చెక్‌పోస్టుల్లో నిఘా పటిష్టం | Sakshi
Sakshi News home page

చెక్‌పోస్టుల్లో నిఘా పటిష్టం

Published Tue, Mar 26 2024 1:25 AM

- - Sakshi

శ్రీకాకుళం క్రైమ్‌ : ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూస్తామని, సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల్లో నిఘా పటిష్టం చేస్తున్నామని జిల్లాకు కొత్తగా వచ్చిన స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో(సెబ్‌) జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీ), అదనపు ఎస్పీ డి.గంగాధరం అన్నారు. జిల్లాకేంద్రాన్ని ఆనుకొని ఫరీదుపేటలో ఉన్న జిల్లా సెబ్‌ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

సాక్షి : ఎన్నికల సమయంలో జిల్లాకు వచ్చారు. ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తారు?

అధికారి : అంతర్‌రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి అక్రమ మద్యం, సారాయి మన ఏపీలోకి రాకుండా ప్రధానంగా చెక్‌ పోస్టుల వద్ద నిఘా పటిష్టం చేస్తాం. ఆ దారుల్లో వాచ్‌ రూట్‌ వెహికల్స్‌ తిరిగేలా చూస్తాం. అంతర్గత రహదారుల్లో బోర్డర్‌ పోలీస్‌ వెహికల్స్‌ డేఅండ్‌ నైట్‌ తిరిగేలా చేసి అక్రమ రవాణాను అడ్డుకుంటాం. ఎన్‌డీపీఎస్‌ (నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌) యాక్ట్‌ ప్రకారం మాదక ద్రవ్యాల రవాణాను నిరోధిస్తాం. లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ రాత్రి సమయాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తాం.

సాక్షి : జిల్లా సెబ్‌ పరిధిలో ఎన్ని స్టేషన్లు ఉన్నాయి. చెక్‌పోస్టుల మాటేమిటి?

అధికారి : జిల్లాలో 12 వరకు సెబ్‌ స్టేషన్లు ఉన్నా యి. డివిజన్లుగా చూసుకుంటే పలాస, శ్రీకాకుళం ఉన్నాయి. పలాస డివిజన్‌లో పలాస, సోంపేట, ఇచ్ఛాపురం, టెక్కలి, కోటబొమ్మాళి, కొత్తూరు, పాతపట్నం ఉండగా దీని కి ఇన్‌చార్జిగా ఐ.ఎ.బేగం (ఎన్‌ఫోర్సు సూపరింటెండెంట్‌) వ్యవహరిస్తారు. శ్రీకాకుళం డివిజన్‌లో శ్రీకాకుళం, నరసన్నపేట, ఆమదాలవలస, పొందూరు, రణస్థలంలు ఉండగా ఇన్‌చార్జిగా ఈఎస్‌ తిరుపతినాయుడు ఉన్నారు. చెక్‌పోస్టుల విషయానికొస్తే సెబ్‌ పరంగా పురుషోత్తపురం, వసుంధరలో ఉన్నాయి.

సాక్షి : ఒడిశా మద్యాన్ని ఇక్కడకు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. దీన్ని ఎలా నిరోధిస్తారు?

అధికారి : ఇప్పటికే ఐడీ లిక్కర్‌ పాయింట్లను గుర్తించాం. వాటిని సీజ్‌ చేయాలని అధికారులను సూచించాం.

సాక్షి : జిల్లా ప్రజలకు ఎన్నికల దృష్ట్యా మీరిచ్చే సూచన?

అధికారి : ప్రలోభాలకు లొంగి అక్రమంగా నగదు, మద్యం తరలించాలనే ఉద్దేశంతో లేనిపోని రిస్క్‌లు చేయకండి. ఇలాంటి విషయాల్లో పట్టుబడితే కేసుల్లో ఇరుక్కుంటారు. అధికారులు కూడా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి.

సెబ్‌ జేడీ డి.గంగాధరం

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు

సెబ్‌ జాయింట్‌ డైరెక్టర్‌,

అదనపు ఎస్పీ డి.గంగాధరం

1/1

Advertisement
Advertisement