పంట కాలువ కోసం ఆందోళన
పోలవరం కాలువ పనులను అడ్డుకున్న రైతులు
ప్రత్తిపాడు :
Ý çపోలవరం ఎడమ కాలువ పనులను రైతాంగం అడ్డుకుంది. సుమారు వెయ్యి ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే కాలువను మూసివేస్తూ పోలవరం కాలువ నిర్మాణం చేపట్టడంతో రైతాంగం ఆందోళన చేపట్టింది. స్థానిక పుత్ర చెరువు సమీపంలో పోలవరం కాలువ పనులు చేపట్టారు. తవ్వకం పనులను మైటాస్ కంపెనీ చేస్తోంది. ఏలూరు వెంకట పతిరాజు చెరువు నుంచి ప్రత్తిపాడులోని ఊర చెరువు, సిద్దావారి చెరువు, దేవులపల్లి వారి చెరువుకు తద్వారా కిర్లంపూడి మండలం సింహాద్రిపురంలోని నల్లా చెరువుకు సాగునీటిని అందించే కాలువను మూసివేస్తూ, పోలవరం కాలువ తవ్వకం పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న నీటి సంఘం అధ్యక్షుడు చెలంకూరి భాను, మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ బెహరా దొరబాబు ఆధ్వర్యంలో రైతులు నిర్మాణ పనుల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. పోలవరం కాలువ తవ్వకం వల్ల పంట కాలువ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉందని రైతాంగం ఆందోళన చెందింది. కనీసం పశువులు తాగేందుకు కూడా నీరు కొరతగా ఉందని, ఈసమయంలో కాలువను మూసివేయడం సమంజసం కాదంటూ సూపర్ ఫాసెజ్ వంతెన వద్ద రైతాంగం ధర్నా చేపట్టింది. కాలువ పనులు చేసే సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట కాలువ ఏర్పాటు చేసిన మీదటనే పోలవరం కాలువ తవ్వాలంటూ రైతులు భీష్మించారు. మైటాస్ కంపెనీ హెచ్ఆర్ మురళీ రైతులతో సంప్రదింపులు జరిపారు. పంట కాలువను యదాతధంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన మీదట రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సీంద్రపు చక్రం, తాపీ పనివారల సంక్షేమ సంఘ నాయకుడు పత్రి రమణ, రైతు నాయకులు మదినే సత్యనారాయణ, చిలకమర్తి నల్లబాబు, మూరా థామస్, సీంద్రపు భాస్కరరావు, బిర్రే రమణ, మదినే తదితరులు పాల్గొన్నారు.