మేడిగడ్డ బరాజ్‌పై సాంకేతిక పర్యవేక్షణ కమిటీ స్పష్టీకరణ
ఢిల్లీలో కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణ పనుల ప్రాథమిక డిజైన్లపై చర్చ
పలు మార్పులు సూచించిన కమిటీ
బరాజ్‌లకు ఎగువ, దిగువన డయాఫ్రమ్ వాల్స్ ఏర్పాటు
దిగువన కొత్త స్టిల్లింగ్ బేసిన్లు, కొత్త కటాఫ్ వాల్స్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ మరమ్మతులు, పునరుద్ధరణ అంత సులభంగా పూర్తయ్యేలా కనిపించడం లేదు. కుంగిపోయిన మేడిగడ్డ బరాజ్ ఏడో నంబర్ బ్లాక్‌ను పునాదులతో సహా పూర్తిగా తొలగించి పునర్నిర్మించక తప్పదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సభ్యులు(టెక్నికల్) అధ్యక్షతన ఏర్పాటైన సాంకేతిక పర్యవేక్షణ కమిటీ సూచించినట్టు తెలిసింది. ఏడో బ్లాక్‌లోని కొన్ని పియర్ల(పిల్లర్లు)కు తీవ్ర పగుళ్లు ఏర్పడటంతో పాటు, రాఫ్ట్ (పునాది) భాగం నదీ గర్భంలోకి కుంగిపోవడంతో.. ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించి పునర్నిర్మించాలా? లేక బ్లాక్‌ను నాన్ ఓవర్ ఫ్లో (ఎన్ఓఎఫ్) డ్యామ్‌గా మార్చాలా? అనే రెండు ప్రత్యామ్నాయాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది.
ఎన్ఓఎఫ్ డ్యామ్‌గా మార్చాలని నిర్ణయిస్తే ఏడో బ్లాక్ గేట్లను తొలగించి పూర్తిగా కాంక్రీట్ గోడగా పటిష్టం చేస్తారు. కాగా ఏడో బ్లాక్‌ను బలోపేతం చేసి మరమ్మతులు చేయడంపై పరిశీలన జరిగినప్పటికీ, ఇప్పుడు దెబ్బతిన్న భాగాలను పూర్తిగా తొలగించి మొదటి నుంచి పునర్నిర్మించకతప్పదని సాంకేతిక పర్యవేక్షణ కమిటీ సూచించినట్టు సమాచారం. ఈ విధానంలో దెబ్బతిన్న నిర్మాణ భాగాలను కత్తిరించి తొలగించడం, అనంతరం పునాదుల స్థాయి నుంచి తిరిగి నిర్మించడం వంటి క్లిష్టమైన పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఏడో బ్లాక్‌కు ఇరువైపులా ఉన్న ఇతర బ్లాకులకు నష్టం జరగకుండా పనులు చేసే అంశంపై నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ–పీఈఎస్ జేవీతో విస్తృతంగా చర్చించాలని నీటిపారుదల శాఖకు కమిటీ సూచించినట్లు సమాచారం.
కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణ చర్యలను పర్యవేక్షించడానికి కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన ఈ కమిటీ బుధవారం న్యూఢిల్లీలో ఎన్డీఎస్ఏ సమావేశ మందిరంలో భేటీ అయ్యింది. కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణ చర్యలపై విస్తృతంగా చర్చించింది. పునరుద్ధరణ పనులకు సంబంధించి డిజైన్ కన్సల్టెన్సీ ‘ఆఫ్రీ ఇండియా’రూపొందించిన ప్రాథమిక డిజైన్లు, డ్రాయింగ్స్‌ను పరిశీలించి పలు మార్పులను సూచించింది. మూడు వారాల్లోగా సమగ్ర డిజైన్లు, డ్రాయింగ్స్‌ను రూపొందించి తదుపరి సమావేశానికి తీసుకురావాలని నీటిపారుదల శాఖను కోరింది.
ఎన్ఓఎఫ్ డ్యామ్ తట్టుకుంటుందా?
మేడిగడ్డ బరాజ్‌ను 2019లో డిజైన్ చేసినప్పుడు అందుబాటులో ఉన్న వరద లెక్కలతో పోల్చితే ఆ తర్వాత గణనీయమైన మార్పులొచ్చాయని, బరాజ్‌కు వరుసగా నాలుగు రోజులు, ఆపై కాలానికి భారీ వరదలు పోటెత్తితే ఎన్ఓఎఫ్ డ్యామ్ తట్టుకుని నిలబడకపోవచ్చని కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్ఎస్), వాతావరణ శాఖ సహకారంతో వరదల సరళిపై అధ్యయనం జరపిన తర్వాతే మేడిగడ్డ బరాజ్‌లోని ఏడో బ్లాక్‌పై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు అదనపు భద్రత కోసం వాటికి ఎగువన, దిగువన డయాఫ్రమ్ వాల్స్ నిర్మాణంతో పాటు దిగువన ఉన్న స్టిల్లింగ్ బేసిన్ల విస్తరణ, కొత్త కటాఫ్ వాల్స్ నిర్మాణం, పునాదుల కింద నీటి ప్రవాహం నివారణకు సంబంధించి నీటిపారుదల శాఖ సమర్పించిన ప్రాథమిక డిజైన్లను కమిటీ పరిశీలించి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం.
స్టిల్లింగ్ బేసిన్‌ను పొడిగించాలి
మేడిగడ్డ బరాజ్ నుంచి కిందికి విడుదల చేసే వరదతో దిగువన ఉన్న భాగాలకు నష్టం కలగకుండా నీటి వేగాన్ని తగ్గించడానికి కొత్త స్టిల్లింగ్ బేసిన్ల నిర్మాణం, పునాదుల కింద నుంచి నీటి ప్రవాహాన్ని నివారించడానికి కట్ఆఫ్ వాల్స్ ఏర్పాటు చేసే అంశంపై కమిటీ పలు కీలక సూచనలు చేసింది. బరాజ్‌లోని మొత్తం 85 పియర్లను కవర్ చేసే వరకు కొత్త స్టిల్లింగ్ బేసిన్‌ను పొడిగించాలని కోరింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ తరఫున సలహాదారులు కల్నల్ పరీక్షిత్ మెహ్రాతో పాటు రామగుండం సీఈ టి.శ్రీనివాస రావు గుప్తా, జాయింట్ సెక్రటరీ కె.శ్రీనివాస్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.


