
పంటల ప్రణాళిక సిద్ధం
● 2.98 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయని అధికారుల అంచనా ● ఈ సారి పెరగనున్న సన్నాల సాగు ● 1,43,817.81 హెక్టార్లలో పత్తి పంట ● 59,424.7 హెక్టార్లలో వరి
నారాయణఖేడ్: వానాకాలం సీజన్‌లో జిల్లాలో 2,98,718.22 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు పంటల సాగుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను ఖరారు చేసింది. ఇందులో 1,43,817.81 హెక్టార్లలో పత్తిపంట సాగు జరిగేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అదే విధంగా రెండో ప్రధాన పంటగా 59,424.7 హెక్టార్లలో వరి సాగు చేపట్టాలని నిర్ణయించింది. ఇక కంది 32,044.53 హెక్టార్లు, సోయాబీన్ 29,817.81హెక్టార్లు, పెసర 5,749.39 హెక్టార్లు, మినుము 3,465.59 హెక్టార్లు, చెరుకు 7,957.09 హెక్టార్లు, మొక్కజొన్న 3,441.3, జొన్న 237.25, హార్టికల్చర్‌లో 9,898.79 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయని లెక్కకట్టింది. వీటితో పాటు కొర్రలు, రాగులు, సామలు, స్వీట్‌కార్న్, ఎర్ర జొన్నలు, ప్యారాగ్రాస్, ఉలువలు, వేరుశనగ, ఆవాలు, సామలు, గడ్డినువ్వులు, పొద్దుతిరుగుడు, హనుములు, బొబ్బర్లు తదితర పంటలను తక్కువ మోతాదులో సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ యాక్షన్ ప్లాన్ తయారు చేసింది. జిల్లా మొత్తంలో ఈ వానాకాలంలో 2,98,718.22 హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగు జరిగే అవకాశం ఉందని లెక్కగట్టింది.
అవసరం మేరకు విత్తనాలు..
రైతుల సాగు అవసరం మేరకు విత్తనాలు సిద్ధంగా ఉంచేందుకు వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలో విత్తనాల కొరత లేకుండా ఉండేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. పచ్చిరొట్ట విత్తనాలైన జనుము 6,500 క్వింటాళ్లు, జీలుగ 4,500 క్వింటాళ్లు కలిపి 11వేల క్వింటాళ్ల మేర విత్తనాలు అవసరం అని ప్రతిపాదనలు పంపించారు. ఈ సారి వరిలో సన్నాల సాగు అధికంగా జరిగే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా సరిపడా విత్తనాలు సిద్ధంగా ఉంచేందుకు చర్యలు చేపట్టారు. నకిలీ విత్తనాల బెడద ఉండకుండా కూడా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఫసల్ బీమా అమలుకు కసరత్తు..
ఈ సీజన్ నుంచి ఫసల్ బీమా అమలుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. రైతు వాటా ఎంత మేర ఖరారు చేయాలని, లేదా ప్రీమియంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం చెరిసగం భరించే విధంగా విధి విధానాలు ఖరారు ఉండనున్నట్లు తెలుస్తోంది. దిగుబడి ఆధారిత బీమా పథకం కింద వరి, మొక్కజొన్న, కంది, మినుము, సోయాబీన్, వేరుశనగ, శనగ, నువ్వులు మొదలైన పంటలు. వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి, మిరప, మామిడి, ఆయిల్‌పామ్, టమాట, బత్తాయి పంటలకు బీమా వర్తింప జేయనున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా దిగుబడుల్లో నష్టం జరిగిన పక్షంలో దిగుబడి ఆధారిత బీమా ద్వారా రైతుకు పరిహారం అందనుంది. కాగా రైతులు వేసవి దుక్కులను సిద్ధం చేస్తున్నారు. ఆయా పంటల దిగుబడులు పూర్తి కావడంతో వేసవి దుక్కులు దున్నుకుంటున్నారు.