ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)నే ఇరు రాష్ట్రాలకు జూన్ 2 తర్వాత కూడా ఉమ్మడి ఈఆర్‌సీగా కొనసాగనుంది.
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)నే ఇరు రాష్ట్రాలకు జూన్ 2 తర్వాత కూడా ఉమ్మడి ఈఆర్‌సీగా కొనసాగనుంది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జూన్ 2 నుంచి ఆరు నెలల పాటు ఉమ్మడి ఈఆర్‌సీగా వ్యవహరించేందుకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న రెగ్యులేషన్స్‌ను మార్చనున్నట్టు ఈఆర్‌సీ కార్యదర్శి మనోహర్ రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై ఈ నెల 22వ తేదీలోగా తమ అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆ ప్రకటనలో కోరారు. రాష్ట్ర విభజన తర్వాత ఆరు నెలల్లోగా తెలంగాణకు ప్రత్యేక ఈఆర్‌సీ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది. అయితే, అప్పటివరకు ప్రస్తుతం ఉన్న ఈఆర్‌సీనే ఉమ్మడిగా ఇరు రాష్ట్రాలకు కొనసాగుతుందని చట్టంలో స్పష్టంగా పేర్కొనలేదని ఈఆర్‌సీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఈఆర్‌సీ రెగ్యులేషన్స్‌ను ఇందుకు అనుగుణంగా మార్చుతున్నట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి.