తనను పరాయి వ్యక్తిగా పిలిచిన సీఎం షీలా దీక్షిత్‌పై న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి విజేందర్ గుప్తా మండిపడ్డారు.
పరాయి ఎవరో స్పష్టత ఇవ్వాలి
Nov 16 2013 10:33 PM | Updated on Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: తనను పరాయి వ్యక్తిగా పిలిచిన సీఎం షీలా దీక్షిత్‌పై న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి విజేందర్ గుప్తా మండిపడ్డారు. తాను ఢిల్లీవాసినని, అయితే సీఎం షీలా దీక్షిత్ ఏ ప్రాంతానికి చెందినవారనే దానిపై స్పష్టత ఇవ్వాలని నిలదీశారు. గత రాజకీయ వివరాలను ప్రస్తావిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ నుంచి మూడుసార్లు, తూర్పు ఢిల్లీ నుంచి ఒక్కసారి దీక్షిత్ పోటీచేసి ఓడిపోయారన్నారు. ఇప్పుడు ఎవరు పరాయి వ్యక్తి? ఆమె ఏ ప్రాంతానికి చెందినవారనే దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ నియోజకవర్గంలో పోటీచేసేందుకు ఒకరు ఘజియాబాద్ నుంచి, మరొకరు కనౌజ్ నుంచి ఇక్కడకు వచ్చారని పరోక్షంగా ఏఏపీ అధ్యక్షుడు కేజ్రీవాల్, షీలాలపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ జల్ బోర్డు కుంభకోణంలో సీబీఐ చేపట్టిన ప్రాథమిక విచారణలో దీక్షిత్‌ను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. కిలో లీటర్ రూ.రెండు నుంచి రూ.49 వరకు పెరిగిందని, ఒకవేళ తనిఖీ చేయకపోతే రూ.100కు పోయినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. డీజేబీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ సీఎం వెంటనే రాజీనామా చేయాలన్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గ ప్రజలు నీటి కొరత ఎదుర్కొనేందుకు స్థానిక ఎమ్మెల్యే అయిన షీలానే కారణమన్నారు. ఆమె ముఖ్యమంత్రిగా పనిచేసింది తప్ప ఏనాడు ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని విమరిశంచారు. ఈసారి ఎమ్మెల్యేను గెలిపించుకొని, ముఖ్యమంత్రిని తప్పిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement