
డీఎంకే వైపు డీఎండీకే చూపు
సాక్షి, చైన్నె : రానున్న 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి వైపు ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే చూపు పడ్డట్టు తెలిసింది. తమను పదే పదే అన్నాడీఎంకే మోసం చేసిన దృష్ట్యా, ఈ సారి వారికి గుణపాఠం చెప్పే దిశగా డీఎంకేకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. అందుకే దివంగత డీఎంకే నేత కరుణానిధిని పొగడ్తలతో ముంచెత్తినట్టు చర్చ జరుగుతోంది. దివంగత నేత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పార్టీ ఆవిర్భావంతో ఎదుర్కొన్న రెండవ ఎన్నికల్లోనే ప్రధాన ప్రతిపక్ష నేతగా విజయకాంత్ అవతరించారు. అయితే, అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలితతో వైరం ఆయన్ను, ఆయన పార్టీని డీలా పడేలా చేసింది. 2016లో తన నేతృత్వంలో మెగా కూటమిని ఏర్పాటు చేసినా జయలలిత హవా ముందు పాచికలు పారలేదు. ఆతర్వాత క్రమంగా పతనం వైపు సాగినా, దృడ సంకల్పంతో పార్టీని నడిపించారు. ప్రస్తుతం విజయకాంత్ జీవించి లేరు. ఆయన మరణం తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికలను డీఎండీకే ఎదుర్కొంది. అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికల్లోకి వెళ్లి, కొన్నిచోట్ల డీఎంకే కూటమికి గట్టి పోటీ ఇచ్చింది. తమ కంటూ రాష్ట్రంలో ఓటు బ్యాంక్ ఉందని, విజయకాంత్‌పై ఆ మేరకు అభిమానం ఉందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ తరచూ చాటుకుంటూ వస్తున్నారు.
ఈ సారి రూటు మార్చే దిశగా
గతంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను నమ్ముకుని రాజ్యసభ వ్యవహారంలో గానీ, కేంద్రం పదవులపరంగా తమకు అన్యాయం జరిగిందన్న వాదనను డీఎండీకే వర్గాలు తరచూ వెలుగులోకి తెస్తుంటారు. దివంగత జయలలిత హయంలో గానీ, ప్రస్తుతం పళణి స్వామి రూపంలోగానీ అన్నాడీఎంకే ద్వారా సైతం తమకు అన్యాయం జరగడంతో ఈసారి ఎన్నికల్లో రూట మార్చే దిశగా డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ ఉన్నట్టు ఆపార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అన్నాడీఎంకే, బీజేపీలకు వ్యతిరేకంగా ఈ సారి డీఎంకే కూటమిలోకి చేరి, వారు ఇచ్చే సీట్లతో సర్దుకుని ఎన్నికలను ఎదుర్కొనే దిశగా వ్యూహరచనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇచ్చిన వాగ్దానం, నమ్ముకున్న కూటమిలోని వారికి డీఎంకే న్యాయం చేస్తూ ముందుకెళ్తున్న దృష్ట్యా, వారినే నమ్ముకోవడం మంచిదన్న సూచనను ఇప్పటికే పలువురు నేతలు ప్రేమలతకు తెలియజేసినట్టు సమాచారం. ఇక డీఎంకేను పల్లెత్తి మాట అనకుంట జాగ్రత్తగా అడుగులు వేయాలని నేతలకు సంకేతాలు పంపించినట్టు డీఎండీకేలో చర్చ జరుగుతోంది. ఒక వేళ డీఎంకే తలుపులు తెరుచుకోని పక్షంలో ప్రత్యామ్నాయం మీద దృష్టి పెట్టే విధంగా విజయ్ టీవీకే వైపు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయా అనేది వేచిచూడాల్సిందే.
● ప్రేమలత రూటు మార్చేనా?