నీరుగారిన ‘ఉపాధి’ లక్ష్యం | Sakshi
Sakshi News home page

నీరుగారిన ‘ఉపాధి’ లక్ష్యం

Published Tue, Mar 26 2024 1:05 AM

- - Sakshi

ఉపాఽధి కూలీలకు 100 రోజుల పని కల్పించడంలో విఫలం

దురాజ్‌పల్లి (సూర్యాపేట) : గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లాలో మందకొడిగా సాగుతూ ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 64.89 లక్షల పనిదినాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 55లక్షల పనిదినాలు కల్పించి రాష్ట్రంలోనే 13వ స్థానంలో కొనసాగుతున్నారు. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం పూర్తి కానుండటంతో మిగిలిన 5 రోజుల్లో 9.89లక్షల పనిదినాలు పూర్తి చేయడం గగనమే. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,83,547 కుటుంబాలకు అధికార యంత్రాంగం పని కల్పించింది.

55 లక్షల పనిదినాలు పూర్తి

సూర్యాపేట జిల్లాలో ఉపాధి హామీ పనులు లక్ష్యం చేరేలా లేదు. జిల్లా పరిధిలో 475 గ్రామ పంచాయతీల వారీగా పనులు గుర్తించిన యంత్రాంగం 64.89 లక్షల పని దినాలు కూలీలకు కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టారు. జాబ్‌కార్డు ఉన్న వారందరికీ పనులు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించారు. కానీ ఇప్పటి వరకు 55లక్షల పని దినాలు పూర్తి చేసి 84.75శాతం లక్ష్యం చేరుకున్నారు.

3.46లక్షల మంది కూలీలకు పని

జిల్లాలోని 23మండలాల పరిధిలో జాబ్‌కార్డు కలిగిన కుటుంబాలు 2,61,192 ఉండగా 5,69,350 మంది కూలీలు ఉన్నారు. 2023–24 సీజన్‌లో 1,83,547 కుటుంబాల్లో 3,46,086 మంది కూలీలకు పని కల్పించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 159.17 కోట్ల రూపాయలు ఉపాధి హామీలో ఖర్చు చేయగా 96.45 కోట్ల రూపాయలు కూలీలకు వేతనంగా చెల్లించారు.

ప్రస్తుతం 34,881 మందికి పని

జిల్లాలో ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య ఈ నెలలో రికార్డు స్థాయిలో పెరిగింది. గత నెలతో పోలిస్తే ఈ నెలలో సుమారు 15 వేలకుపైగా కూలీలు పెరిగారు. జిల్లాలో 475 గ్రామపంచాయతీల్లో ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. ఆయా మండలాల్లో ఉపాధి హామీ పనులకు హాజరైన కూలీలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 34,881 మంది కూలీలు హాజరు అవుతున్నారు. ప్రస్తుతం కూలీల హాజరు ప్రకారం రాష్ట్రంలో జిల్లా 7వ స్థానంలో ఉన్నది.

1682 కుటుంబాలకే వంద రోజుల కల్పన..

జిల్లా వ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కేవలం 1,682 కుటుంబాలకు వంద రోజుల పని కల్పించారు. రెండేళ్ల క్రితం వరకు జిల్లాలో ఏటా 20 వేలకుపైగా కుటుంబాలకు వంద రోజులపాటు పనులను కల్పించగా, గత రెండేండ్లుగా కూలీల సంఖ్య ఐదు వేలకూ పెరుగకపోవడం గమనార్హం.

ఫ 64.89 లక్షల పనిదినాలకు 55 లక్షల పనిదినాలు పూర్తి

ఫ కేవలం 1,682 కుటుంబాలకే వంద రోజుల పని

ఫ జాబ్‌ కార్డులను సద్వినియోగం చేసుకోలేక పోతున్న కూలీలు

Advertisement
Advertisement