విద్యుత్ శాఖలో తాజా పరిణామాల కలకలం
విద్యుత్ సరఫరాలో అంతరాయాలపై సీఎం సీరియస్
వెనువెంటనే ‘యాదాద్రి’పర్యవేక్షణకు ఐదుగురు ఐఏఎస్‌లతో కమిటీ
ప్లాంట్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇవ్వనున్న కమిటీ
ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్ మిత్తల్, జెన్కో ఎండీ హరీశ్‌ను పక్కన పెట్టడంపై సందేహాలు
నివేదిక ఆధారంగా ఇద్దరు ఉన్నతాధికారులపై వేటు పడుతుందనే చర్చ
మరోవైపు హుటాహుటిన యాదాద్రికి వెళ్లిన మిత్తల్, హరీశ్
జెన్కో డైరెక్టర్లూ అక్కడే మకాం..సీఎం వ్యాఖ్యలపై అంతర్గత సమావేశంలో చర్చ!
విధుల్లో నిర్లక్ష్యం ఆరోపణలతో యాదాద్రి సీఈ సస్పెన్షన్
ఉన్నతాధికారులతో మాట్లాడి ఆరా తీసిన డిప్యూటీ సీఎం భట్టి!
సాక్షి, హైదరాబాద్: ఇంధన శాఖలో విద్యుత్ కోతల ప్రకంపనలు మొదలయ్యాయి. కోతలు కొనసాగితే ఐఏఎస్‌లపై సైతం చర్యలకు వెనుకాడనని బుధవారం ముఖ్యమంత్రి హెచ్చరించారు. వెనువెంటనే గురువారం యాదాద్రి థర్మల్ ప్లాంట్ పర్యవేక్షణ, పరిశీలనకు ప్రభుత్వం ఐదుగురు ఐఏఎస్‌లతో కమిటీ వేసింది. దీంతో ఉన్నతాధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్, జెన్కో ఎండీ హరీశ్ హుటాహుటిన యాదాద్రి ప్లాంట్‌కు వెళ్ళారు. ఇక జెన్కో డైరెక్టర్లంతా అక్కడే మకాం వేశారు.
మరోవైపు యాదాద్రి థర్మల్ కేంద్రం చీఫ్ ఇంజనీర్ సురేష్ నాయక్‌ను జెన్కో ఎండీ సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మరోవైపు యాదాద్రి కేంద్రంగా ఇంధనశాఖ, జెన్కో ఉన్నతాధికారులు రహస్యంగా సమావేశమైనట్టు తెలిసింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై అధికారులు సీరియస్‌గా చర్చించినట్టు తెలిసింది.
సీఎం వ్యాఖ్యలపై కొందరు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా ఈ భేటీ జరిగిందనే సమాచారంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీనిపై ఆరా తీసినట్టు తెలిసింది. మొత్తం మీద తాజా పరిణామాలు విద్యుత్ శాఖలో తీవ్ర కలకలం రేపుతుండగా, కొందరు కీలక అధికారులపై చర్యలు తప్పవనే చర్చా ఇంధన శాఖలో జరుగుతోంది.
యాదాద్రి చుట్టూ వివాదం
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం సాక్షిగా వివాదం మొదలైంది. బొగ్గు కొరత తీవ్రంగా ఉందని అధికారులు చెబుతున్నారు. 4 వేల మెగావాట్ల ప్లాంట్ల నుంచి కేవలం సగటున 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా జరగడం లేదు. మిగతా ప్లాంట్లూ బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. జల విద్యుత్ ప్రాజెక్టులు పడకేశాయి. కొందామన్నా బహిరంగ మార్కెట్లో కరెంటు అంత సులభంగా అందుబాటులో లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అనధికారిక కోతలు అమలవుతున్నాయి. కరెంటు కోతలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా, ప్రజలు సైతం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
దీంతో సీఎం ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జెన్కో ఎండీపై సీరియస్ అయ్యారు. 4 వేల మెగావాట్ల ప్లాంట్ సరిగా పని చేయకపోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఐదుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసింది. చెవ్వూరు హరికిరణ్ (ఎక్సైజ్ కమిషనర్), వెంకటేశ్ ధోత్రే, (విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి), రాహుల్ రాజ్ (సహకార శాఖ ప్రత్యేక కమిషనర్, రిజి్రస్టార్), జెండాగే హనుమంత్ కొండిబా (ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో), కిల్లు శివకుమార్ నాయుడు (ఆర్అండ్ఆర్, భూసేకరణ కమిషనర్)ను కమిటీలో చేర్చింది.
యాదాద్రిపై దృష్టి.. విస్తృత తనిఖీలు
కొన్నాళ్ళుగా ఇంధనశాఖ, జెన్కో ఉన్నతాధికారులు ఇచ్చే నివేదికల్లో విశ్వసనీయత లేదని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ ఐదుగురు అధికారులూ బొగ్గు సరఫరా నుంచి విద్యుదుత్పత్తి వరకు తనిఖీలు నిర్వహించడంతో పాటు యాదాద్రిలో జరిగే పరిణామాలను పరిశీలిస్తారు. గురువారం నుంచి ఈ నెలాఖరు వరకూ ఈ బృందం యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ను పరిశీలించి నివేదిక ఇస్తుంది. దీని ఆధారంగా ఉన్నతాధికారులపై వేటు వేస్తారనే ప్రచారం జరుగుతోంది.
కాగా కమిటీ ప్లాంట్‌లోని నాలుగు యూనిట్లూ పూర్తిస్తాయిలో పని చేస్తున్నాయా? లేదా?.. ఉత్పత్తి తగ్గడానికి కారణాలేమిటి? నాలుగు బొగ్గు సరఫరా వ్యవస్థలు (కోల్ స్ట్రీమ్స్) కూడా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయా? ఏవైనా అంతరాయాలు ఉంటే వాటికి కారణాలేమిటి? బొగ్గు సరఫరా వ్యవస్థల గరిష్ట సామర్థ్యం ఎంత? ప్రస్తుతం ఎంత మేర సరఫరా జరుగుతోంది? అనే అంశాలను పరిశీలిస్తుంది. ప్లాంట్‌కు అందుతున్న బొగ్గు గ్రేడ్ ఏమిటి? ఆ నాణ్యతకు అనుగుణంగా విద్యుదుత్పత్తి జరుగుతోందా? బొగ్గు నాణ్యతలో తేడాల వల్ల ఉత్పత్తిపై ప్రభావం పడుతోందా? అనే విషయాలను సమీక్షించనుంది.
నాలుగు యూనిట్లకు అవసరమైన స్థాయిలో బొగ్గు సరఫరా అవుతోందా? బొగ్గును బంకర్లలోకి పంపే ప్రక్రియలో కీలకమైన వీఈజీఎఫ్ (వేరియబుల్ గేట్ ఫీడర్లు)లో జామింగ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా? వీటివల్ల బొగ్గు సరఫరాకు ఆటంకం కలుగుతోందా? ప్లాంట్‌లో బీహెచ్ఈఎల్ చేపట్టాల్సిన పనులు ఇంకా ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయా? వాటి ప్రస్తుత స్థితిగతులు తదితర అంశాలను కమిటీ తనిఖీ చేసి నివేదిక ఇవ్వనుంది. బొగ్గు రేక్‌లను అన్ లోడింగ్ చేయడానికి పడుతున్న సమయం ఎంత? ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటి? అనే అంశాలను కూడా అధికారులు పరిశీలించనున్నారు.
ఆ ఇద్దరు ఉన్నతాధికారులపై వేటు లక్ష్యంగా..?
ఐదుగురు సభ్యుల కమిటీ పూర్తి వివరాలతో నివేదిక రూపొందించనుంది. అయితే వీటన్నింటిపైనా కొన్నేళ్ళుగా పట్టున్న ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మిత్తల్, జెన్కో ఎండీ హరీశ్‌ను కాదని మరో కమిటీ వేయడంపై అనేక సందేహాలు నెలకొంటున్నాయి. ఈ ఇద్దరి అధికారుల వైఫల్యాన్ని లక్ష్యంగా చేసుకుని, వేటు వేయడానికే కమిటీ వేసినట్టు జెన్కో వర్గాల్లో చర్చ జరుగుతోంది.
డిప్యూటీ సీఎం ప్రశంసించిన మర్నాడే..!
తాజా పరిణామాల నేపథ్యంలో ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి, జెన్కో ఎండీ యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు వెళ్ళారు. జెన్కో డైరెక్టర్లంతా వారిని అనుసరించారు. నైనీ బ్లాక్ నుంచి బొగ్గు రప్పించడం, సింగరేణి బొగ్గు పెంచడం, ఉత్పత్తి మెరుగు పర్చడానికే సమావేశం నిర్వహించినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే సీఎం చేసిన వ్యాఖ్యలపై అధికారులు చర్చించినట్టు తెలిసింది.
వాస్తవానికి ఒకరోజు ముందే డిప్యూటీ సీఎం విక్రమార్క విలేకరుల సమావేశంలో అధికారుల కృషిని ప్రశంసించారు. ఆ మర్నాడే సీఎం సీరియస్‌గా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతలోనే ఈ మార్పు ఏమిటి? అనే దానిపై అధికారులు చర్చించినట్టు తెలిసింది. కమిటీ వేయడం వెనుక ఉన్నతాధికారులను తప్పించే లక్ష్యం ఉందనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేసిన కమిటీకి సహకరించకూడదనే చర్చా అధికారులు, సిబ్బందిలో జరిగినట్టు సమాచారం. అయితే తన శాఖలో సీఎం జోక్యం, అధికారుల సమావేశంపై డిప్యూటీ సీఎం భట్టి ఆరా తీసినట్లు తెలిసింది. గురువారం ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు విద్యుత్ శాఖ వర్గాలు చెబుతున్నాయి.


