Features
-
ఇళ్లకు వెళ్లి మరీ సేవలు చేశాం
క్యాన్సర్‌తో పోరాడుతూ చివరిదశలో ఉన్నవారికి స్వస్థత చేకూర్చుతుంది హైదరాబాద్‌లోని స్పర్శ్ హాస్పిస్. కోవిడ్ టైమ్‌లో క్యాన్సర్ పేషంట్లకు సేవలు అందించడానికి, బయటి నుంచి వచ్చిన పేషంట్లను అడ్మిట్ చేసుకోవడానికి, భయాందోళనలో ఉన్న వారికి ధైర్యం చెప్పడానికి ఒక బృందంగా తామంతా ఎలా సిద్ధమయ్యారో హాస్సిస్ అడ్మినిస్ట్రేటర్ శారద లింగరాజు వివరించారు.‘‘ఇలాంటి సందర్భం వచ్చినప్పుడే ఒకరికొకరు ఉన్నామా, మన వరకే బతుకుతున్నామా.. అనే నిజాలు వెలుగులోకి వచ్చేది. మేం అందించేది ఎమర్జెన్సీ కేర్ కాదు. చనిపోయేదశలో ఉన్నవారికి ఉపశమనాన్ని ఇవ్వడం. కోవిడ్ సమయంలో అప్పటికే అంతటా భయాందోళనలు. ఎవరి వల్ల ఎవరికి కోవిడ్ వస్తుందో చెప్పలేం. ఎవరికి ఎవరు సాయంగా ఉంటారో తెలియదు. అలాంటప్పుడు రిస్క్ ఎందుకని, మేం ‘చేయలేం’ అని చెప్పవచ్చు. చేయూతనివ్వలేమని వదిలేయచ్చు. హాస్పిస్ తలుపులు మూసేయచ్చు. కానీ, మానవతా ధర్మంగా చూస్తే వారిని అలా వదిలేయడం సరికాదు అనిపించింది. అందుకే, క్యాన్సర్‌తో పోరాటం చేస్తూ కొన ఊపిరితో ఉన్నవారిని తీసుకువస్తే వారికి ‘లేదు’ అనకుండా కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ మాకు చేతనైన సేవలు అందించాం.నేరుగా వారి ఇళ్లకే..క్యాన్సర్ పేషంట్స్‌కి వారి స్టేజీలను బట్టి పెయిన్ ఉంటుంది. సరైన మందులు అందక వారు బాధపడిన సందర్భాలు ఎన్నో. వారు మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు ఆ మందులను వారి ఇళ్లకే వెళ్లి అందజేశాం. వారికి కావల్సిన స్వస్థతను ఇంటికే వెళ్లి అందించాం. ఈ సేవలో పాలిచ్చే తల్లులైన నర్సులూ పాల్గొన్నారు. ఆయాలు పేషంట్స్‌కు దగ్గరగా ఉండి, సేవలు అందించారు. పేషంట్స్ చనిపోతే అప్పటికప్పుడు బాడీ తీసేయమని చెప్పినవారున్నారు. కనీసం వారి పిల్లలు వచ్చేంత టైమ్ ఇవ్వమన్నా కుదరదనేవారు. వాళ్లు కోవిడ్‌తో కాదు క్యాన్సర్‌తో చనిపోయారు అని కన్విన్స్ చేయడానికి టైమ్ పట్టేది.వీడియోలలో దహన సంస్కారాలు.. ఒక బెంగాలియన్ క్యాన్సర్ చివరి దశలో చనిపోయాడు. మృతదేహాన్ని హాస్పిస్ నుంచి వారి స్వస్థలానికి తీసుకువెళ్లాలి. కోవిడ్ కాకుండా క్యాన్సర్‌తో చనిపోయాడనే లెటర్‌తో పాటు అంబులెన్స్‌ను సిద్ధం చేయించి పంపాం. వాళ్లు కూడా ఏమీ ఆలోచించకుండా అప్పటికప్పుడు వెళ్లి దహనసంస్కారాలు చేయించి వచ్చారు. మా దగ్గర సేవ పొందుతున్న వారు చనిపోతే కనీసం చివరి చూపు చూడటానికి కూడా వారి పిల్లలు రాలేని పరిస్థితి. అందువల్ల దహన సంస్కారాలు చేసే సమయంలోనూ, ఆ తర్వాత వారికి వీడియోలు చూపించేవాళ్లం. పసుపు, కుంకుమలు, చెట్లకు ఉన్న కాసిన్ని పూలు పెట్టి సాగనంపేవాళ్లం. వారి ఏడుపులు, మేం సమాధాన పరచడం.. ఆ బాధ.. ఆ సందర్భంలో ఎలా తట్టుకున్నామో.. ఇప్పుడు తలుచుకుంటే అదంతా ఒక యజ్ఞంలా చేశామనిపిస్తోంది.ప్రతి వారిలోనూ మంచితనాన్నే చూశాం..ఒక తల్లి చనిపోయే చివరి దశ. ఆమె కొడుకు తల్లిని చూడటానికి జార్ఖండ్ నుంచి వచ్చాడు. గచ్చిబౌలిలో ఉండేవాడు. రెండు మూడుసార్లు బైక్ మీద వచ్చాడు. కొడుకును చూడాలని ఆ తల్లి ప్రాణం కొట్టుకులాడేది. కొడుకు చూసి వెళ్లిన పది నిమిషాల్లో ఆమె చనిపోయింది. నిజంగా జబ్బు ముదిరిపోయి చివరిదశలో ఉంటే ఆ కష్టాన్ని ఒకలా చూస్తాం. కానీ, కోవిడ్ భయంతో చుట్టూ ఉన్న మానవసంబంధాల కష్టం అప్పుడే చూశాం. తమ వారిని చూసుకోవడానికే కాదు, బాడీని తమ స్వస్థలాలకు చేర్చుకోవడానికి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. డబ్బు కాదు బంధాలే ముఖ్యం అనిపించాయి ఆ రోజులు. చివరి రోజుల్లో ఉన్న క్యాన్సర్ పేషంట్లకు కోవిడ్ టైమ్‌లో ఏ దారీ లేదనే పరిస్థితుల్లో కూడా ‘మేం ఉన్నాం’ అనే ధైర్యాన్ని ఇచ్చాం. ప్రతి వాళ్లలో మంచితనాన్ని చూశాం’ అని గడిచిన కాలపు జ్ఞాపకాలలోని మానవతను కళ్లకు కట్టారు.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సినిమాయకు మంత్రం లేదా!
‘హోమ్‌వర్క్ చేయలేదేంటి?’ టీచర్ ప్రశ్న. ‘చెయ్యలా’... అన్నాడా స్టూడెంట్ తల వంకరగా పెట్టి.‘నిర్లక్ష్యంగా బదులిస్తావేంటి... క్లాసయ్యే వరకు నిలబడు’‘తగ్గేదేలే’ అంటూ విచిత్రంగా అభినయించాడు.భుజం తిప్పుతూ వికారంగా ముఖం పెట్టాడు.ఇది ఇప్పుడు స్కూళ్లను పట్టి పీడిస్తున్న జబ్బు.ఆ జబ్బుకు విరుగుడు కూడా రోగం మొదలైన చోటే ఉంది.‘మా స్కూల్లో సగం మంది విద్యార్థులు ‘ఫలానా’ సినిమా చూసిన తర్వాత చెడిపోయారు. విద్యార్థుల భాష మారిపోయింది, జుట్టు స్టైల్, డ్రెస్సింగ్ విచిత్రంగా ఉంటోంది. టీచర్లుగా వారికి మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తుంటాం. ఎంత చెప్పినా మా మాట వినడం లేదు. భాష మార్చుకోవాలని చెప్పినప్పుడు నిర్లక్ష్యంగా స్పందిస్తున్నారు. ఇలాంటి సినిమాలకు ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇస్తోంది? ఇలాంటి సినిమాలకు సెన్సార్‌బోర్డు సర్టిఫికేట్ ఎలా ఇస్తోంది?’ ఇటీవల విద్యాశాఖ కమిషనర్ మీటింగ్‌లో ఓ టీచర్ వెలిబుచ్చిన ఆవేదన ఇది. ఈ సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఆమె ఒక్కరే కాదు, బయటకు చెప్పలేక ఎందరో టీచర్లు ఇలాగే ఆవేదన చెందుతున్నారు. ఎవరూ పట్టించుకోకపోతే విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. జాతీయోద్యమకాలం సినిమాలు ‘‘సినిమా అనేది చాలా ప్రభావవంతమైన మాధ్యమం. అది ప్రధానంగా వినోదసాధనమే. కానీ సామాజిక బాధ్యత కూడా ఉండాలి. సామాజిక బాధ్యతతో కూడిన వినోదాన్ని అందించాలి. జాతీయోద్యమకాలంలో సినిమాలు ఈ పాత్ర పోషించాయి. జనంలో స్వాతంత్య్రపోరాట స్ఫూర్తిని రగిలించాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన సినిమాలకు ఒక సామాజిక లక్ష్యం అనేది లేకుండా పోయింది. సినిమా ప్రభావం పిల్లల మీద మంచి–చెడు రెండు వైపులా ఉంటుంది. సినిమాలో ప్రధానంగా ఏం ఉందో అదే నేర్చుకుంటారు. ఏ విషయాన్ని హీరోయిక్‌గా చూపించారో దానికే ఆకర్షితమవుతారు. సెన్సార్‌బోర్డు ఒక సినిమాకు ప్రదర్శనకు అనుమతి ఇచ్చే ముందు పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ‘ఏ’ సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలను తీసుకెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. తల్లిదండ్రులు శృంగార దృశ్యాలున్న సినిమాలకు మాత్రమే పిల్లలను మినహాయిస్తున్నారు. హింస ఉన్న సినిమాల విషయంలో పట్టింపుగా ఉండడం లేదు. పిల్లలను పక్కదారి పట్టిస్తున్న మాధ్యమాల్లో సినిమాలతోపాటు టీవీ ప్రసారాలు, సోషల్ మీడియాను కూడా ప్రస్తావించాలి. పిల్లల క్షేమం దృష్ట్యా ఆలోచించి నప్పుడు మనదేశాల్లో పటిష్టమైన నియమాలు లేవు.’’ అన్నారు విద్యావేత్త రేఖారావు. పాడైన విద్యార్థుల లెక్క తేలేదెలా? పిల్లల మీద సినిమాల ప్రభావం తీవ్రరూపం దాల్చింది. ఆ దుష్ప్రభావం పిల్లల భవిష్యత్తు మీద కూడా చూపిస్తుందని టీచర్లు ఆందోళనపడుతున్నారు. పిల్లలను సరిచేయడానికి మందలింపుగా ఒక మాట అంటే చాలా హింసాత్మకంగా స్పందిస్తున్నారని, ఇలాగే కొనసాగితే సమాజానికి మంచి పౌరులను అందించలేమని ఆవేదన చెందుతున్నారు. మరి ఇలాంటి సినిమాలు తీసిన ఫిల్మ్ మేకర్లు ఏం చేస్తున్నారు? సదరు సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనే లెక్కల గొప్పలు చెప్పడానికి ముందుంటారు. కానీ తమ సినిమా చూసిన తర్వాత ఎంతమంది పిల్లలు పాడయ్యారో లెక్కచెప్పే ధైర్యం వాళ్లకుంటుందా? ఒకప్పుడు సిగరెట్ గాల్లోకి ఎగరేసి పెదవులతో పట్టుకోవడం హీరోయిజంగా ఒక ట్రెండ్ సెట్ చేసింది. కేవలం స్టయిల్ అనే భావనతో సిగరెట్ అలవాటు చేసుకున్న నాటి యువతరం ఇప్పుడు అరవైలు– డెబ్బైలకు చేరి క్రమం తప్పకుండా లంగ్స్ టెస్ట్‌లు చేసుకుంటోంది. హీరోలు తమ పిల్లలను కూడా ఈ మత్తులోనే ఉంచుతున్నారా? సమాజంలోని పిల్లల పట్ల వారికి బాధ్యత అక్కర్లేదా? లేజీ పేరెంటింగ్ పరిణామాలివన్నీ ప్రశాంతంగా ఉండాల్సిన పిల్లలు ముఖాలు ఆవేశంగా, అలసటగా, ఆందోళనగా కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి వరకు సినిమాలు చూసి, పగలు క్లాస్‌రూమ్‌లో కునికిపాట్లు పడుతుంటారు. దీనికి బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు కథలు చెప్పే ఓపిక లేక వీడియో గేమ్స్‌కు అలవాటు చేస్తున్నారు. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ పిల్లల తల్లిదండ్రులు స్కూల్‌కి వచ్చి పిల్లలు తమ మాట వినడం లేదని కంప్లయింట్ చేస్తుంటారు. సినిమాలు చూసి పాడయిపోతున్న మాట నిజమే. పిల్లల ఖాళీసమయాన్ని సద్వినియోగం చేస్తే కదా! పెద్దవాళ్లను, టీచర్లను గౌరవించాలనే బుద్ధి పుట్టించే కథలను వాళ్లకు చెప్పి ఉంటే తల్లిదండ్రులను, టీచర్లను ధిక్కరించే ఆలోచనే రాదు. కథలు చెప్పే ఓపిక చాలామంది పేరెంట్స్‌కు ఉండడం లేదు. క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ సొల్యూషన్స్ ఉన్న కథలు మనకెన్నో ఉన్నాయి. కాకి నీటి కోసం కుండలో రాళ్లు వేసిన కథ. నోటిమాటతో డోర్ ఓపెన్ అయ్యే కథల్లో టెక్నాలజీ దాగి ఉంది. ఎలుకలను అమ్మే కథలో స్టార్టప్ మార్గం ఉంది. పంచతంత్ర కథల్లో లేనిదేమిటి? పిల్లల్లో ఇలాంటి అవాంఛిత ధోరణికి సినిమా అనేది ప్రత్యక్ష కారణం అయితే లేజీ పేరెంటింగ్ పరోక్ష కారణం. – రేఖారావు, విద్యావేత్త – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సముద్రమంత ఆత్మవిశ్వాసం
‘ఎగిసే అలలతో పోరాటం.. అమ్మాయిలకు సాధ్యమయ్యే పనేనా’ అనే చిన్నపాటి ఆలోచనలను కూడా దరిచేరనివ్వడం లేదు నవతరం. ఆకాశమే హద్దుగా నీటి మీదనే తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. క్లిష్టమైన సెయిలింగ్ క్రీడా పోటీలలో తమ సత్తా చాటుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. హైదరాబాద్ వాసులైన ఈ యువ సెయిలర్ల సాహసం ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తుంది.హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉండే పూతన మాన్య రెడ్డి మొదట స్కూల్ స్థాయిలో స్విమ్మింగ్ నేర్చుకుంది. స్విమ్మింగ్ పోటీలో పాల్గొంటూ సెయిలింగ్‌పై ఆసక్తి కలిగి, శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. సెయిలింగ్‌కి అనుకూలమైన వాతావరణం కోసం గోవా, మైసూర్..లలో ప్రాక్టీస్ చేసింది. సీనియర్లు ఉపయోగించే బోటుకు మారి, జాతీయ స్థాయిలో ఇప్పటికే 5 పతకాలు సొంతం చేసుకుంది. షిల్లాంగ్ నేషనల్ ర్యాంకింగ్ రెగెట్టా, తెలంగాణ జాతీయ జూనియర్ రెగెట్టాలోనూ కాంస్యాలను సాధించింది. థాయ్‌లాండ్, పోర్చుగల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్ నుంచిప్రాతినిధ్యం వహించింది. ఇటీవల మలేషియాలోని లంకాగ్వి అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలో పాల్గొని, బంగారు పతకాన్ని సాధించింది.సాహసాలు చేసే శక్తిని ఇస్తుంది ఈ క్రీడల్లో పాల్గొనడానికి చాలా శక్తి కావాలని, ఆరోగ్యసమస్యలు వస్తాయని, ఆడపిల్లలకు సరైనది కాదని చాలామంది నిరాశ పరిచారు. కానీ, సెయిలింగ్ ఎంత ఉత్సాహవంతమైన క్రీడనో, సాహసాన్ని ప్రదర్శించడమే కాదు సముద్రమంత ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుందని తెలిసింది. అంతేకాదు భవిష్యత్తు ఎంతో ఉత్తమంగా మార్చుకునే అవకాశాలనూ ఇస్తుంది. ఒలింపిక్స్ సెయిలింగ్ పోటీలో పాల్గొని పతకాలని సాధించేందుకు కృషి చేస్తున్నాను. ట్రైనింగ్, పోటీలు.. అంటూ నీళ్లతోనే మా సావాసం కాబట్టి అందుకు తగిన వ్యాయామం, సమతుల ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకుంటాను. లెవన్త్ గ్రేడ్ చదువుతున్నాను. వాయిలెన్ మరో ఇష్టమైన హాబీ, స్కూల్ ఎన్జీవోలో యాక్టివ్ మెంబర్ని.– పూతన మాన్యరెడ్డినీళ్లు చూస్తే భయం వేసిందినాలుగేళ్ల క్రితం మా స్కూల్లో ‘సెయిలింగ్‌లో శిక్షణ ఇస్తున్నార’ని చెబితే, ఆసక్తితో నా పేరు ఇచ్చాను. మొదట నీళ్లను చూస్తే భయం వేసింది. కానీ, ఒక్కసారి నీటిలో ప్రయాణించాక, మరోసారి పాల్గొనేలా ఆసక్తి కలిగింది. సెయిలింగ్ ఖర్చుతో కూడుకున్న క్రీడ. యాట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మాకు సపోర్ట్ చేస్తోంది. మా అమ్మ వంటలు చేస్తూ మమ్మల్ని చదివిస్తోంది. మా చదువుకు క్రీడలు కూడా తోడయితే మరిన్ని విజయాలు సాధించవచ్చు.. అని తెలుసుకున్నాం. అందుకే ధైర్యంగా నీటి అలలపై మమ్మల్ని మేం నిరూపించుకుంటున్నాం.– కొమరవెల్లి దీక్షితఅక్కను చూసి...అక్కను చూసి నేనూ సెయిలింగ్ స్పోర్ట్స్‌లోకి వచ్చేశాను. అండర్–15 కేటగిరీలో పాల్గొంటున్నాను. మలేషియాలో జరిగిన సెయిలింగ్ పోటీలో వివిధ దేశాల నుంచి వచ్చిన 102 మంది సెయిలర్స్ పాల్గొన్నారు. ఒమన్‌లో జరిగిన పోటీలో రజత పతకం సాధించాను. – కొమరవెల్లి లహరిభారత్తో పాటు సౌత్కొరియాలలో జరిగిన అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలో పాల్గొని స్వర్ణ, ర జిత పతకాలు సాధించిన ఈ అక్కాచెల్లెళ్లకు హైదరాబాద్‌లోని సెయిలింగ్ యాట్ క్లబ్ మద్దతునిస్తోంది.హైదరాబాద్ ఈస్ట్మారేడ్పల్లిలో ఉంటున్న ప్రీతి కొంగర ఓపెన్ డిగ్రీ చేస్తూ సీనియర్ సెయిలింగ్ స్పోర్ట్స్‌లో సంచనాలు సృష్టిస్తోంది. చైనాలో జరిగిన ఏషియన్ క్రీడలో పాల్గొంది. హైదరాబాద్, ముంబైలలో జరిగిన నేషనల్ ఛాంపియన్‌షిప్‌లలో రజత, స్వర్ణ పతకాలు సాధించింది.పేదరికం అడ్డుకాదు‘11 ఏళ్ల వయసులో సెయిలింగ్‌లోకి అడుగుపెట్టాను. సెయిలింగ్ అనేది చాలా ఓర్పుతో కూడుకున్న క్రీడ. దీనికి ఫిట్నెస్ చాలా అవసరం. ట్రైనింగ్‌లో భాగంగా రోజూ 4–5 గంటలుప్రాక్టీస్ చేస్తాను. ఈ క్రీడలో అబ్బాయిలు ఎంత కష్టపడాలో, అమ్మాయిలూ అంత కష్టపడాల్సిందే. అన్ని స్పోర్ట్స్ కన్నా ఇది చాలా భిన్నమైంది. సవాల్‌తో కూడుకున్నది. అందుకే సెయిలింగ్ని ఎంచుకున్నాను. ఏప్రిల్‌లో జరగబోయే ఒలింపిక్ సెయిలింగ్‌లో పాల్గొనడానికి శిక్షణ తీసుకుంటున్నాను.– ప్రీతి కొంగర– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
గుండె గొంతుక లోన క్రియేటివిటీ
గు... డ్మా... ర్నిం... గ్ అంటూ... కనపడకుండా వినిపించే వారి గొంతులోని హుషారు మన మదిలో ఉత్సాహాన్ని నింపుతుంది. అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న కాలం కూడా పరుగులు పెడుతుందా అనిపిస్తుంది. వారు నోరారా పలకరిస్తుంటే క్షణాలలో ఆత్మీయ నేస్తాలైపోతారు. గలగలా మాట్లాడేస్తూ మనలో ఒకరిగా చేరిపోతారు. ‘ప్రతిరోజూ మా వాయిస్‌ని కొత్తగా వినిపించాల్సిందే, అందుకు కొత్త కొత్త కాన్సెప్ట్‌తో మమ్మల్ని మేం సిద్ధం చేసుకోవాల్సిందే...’ అని చెబుతున్నారు రేడియో ఎఫ్.ఎమ్.లతో తమ గళంతో రాణిస్తున్న మహిళా రేడియో జాకీలు... వారితో మాటా మంతీ...– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిక్రియేటివిటీ అనుకున్నంత సులువు కాదునచ్చిన సినిమా పాటలు (Movie Songs) ఇంట్లో పాడుకుంటూ ఉండే నా గొంతు విని మాకు తెలిసినవారు రేడియోలో ట్రై చేయచ్చు కదా! అన్నారు. అంతే, ఆడిషన్స్‌కు వెళ్లి ఆఫర్ తెచ్చుకున్నాను. అయితే, అది అనుకున్నంత సులువు కాదు. ఇది చాలా క్రియేటివ్ ఫీల్డ్. చాలామందితో డీల్ చేయాల్సి ఉంటుంది. చాలా స్మార్ట్‌గా ఉండాలి. ఏ రంగంలోనైనా మంచి, చెడు అనుభవాలు ఉంటాయి. కానీ, వాటిని మోసుకుంటూ వెళితే నిరూపించుకోలేం. ఒక వైపు ఉద్యోగం చేస్తూ, మరోవైపు రేడియో జాకీగా మార్నింగ్ షో (Morning Show) చేస్తుంటాను. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతూనే నటిగానూ పన్నెండు తెలుగు సినిమాల్లోనూ నటించాను. ఎక్కడ నా క్రియేటివిటీని చూపించగలనో అక్కడ నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ, నన్ను నేను మలుచుకుంటూ నా శ్రోతలను అలరిస్తున్నాను. నా ఫ్రెండ్స్ ద్వారా థియేటర్ ఆర్టిస్ట్‌గానూ వేదికల మీద ప్రదర్శనలలో పాల్గొంటున్నాను. ఏ వర్క్ చేసినా నా సోల్ రేడియోలో ఉంటుంది. అందుకని, ఎన్ని పనులు ఉన్నా రేడియో లైఫ్‌ను వదలకుండా నా క్రియేటివిటీకి పదును పెడుతుంటాను. – ఆర్జె ప్రవళిక చుక్కల, ఆకాశవాణినవరసాలు గొంతులో పలికించాలిరేడియో (Radio) అనగానే క్యాజువల్‌గా మాట్లాడేస్తున్నారు అనుకుంటారు. కానీ, ఇందులో సృజనాత్మకత, ఉచ్చారణ, భావ ప్రకటనతో పాటు నవరసాలు పలికించాలి. కొన్ని సందర్భాలలో ఇంటి వాతావరణం సరిగా లేకపోయినా, ఎక్కడ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నా ఆ ప్రభావం వర్క్‌పై పడకూడదు. నా గొంతు వేల మంది వింటున్నారు అనే ఆలోచనతో అలెర్ట్‌గా ఉండాలి. హైదరాబాద్ బి కేంద్రంలో యువవాణి ప్రోగ్రామ్ నుంచి నేటి వరకు పద్దెనిమిదేళ్లుగా ఆకాశవాణిలో పని చేస్తున్నాను. ఇన్నేళ్ల నా అనుభవంలో సినిమాతారలు, సాహిత్యకారులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, వైద్యులు... ఇలా ఇంచుమించు అన్ని రంగాలలో ఉన్న ప్రముఖుల అంతరంగాలను ఆవిష్కరించాను. చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు అందిరినీ నా వాయిస్‌తో అలంరించాను అని గర్వంగా ఉంది. ఆర్మీడే, ప్రధానమంత్రి యోజన పథకాలు, బ్యాంకు, వైద్యం, సమాజంలో బర్నింగ్ ఇష్యూస్... లాంటి వాటిని లైవ్ కవరేజ్లుగా ఇచ్చాను. బెస్ట్ ఆర్.జె. అవార్డులూ అందుకున్నాను. రేడియో అంటే గలగల మాట్లాడటమే కాదు సాంకేతిక సామర్థ్యంతో పాటు అన్ని స్థాయుల వారిని కలుపుకుంటూ పనిచేయాలి. – ఆర్జె దీప నిదాన కవి, ఆల్ ఇండియా రేడియోనన్ను నేను మార్చుకున్నానుఈ రంగంలోకి రాకముందు ఎప్పుడూ రేడియో వినలేదు. ఆడిషన్స్ జరుగుతున్నాయనే విషయం తెలిసి, ట్రై చేద్దామని వెళ్లాను. పదకొండేళ్లుగా రేడియోకి అంకితమైపోయాను. గుడ్ ఈవెనింగ్ ట్విన్సిటీస్ అని రెయిన్బోలో వర్క్ చేశాను. ఇప్పుడు వివిధ భారతిలో సాయంకాలం 5 గంటల నుంచి షో చేస్తున్నాను. సినిమా, వైరల్ న్యూస్, ట్రాఫిక్ అప్డేట్స్, యూత్ ట్రెండ్స్, గాసిపింగ్, కరెంట్ టాపిక్స్ .. ఇలా అన్నింటి గురించి చెబుతుంటాను. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎదుటివారిని మెప్పించేలా నన్ను నేను ఎలా మార్చుకోవాలనే విషయాలు రేడియోకి వచ్చాకే తెలుసుకున్నాను. ఏ చిన్న విషయమైనా తక్కువ సమయంలో క్రియేటివ్‌గా, ఆసక్తికరంగా అనిపించేలా చెప్పగలగడం రేడియో ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. – ఆర్జె కృష్ణ కీర్తి, వివిధభారతిఉన్నతంగా తీర్చిదిద్దిందిప్రసారభారతిలో పద్దెనిమిదేళ్లుగా పని చేస్తున్నాను. రేడియో జాకీలు అనగానే నోటికివచ్చిందేదో వాగేస్తుంటారు అనుకుంటారు. కానీ, మేం ప్రతిరోజూ కొత్తదనంతో శ్రోతలకు పరిచయం అవుతాం. కంటెంట్‌ను సొంతంగా తయారు చేసుకోవడం, సృజనాత్మకతను జోడించడం, గొంతుతోనే కళ్లకు కట్టినట్టుగా వివరించడాన్ని ఓ యజ్ఞంలా చేస్తుంటాం. స్టూడియోలో కూర్చొనే కాకుండా అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాలు, దివ్యాంగులు... ఇలా 52 వివిధ రకాల స్వచ్ఛందసేవా సంస్థలతో కలిసి కార్యక్రమాలు చేశాను. సినిమా కథ పేరుతో తెరవెనుక జరిగే ప్రతి కష్టాన్నీ వినిపించాను. రేడియో నన్ను ఉన్నతంగా మార్చింది. డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని చేసింది. యాంకర్‌గా వేదికలపైనా, వివిధ కార్యక్రమాలను చేసే అవకాశాన్ని ఇచ్చింది. ఇన్ని అవకాశాలు ఇచ్చిన రేడియో నాకు దేవాలయంలాంటిది. – ఆర్జె స్వాతి బొలిశెట్టి, ఆల్ ఇండియా రేడియోప్రతిరోజూ హుషారే! నాకు నచ్చిన పనిని డబ్బులు ఇచ్చి మరీ చేయమంటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది? ఆ ఆనందంతోనే పదేళ్లుగా రేడియో మిర్చిలో ఆర్.జె.గా చేస్తున్నాను. రోజూ చూసేవీ, వినేవీ.. నా ఫ్రెండ్స్‌కి ఎలాగైతే చెబుతానో... శ్రోతలతో కూడా అలాగే మాట్లాడుతుంటాను. కొన్నాళ్ల వరకు నా మాటలను మాత్రమే విన్నవారికి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కనిపిస్తున్నాను కూడా. ఆర్జె అంటే మాట్లాడటం ఒకటేనా.. నవ్వించడానికి ఏం చేయచ్చు నన్ను నేను ప్రూవ్ చేసుకుంటున్నాను. క్రియేటివిటీ ఉన్నవారే ఈ రంగంలో ఉండగలరు. ఎంత హ్యాపీగా మాట్లాడినా పర్సనల్ ఎమోషన్స్ అడ్డు పడుతుంటాయి.అలాంటప్పుడు ఆ విషయాన్ని కూడా శ్రోతలతో పంచుకుంటాను. ‘ఈ రోజు అస్సలు బాగోలేదు, ఇంట్లో డిష్యూ డిష్యూం.. కానీ ఏం చేస్తాం, ముందుగా ఓ రెండుపాటలు వినేసి లైట్ తీసుకుందాం...’ ఇలా రోజువారి అంశాలకు హ్యాపీనెస్‌ను జతచేసి శ్రోతలకు ఇవ్వడానికి తపిస్తూనే ఉంటాను. నవరాత్రుల టైమ్‌లో తొమ్మిది మంది విభిన్నరంగాలలో విజయాలు సాధించిన మహిళలతో షో చేశాను. శ్రోతల్లో కొందరిని స్టూడియోకి పిలిచి, ట్రైనింగ్ ఇచ్చి మరీ వారి చేత మాట్లాడించాం. ఆర్జె స్వాతి...తో... అని షోలో మొదలుపెట్టే మాటలు, మిర్చి శకుంతల డ్రామా.. చాలా పేరు తెచ్చాయి. కళ్లతో చూసినదాన్ని గొంతులో పలికిస్తా. అదే అందరినీ కనెక్ట్ చేస్తుంది. – ఆర్జె స్వాతి, రేడియో మిర్చిరేడియోతో ప్రేమలో పడిపోయా! ‘సిరివెన్నెల’ నైట్ షోతో నా రేడియో జర్నీప్రారంభించాను. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవెనింగ్ షోస్ అన్నీ చేస్తూ వచ్చాను. పదిహేనేళ్లుగా నేర్చుకుంటూ, పని ద్వారా ఆనందాన్ని పొందుతున్నాను. ముఖ్యమైన రోజుల్లో ప్రముఖులతో మాట్లాడుతూ షో చేస్తుంటాం. మారుతున్న ప్రేమల గురించి చర్చిస్తుంటాను. ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతుంటాను. ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నానంటే అది రేడియో. ఒక వ్యక్తి గొంతు మాత్రమే విని, అభిమానించడం అనేది మామూలు విషయం కాదు. ఒకమ్మాయి కొన్నేళ్లుగా నా షోస్ వింటూ ఉంది. కుటుంబపరిస్థితుల కారణంగా చనిపోవాలనుకున్న ఆ అమ్మాయి, నాతో చివరిసారిగా మాట్లాడుదామని ఫోన్ చేసింది. షో మధ్యలో ఆపేసి, ఆమెతో మాట్లాడి, ఇచ్చిన భరోసాతో ఇప్పుడు వారి కుటుంబ సభ్యురాలిగా మారిపోయాను. రేడియో సిటీలో నా జీవితాన్ని మలుపుతిప్పిన ఇలాంటి సంఘటనలు ఎన్నో. – ఆర్జె సునీత, రేడియో సిటీచదవండి: ప్రేమానుగ్రహం రాశిపెట్టుందా?క్రమశిక్షణ నేర్పించిందిచిన్నప్పుడు రేడియో వింటూ మా అమ్మను ‘ఆ రేడియోలోకి ఎలా వెళ్లాలమ్మా!’ అని అడిగేదాన్ని. కానీ, నిజంగానే రేడియో స్టేషన్‌కి వెళ్లడం, అక్కడ నుంచి నా వాయిస్‌ను శ్రోతలకు వినిపించేలా మార్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ అవకాశాలు రావు. వచ్చినప్పుడు మాత్రం నిలబెట్టుకోవడానికి చాలా కృషి చేయాలి. రేడియో స్టేషన్లో అడుగుపెడుతూనే బయట ప్రపంచాన్ని మరచిపోతాను. అంతగా నన్ను ఆకట్టుకుంది రేడియో. ఎఐఆర్ పరి«ధులను దాటకుండా మేం పనిచేయాల్సి ఉంటుంది. కరోనా టైమ్‌లో అయితే ఎక్కువ షోస్ చేసేవాళ్లం. ప్రజలను చైతన్యవంతం చేయడానికి, భరోసా ఇవ్వడానికి భయాలను పక్కనపెట్టేశాం. ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడం, మల్టీటాలెంట్ ఉన్నవారితో పరిచయాలు ఏర్పడటం.. ఇలాంటివెన్నో రేడియో ద్వారానే సాధ్యమయ్యాయి. కాన్సెప్ట్ రాసుకోవడం, తడబాటు లేకుండా మాట్లాడటం, టైమ్ ప్రకారం షోలో పాల్గొనడం.. ఒక క్రమశిక్షణను నేర్పించింది రేడియో. – ఆర్జె లక్ష్మీ పెండ్యాల, ఆల్ ఇండియా రేడియో -
ఈ మాణిక్యం మట్టిలో పుట్టింది
‘డ్రీమ్ బిగ్... అచీవ్ బిగ్’ అన్నారు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం. గొప్ప కల కనాలి... ఆ కలను సాకారం చేసుకోవడానికి శ్రమించాలి. ఈ రెండు మాటలనూ ఒంట పట్టించుకుందా అమ్మాయి. తనకిష్టమైన టెన్నిస్ రాకెట్‌ని చేతిలోకి తీసుకుంది. టెన్నిస్‌ని ప్రేమిస్తోంది... టెన్నిసేప్రాణం అంటోంది... కానీ... ‘టాలెంట్ ఉంటేనే సరిపోతుందా’ అని పరిహసిస్తోంది రూపాయి. ప్రత్యర్థి మీద గెలవడం ఆమెకు ఏ మాత్రం చాలెంజ్ కాదు. ఆర్థిక పరిస్థితితో నిత్యపోరాటమే ఆమెను కుంగదీస్తోంది. తిరుపతికి చెందిన చందన పోతుగారి టెన్నిస్ ప్లేయర్. నేషనల్ ర్యాంకింగ్‌లో టాప్ 30లో ఉంది. మనదేశంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు మాత్రమే ఆడుతోంది. దేశం దాటి వెళ్లడానికి చేతిలో డబ్బు లేదు. ‘దేశంలో ఎక్కడికైనా సరే ట్రైన్లో జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్లిపోతాను, విదేశాల్లో ఆడాలంటే విమానం టికెట్ కొనుక్కోలేను’ అంటున్నప్పుడు చందన కళ్లలో టెన్నిస్ ఆట పట్ల ప్రేమతోపాటు తన ఆర్థిక పరిస్థితి పట్ల నిస్సహాయత వ్యక్తమైంది. ఈ మాణిక్యం మట్టిలో పుట్టింది. వెలుగు–చీకటి సామాన్య కుటుంబంలో పుట్టిన చందన ఎనిమిదేళ్ల వయసులో టెన్నిస్ రాకెట్ పట్టుకుంది. లెక్కకు మించిన విజయాలతో సాగిపోతోంది. ఆటలో రాణించాలంటే మెరుగైన శిక్షణ అవసరమని నాలుగేళ్ల కిందట కుటుంబం హైదరాబాద్‌కి వచ్చింది. గణేశ్ రామన్ టెన్నిస్ అకాడమీలో చేరింది. చందనలో ఆట పట్ల ఉన్న అంకితభావం, వారి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న కోచ్ ఫీజు గురించి పట్టుపట్టకుండా దేశం మెచ్చే క్రీడాకారిణిని తయారు చేయడానికి సిద్ధమయ్యారు.సరిగ్గా ఇక్కడే చందనకు కాలం కొత్త పరీక్షలు పెట్టింది. జీవితంలోకి వెలుగు–చీకటి ఒక్కసారిగా వచ్చినట్లయింది. ‘శిక్షణ కోసం నగరానికి వెళ్లడమేంటి, వయసు వచ్చిన ఆడపిల్ల తెలియని మనుషుల మధ్య మెలగడమేంటి’... అని బంధువులు ఆడిపోసుకోవడం మొదలుపెట్టారు. వారి మాటలను పట్టించుకోలేదు, కానీ తండ్రి కూడా ‘ఇక ఆట చాలు, పెళ్లి చేస్తాను’ అనడంతో హతాశురాలైంది. ఆమె కన్నీళ్లు తల్లికి అర్థమయ్యాయి. కానీ తండ్రిని కరిగించలేకపోయాయి. కుటుంబం రెండయింది. తల్లి మునిలక్ష్మి ఒంటరిగా కూతురి బాధ్యత మోస్తోంది. దేశం తరఫున ఆడాలి! ‘ఇంటర్నేషనల్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్లో భారతదేశం తరఫునప్రాతినిధ్యం వహించి గెలవాలనేది నా లక్ష్యం’ అంటున్న చందన టోర్నమెంట్లో గెలిచినప్పుడు వచ్చిన డబ్బును బస చేసిన గదికి అద్దె చెల్లించేసి తిరుగు ప్రయాణానికి డబ్బులు లెక్క చూసుకుంటూ జనరల్ టికెట్ కొనుక్కుని ఇంటికి వస్తోంది. చందనకు కొత్త రాకెట్ కూడా లేదని, తోటి క్రీడాకారులిచ్చిన రాకెట్, దుస్తులు, షూస్‌తో టోర్నమెంట్‌కు వెళ్తున్నదని, టెన్నిస్ కోసం చందన పడుతున్న కష్టాలను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది మునిలక్ష్మి. భగవంతుడి దయ వల్ల స్పాన్సర్స్ ముందుకు వస్తే రాకెట్లా దూసుకుపోతానని, దేశానికి మెడల్స్ సాధిస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పింది చందన. రాయలసీమ టోర్నీ నుంచి ఇంటర్నేషనల్ టోర్నీల వరకు నొవాక్ జొకోవిచ్, సెరీనా విలియమ్స్ తన రోల్ మోడల్స్ అంటున్న చందన అండర్ 12, అండర్ 14, అండర్ 16 కేటగిరీల్లో ఆరుసార్లు స్టేట్ చాంపియన్. అండర్ 12 ఏజ్ గ్రూప్‌లో రాయలసీమ టోర్నమెంట్ గెలిచింది. అండర్ 14లో చిత్తూరు, చెన్నై, పులివెందుల టైటిల్స్ సొంతం చేసుకుంది. చందన తొలి డబుల్స్ టైటిల్ కూడా పులివెందుల నుంచే. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నేషనల్స్‌లో నాలుగు సార్లు పాల్గొన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు సార్లు కెప్టెన్‌గా వ్యవహరించింది. ఇంటర్నేషనల్ టోర్నీలు 15 ఆడింది. ఈ రైట్ హ్యాండెడ్ ప్లేయర్ ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఉమెన్స్ డబుల్స్ (21), సింగిల్స్ (35), ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఒన్ లాక్ రుపీస్ ఉమెన్స్ టోర్నమెంట్ సింగిల్స్‌లో 5 సార్లు విజేతగా, మరో 12 సార్లు ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఆరుదఫాలు డబుల్స్ ఫైనలిస్ట్. ఎన్ని ఆర్థిక సవాళ్లు ఎదురైనా రాకెట్‌ని వదల్లేదు చందన. సరైన ఆహారం లేక కళ్లు తిరుగుతున్నా అలాగే టోర్నమెంట్ ఆడి, మజిల్ క్రాంప్తో కడుపు నొప్పితో బాధపడినప్పుడు కూడా ‘టెన్నిస్ అంటే నాకుప్రాణం’ ఆట కోసంప్రాణమైనా ఇస్తానన్నది చందన. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ప్రతినిధి -
గాన సరస్వతి
పువ్వుకు రాగం అబ్బితే ఎలా ఉంటుంది? ఆ పువ్వు స్వరాన్ని ఎలా సవరించుకుంటుంది? ఆ తావి గానాన్ని ఎలా శ్రుతి చేసుకుంటుంది? అక్షరాలను పూలరెక్కల్లా పొదివి పట్టుకుంటుంది. సరిగమలు కందకుండా సున్నితంగా గానం చేస్తుంది. ఆ గాన సరస్వతి... మన రావు బాలసరస్వతీదేవి. పువ్వు పాడితే ఎలా ఉంటుందో... రావు బాలసరస్వతీదేవి పాట వింటే తెలుస్తుంది. హైదరాబాద్, మణికొండలోని గాయత్రి ప్లాజాలో ఆమె ఫ్లాట్ గోడలు ఆ గానసరస్వతి రాగాలను నిత్యం వింటుంటాయి. తొంభై ఐదేళ్ల వయసులో కూడా ఆమె స్వరంలో రాగం శ్రుతి తప్ప లేదు. తొంభై ఏళ్లుగా సాగుతున్న సాధనతో ఆ స్వరం అద్దుకున్న తియ్యదనం అది. పారిజాత పువ్వులాంటి మృదుత్వం ఆమె రాగానిది. ఆ గొంతు సన్నజాజి మొగ్గలా పరిమళం వెదజల్లుతోందిప్పటికీ. ఆ సుమధుర గానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తొమ్మిది దశాబ్దాల ఆమె సంగీత సేవను గౌరవిస్తోంది. నవంబర్ ఒకటవ తేదీన (రేపు) ఆమె వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. గ్రామఫోన్ నుంచి సీడీల వరకు సరస్వతి నాలుగవ ఏట నుంచి వేదికల మీద పాడుతున్నారు. ఆరవ ఏట హెచ్.ఎం.వి కంపెనీ ఆమె పాటను గ్రామఫోన్‌లో రికార్డు చేసింది. తెలుగు సినిమాలో తొలి నేపథ్య గాయనిగా రికార్డు ఆమెదే. ఆకాశవాణి కేంద్రాలు మద్రాసు, విజయవాడ స్టేషన్ల కోసం ప్రారంభగీతం పాడిన రికార్డు కూడా ఆమెదే. తెలుగు, తమిళ, కన్నడ భాషలతోపాటు సింహళ గీతాలనూ ఆలపించారు. బాలనటిగా, బాల గాయనిగా సినీరంగం ఆమెను గారం చేసింది. పేరు ముందు ‘బాల’ను చేర్చింది. కర్ణాటక సంగీతం, హిందూస్థానీ సంగీతాలు సాధన చేసింది. సినిమా షూటింగ్‌ల కారణంగా స్కూలుకెళ్లడం కుదరకపోవడంతో ఆమె చదువు కోసం ట్యూటర్ ఇంటికి వచ్చి పాఠాలు చెప్పేవారు. ఆమెకు ఇంగ్లిష్ నవలలు చాలా ఇష్టం. ఆ అలవాటును ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. గ్రామఫోన్ రికార్డుల కాలం నుంచి క్యాసెట్ టేప్‌లో రికార్డ్ చేసే టెక్నాలజీని చూశారు. సీడీలు, ఎంపీత్రీలనూ చూశారు. టెక్నాలజీతోపాటు అప్డేట్ అవుతూ వచ్చారు. కానీ, సినిమా సంగీతం, సాహిత్యంలో వచి్చన భాషాపరంగా విలోమమవుతున్న ప్రమాణాలను అంగీకరించలేకపోయారు. సినిమా అంటే శక్తిమంతమైన వినోదసాధనం. పిల్లలు, యువతకు మానసిక వికాసం, మేధో వికాసంతోపాటు వాళ్ల అభివృద్ధికి... వినోదం అనే సాధనంతో బాటలు వేసే గొప్ప కళామాధ్యమంగా ఉండాలి సినిమా. అంతే తప్ప విలువలను దిగజార్చుకునే సాధనం కాకూడదని చెబుతారామె. రెండు వేలకు పైగా పాటలు పాడిన ఈ సంగీత సరస్వతి ఈ రోజుల్లో పాటల సాహిత్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పాట కలిపింది ఇద్దరినీ! చెన్నై (మద్రాసు) లో పుట్టి పెరిగిన బాల సరస్వతి పెళ్లి తర్వాత కోడలిగా కోలంక జమీందారీలో అడుగుపెట్టారు. ప్రకృతి ఇద్దరు వ్యక్తులను దూరం చేసిన విషాదాంతాలను సినిమాల్లో చూస్తుంటాం. కానీ ప్రకృతి ఇద్దరు మనుషులను దగ్గర చేయాలనుకుంటే చాలా చమత్కారంగా దగ్గర చేస్తుంది. అందుకు ఈ గానసరస్వతి పెళ్లే గొప్ప ఉదాహరణ. ‘‘నా పాటను వినడానికి స్వయంగా కోలంక జమీందార్... శ్రీ రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు గారు మద్రాసులో మా ఇంటికి వచ్చారు. నేనప్పుడే ‘కలువ రేకుల కనులు గల నా స్వామీ’ అనే పాట రికార్డింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాను. మా నాన్న పాట పాడమనగానే అదే పాట పాడాను. రాజా వారేమో తన పెద్ద కళ్లను వరి్ణస్తూ, వారి మీద ప్రేమను అలా పాట రూపంలో వ్యక్తం చేశాననుకున్నారట. అదే మా పెళ్లికి నాందీ గీతం’ అంటూ ఆనాటి జ్ఞాపకాన్ని సంతోషంగా గుర్తు చేసుకున్నారామె. అందుకే తనకు ఇష్టమైన ప్రదేశం మద్రాసేనని చెబుతారామె. ఈ బాల రెండో బాల్యమిది! బాలసరస్వతీ దేవికి హాఫ్ వైట్ పట్టు చీరలిష్టం. క్రీమ్ కలర్‌తో అనేక రంగుల కాంబినేషన్లలోనే ఎక్కువగా కనిపిస్తారు. ఆమెకు మల్లెలన్నా ఇష్టమే. ఇక స్వీట్స్... ముఖ్యంగా గులాబ్ జామూన్, జాంగ్రీలను చూస్తే చిన్నపిల్లయిపోతారు. చాక్లెట్ చేతికిస్తే పసి పిల్లల ముఖం వికసించినట్లే ఆమె ముఖంలో నవ్వులు పూస్తాయి. భోజనం గుప్పెడే కానీ, ఆ వెంటనే స్వీట్ తినడం ఆమెకిష్టం, ఆ తర్వాత తియ్యగా పాడడం మరింత ఇష్టం. ఆ సరిగమల వారసత్వం ఇద్దరు కొడుకులకు రాలేదు, మనుమడు, మనుమరాలికీ రాలేదు. కానీ మనుమరాలి కూతురు నేహకు వచ్చింది. గానసరస్వతి కళ్ల ముందే ఆ ఇంట్లో సరిగమల కొత్తతరం వెల్లివిరుస్తోంది. తొంబై ఐదేళ్ల వయసులో హైదరాబాద్‌లోని పెద్ద కుమారుని ఇంటిలో ప్రశాంతంగా పసిబిడ్డలా జీవిస్తున్నారు బాల సరస్వతీదేవి. కన్నతల్లిని ‘కన్నక్కా’ అని పిలుస్తూ తల్లిని కన్నబిడ్డలా చూసుకుంటున్నారాయన. కోడలు అత్తగారి చిన్నప్పటి జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ ఆమెను అపురూపంగా చూసుకుంటున్నారు. సాక్షి ఇంటర్వ్యూలో ఆమె కొన్ని సంగతులు చెప్తూ మధ్యలో మర్చిపోతుంటే ఆమె పెద్ద కొడుకు, పెద్ద కోడలు అందుకుని పూర్తి చేయడమే అందుకు నిదర్శనం. సినిమాలకు మాత్రమే దూరం... స్వరానికి కాదు! పెళ్లి తర్వాత పదిహేనేళ్లకు బాల సరస్వతీదేవి సినిమాల కోసం పాడడం మానేశారు. కానీ సంగీత సాధన మాత్రం ఆపలేదు. సినారె తెలుగులోకి అనువదించిన మీరాభజన్ గీతాలను ఆలపించారామె. ఎనభై ఏళ్ల వయసులో ఆమె తనకిష్టమైన కొన్ని లలిత గీతాలను ఎంచుకుని స్వీయ సంగీత దర్శకత్వం వహించి ‘రాధా మాధవం’ సీడీ విడుదల చేశారు. కోవిడ్‌కి ముందు 2018లో అంటే ఆమె తొంబయ్యేళ్ల వయసులో ‘స్వరాభిషేకం’ కార్యక్రమంలో పాడడమే ఆమె చివరి వేదిక. ఆ వేడుక తర్వాత మూడవ రోజు ఇంట్లో జరిగిన ప్రమాదం ఆమెను ఇంటికే పరిమితం చేసింది. అయితే ఆశ్చర్యంగా జారి పడడంతో విరిగిన తుంటి ఎముక దానంతట అదే సరయింది. సంగీతమే తనను స్వస్థత పరిచిందంటారామె. ఇప్పటికీ రోజూ ఆ స్వరం రాగాలను పలుకుతుంటుంది. ఆమె ఊపిరితిత్తులకు శక్తినిస్తున్నది సంగీతమేనని వైద్యులు కూడా నిర్ధారించారు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: మోహనాచారి