జిల్లాల్లోనే కరోనా వైద్యం | Sakshi
Sakshi News home page

జిల్లాల్లోనే కరోనా వైద్యం

Published Thu, Jul 30 2020 3:26 AM

Telangana district hospitals to start corona treatment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా బాధితులకు ఎక్కడికక్కడ ఆయా జిల్లాల పరిధిలోనే నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా రోగులకు సకాలంలో వైద్యం అందడంతోపాటు హైదరాబాద్‌లోని ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గనుంది. పైగా కరోనా సామాజిక వ్యాప్తితో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో 137 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలకు సర్కారు అనుమతి ఇచ్చింది. వీటిలో 57 ప్రభుత్వ, 80 ప్రైవేట్‌ ఆస్పత్రులు ఉన్నాయి. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) స్థాయి నుంచే నిర్ధారణ పరీక్షలు చేస్తారు. కరోనా చికిత్స అందించే ఆస్పత్రులు, పడకలు, ఖాళీల వివరాలతో కూడిన 61 పేజీల భారీ బులెటిన్‌ను బుధవారం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు విడుదల చేశారు. గత 24 గంటల లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో 8,446, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 5,013.. మొత్తం 13,459 పడకల్ని కరోనా రోగులకు కేటాయించారు. వీటిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6,230, ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో 1,744 పడకలు (మొత్తం 7,974) ఖాళీగా ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొన్నారు. అయితే ఏ జిల్లాలో చికిత్స అక్కడే జరగాలన్న నిర్ణయం కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగే అవకాశముంది. ప్రైవేట్‌ ఆస్పత్రులకు వచ్చేవారిని ఆపే పరిస్థితి ఉండదు. 

కొత్తగా 1,764 కేసులు.. 12 మంది మృతి 
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ రెండు మూడు రోజులుగా వరుసగా పెరుగుతున్నాయి. బుధవారం విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 1,764 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 12 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 58,906కు, మృతుల సంఖ్య 492కు పెరిగింది. ఇక ఒకేరోజు 842 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకు మొత్తం కోలుకున్నవారి సంఖ్య 43,751కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,663 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో హోం సహా ఇతరత్రా ఐసోలేషన్‌లో 9,178 మంది ఉన్నారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 509, మేడ్చల్‌ జిల్లాలో 158, రంగారెడ్డి జిల్లాలో 147, వరంగల్‌ అర్బన్‌లో 138, సంగారెడ్డి జిల్లాలో 89 ఉన్నాయి. వనపర్తి జిల్లాలో అత్యంత తక్కువగా 4 కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు దేశవ్యాప్తంగా 64 శాతం ఉండగా, రాష్ట్రంలో 74.3 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొన్నారు.

ఒకే రోజు 18,858 శాంపిళ్ల పరీక్ష 
గత 24 గంటల్లో ఒకేరోజు 18,858 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. దీం తో రాష్ట్రంలో మొత్తం పరీక్షించిన నమూనాల సం ఖ్య దాదాపు 4 లక్షలకు (3,97,939) చేరుకుంది.  

Advertisement
Advertisement