ఎవరిని మోసం చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ యాత్రకు వెళ్లారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి ధ్వజమెత్తారు.
కిట్టీ పార్టీ స్నేహం పైనా రాజకీయమేనా?: బాబుపై శోభా నాగిరెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఎవరిని మోసం చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ యాత్రకు వెళ్లారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనపై ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నానని చెప్పి విభజన కోరడానికి బాబు ఢిల్లీకి వెళ్లారా? అని ఆమె తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.
ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. 6 కోట్ల మంది ప్రజలు తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తున్న సమయంలో ఇరు ప్రాంతాల టీడీపీ నేతలనూ వెంట బెట్టుకుని బాబు తన రాజకీయ లబ్ధే ధ్యేయంగా ఢిల్లీకి వెళ్లడాన్ని శోభా నాగిరెడ్డి తప్పుబట్టారు. కిట్టీ పార్టీ స్నేహంతో కాంగ్రెస్ నేతల భార్యలతో ఒకరిద్దరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల సతీమణులు ఢిల్లీ వెళ్లి విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పిస్తే దానిని కూడా చంద్రబాబు రాజకీయం చేసే స్థాయికి దిగజారారని దుయ్యబట్టారు. ఢిల్లీ వెళ్లింది జగన్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేయడానికేనన్నారు. ఇంత చేసిన చంద్రబాబు మళ్లీ ప్రకాశం జిల్లా యాత్రకు ఏ మొహం పెట్టుకుని వెళతారని ప్రశ్నించారు.