
ప్రెస్‌మీట్‌లలో ‘‘సాక్షి.. ఎక్కడమ్మా?’’ అంటూ ఇంతకాలం వెటకారం ప్రదర్శిస్తూ వచ్చిన చినబాబు.. ఇప్పుడు ఆ ఛానెల్ కెమెరా కనిపిస్తే ముఖం తిప్పేసుకుంటున్నారు. ఆయన తెచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగం.. తొమ్మిది నెలల పాలనలో అమలుకాని కూటమి ప్రభుత్వ హామీలు.. ప్రజా వ్యతిరేక పాలనపై వైఎస్సార్‌సీపీ వినిపిస్తున్న గళమే ఇందుకు కారణం. ఈ క్రమంలో ఇవాళ అణచివేత చర్యలకు దిగగా.. సాక్షి దానిని అంతే ధీటుగా ఎదుర్కొంది.
సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి పాలన(Kutami Rule)లో అరాచకాలు ఏనాడో తారాస్థాయిని చేరాయి. అయితే రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుచేస్తూ ఈ మధ్య మీడియా స్వేచ్ఛను కూడా హరించి వేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో కవరేజ్ కోసం సాక్షి ఛానెల్(Sakshi Channel) సహా నాలుగింటిపై ఆంక్షలు విధించడం చూశాం. ఇప్పుడు.. ఇవాళ.. శాసన మండలిలోనూ ప్రత్యక్ష ప్రసారాలు రాకుండా చానెల్స్‌ను అసెంబ్లీలోకి అనుమతించలేదు.
ఏపీ శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల దెబ్బకు మంత్రి నారా లోకేష్(Nara Lokesh Babu) వణికిపోయారు. వాళ్లు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తడబడ్డారు. చివరకు.. నీళ్లు నమిలిన గొంతుతోనే.. తమ లెక్కలన్నీ తప్పుడువేనని.. తమదంతా డబ్బా ప్రచారమేనని నిజాలు ఒప్పేసుకున్నారు. ఈ క్రమంలోనే.. ఇవాళ అసెంబ్లీ శాసన మండలిలో సమాచారశాఖ సాక్షికి లైవ్ ప్రసారాలను నిలిపివేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
సాక్షి మాత్రమే కాదు.. మరో మూడు మీడియా చానెల్స్‌కు లైవ్ ప్రసారం ఇవ్వకుండా అసెంబ్లీలోకి అనుమతించలేదు. కేవలం చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లకు అనుకూలంగా ఉన్న ఛానెల్స్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ పరిణామంపై సాక్షి గళమెత్తింది. ఈ పరిణామంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యలను.. ప్రశ్నించే ప్రతినిధులను చూపించేందుకు అనుమతి ఇవ్వాలని పోరాడింది. ఈ దెబ్బకు కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. ఐ అండ్ పీఆర్ ఛానెల్‌లో శాసన మండలి ప్రసారాలు పునఃప్రారంభం అయ్యాయి.
మొన్నటిదాకా సాక్షి మీడియా సంస్థ మీద అవాక్కులు చవాక్కులు పేల్చిన లోకేష్.. ఇప్పుడు ఆ ఛానెల్‌నే చూసి భయపడే స్థాయికి చేరుకున్నారనే చర్చ ఒకవైపు రాజకీయ వర్గాల్లో.. మరోవైపు సోషల్ మీడియాలోనూ నడుస్తోంది ఇప్పుడు .