హోలీ శుభాకాంక్షలు | Sakshi
Sakshi News home page

హోలీ శుభాకాంక్షలు

Published Mon, Mar 25 2024 1:25 AM

- - Sakshi

నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదివారం హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు మోదుగుపూల వంటి సహజమైన రంగులతో హోలీ జరుపుకోవాలని సూచించారు.

టిప్పర్‌ వాహనంలో మంటలు

దేవరకొండ: టిప్పర్‌ వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో దాదాపు రూ.3లక్షల మేర నష్టం వాటిల్లింది. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టిప్పర్‌ వాహనానికి మరమ్మతులు చేయించేందుకు దేవరకొండ నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మండల పరిధిలోని శేరిపల్లి గేటు సమీపంలోకి రాగానే మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్‌ వాహనాన్ని నిలిపి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పాలు. అప్పటికే టిప్పర్‌ వాహనం టైర్లు కాలిపోయాయి. ఈ ఘటనలో రూ.3లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశామని ఫైర్‌ ఎస్‌ఐ రాజునాయక్‌ తెలిపారు.

కారు ఢీకొని వృద్ధురాలు మృతి

కొండమల్లేపల్లి : కారు ఢీకొని వృద్ధురాలు మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దేవరకొండలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి చందంపేట మండలంలోని వైజాక్‌ కాలనీకి వెళ్తున్న కారు మార్గమధ్యలో దేవరకొండలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద ఆర్టీసీ బస్సు కోసం వేచి ఉన్న డిండి మండలంలోని దాసరినెమలిపూర్‌ గ్రామానికి చెందిన రమావత్‌ మేరి(65)తో పాటు మరో ఇద్దరిని ఢీకొట్టింది. ప్రమాదంలో మేరి అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతురాలి మనుమడు రమావత్‌ శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నర్సింహులు తెలిపారు.

జాతీయస్థాయిలో

అనుముల కీర్తిని పెంచాలి

హాలియా : జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారులు తమ నైపుణ్యాలతో అనుముల మండల కీర్తి ప్రతిష్టలను పెంచాలని ఏకే ఫౌండేషన్‌ చైర్మన్‌ కట్టెబోయిన అనిల్‌కుమార్‌ అన్నారు. ప్రపంచ క్రీడాదినోత్సవం సందర్భంగా ఏకే ఫౌండేషన్‌ చైర్మన్‌ అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆకాంక్ష ప్లేవే స్కూల్‌లో జాతీయస్థాయి క్రీడాకారులైన ఎస్‌కె అయేషా, ఎండీ ఆపషా, ఆవుల కార్తీక్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి మాట్లాడారు. కబడ్డీ క్రీడాకారులకు తన వంతుగా ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. క్రీడాకారులు విద్యతో పాటు క్రీడారంగంలో రాణిస్తూ జిల్లా, రాష్ట్రం, దేశానికి మంచి పేరు ప్రతిష్టలను తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సీనియర్‌ కబడ్డీ క్రీడాకారులు యడవెల్లి రాంబాబు, చనగల ఎల్లయ్య, పీఈటీ కాకునూరి రమేష్‌గౌడ్‌, అనుముల మండల వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శివాజీ, మంగ్యానాయక్‌, కబడ్డీ కోచ్‌ ఎండీ అన్వర్‌, పీఈటీలు అనిల్‌, లింగస్వామి, సతీష్‌, రాము, నరేష్‌, రాజేష్‌ తదితరులు ఉన్నారు.

బీసీలను మోసం చేసిన రాజకీయ పార్టీలు

మిర్యాలగూడ టౌన్‌ : నల్లగొండ పార్లమెంట్‌ టికెట్‌ కేటాయింపులో ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేశాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్‌ అన్నారు. ఆదివారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నల్లగొండ పార్లమెంటు టికెట్లను బీసీలకు కాకుండా కాంగ్రెస్‌ పార్టీ నుంచి కుందూరు రఘువీర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డిలకు ఈ ప్రధాన రాజకీయ పార్టీలు అగ్రవర్ణాలకు కేటాయించి బీసీలను తీవ్రంగా మోసం చేశాయని ఆరోపించారు. ప్రతి ఎన్నికల్లో ఆ రాజకీయ పార్టీలు సీట్ల వద్దకు వచ్చే సరికి సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కుతున్నాయన్నారు. బీసీలకు సీట్ల కేటాయింపులో మోసం చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీసీలను కోరారు.

Advertisement
Advertisement