పనులు కొనసాగుతున్నాయి.
12 సంస్థలకు చెందిన 560 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో తవ్వకాలను కొనసాగిస్తున్నారు. సొరంగంలోని ప్రమాదస్థలంలో డీ2 పాయింట్ వద్ద రక్షణగా ఏర్పాటు చేసిన ఇనుప కంచె వరకు తవ్వకాలు పూర్తయ్యాయి. అక్కడి నుంచి ఇంకా ముందుకు పనులు కొనసాగించాలా లేక నిలిపివేయాలా అన్న దానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంకేతిక నిపుణుల కమిటీ శుక్రవారం సమావేశం కానుంది.
చివరి 43 మీటర్లలోనే..
14 కి.మీ. లోపల సొరంగం చివరన 43 మీటర్లు ప్రమాదకరంగా ఉండటంతో డీ2 పాయింట్ వద్ద ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. అక్కడి మట్టిని తొలగిస్తే మళ్లీ సొరంగం కూలిపోయే అవకాశం ఉందని ఇప్పటికే జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఇనుప కంచె వరకు తవ్వకాలు పూర్తికాగా మిగతా ఆరుగురు కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదు. వారు ఆ 43 మీటర్ల పరిధిలోనే కూరుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇంకా పనులు కొనసాగించాలా, వద్దా? అన్న అంశాన్ని తేల్చేందుకు ప్రభుత్వం సాంకేతిక నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది.
ఇందులో ఎన్డీఆర్‌ఎఫ్ కమాండెంట్, ఎన్జీఆర్‌ఐ డైరెక్టర్, జీఎస్‌ఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ డైరెక్టర్, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన కల్నల్ పరీక్షిత్ మెహ్రా, అటవీశాఖ పీసీసీఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌కు చెందిన అడిషనల్ డైరెక్టర్ జనరల్, నీటిపారుదల శాఖ సీఈ, నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ సీఈతో కూడిన 12 మంది సభ్యులు ఉన్నారు. చివరి 43 మీటర్లలో పనులు చేపడితే రెస్క్యూ బృందాలకు సైతం అపాయమున్న నేపథ్యంలో పనులు నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.