జట్టు కోసం ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తెలిపాడు. ప్రస్తుతం తిలక్ వర్మ భారత టీ20 జట్టులో ఎక్కువగా ఐదు లేదా ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూనే బ్యాటర్‌గానూ తన విలువను చాటుతూ వస్తున్నాడు.
వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన తర్వాత ఆటగాడిగా తన బాధ్యత మరింత పెరిగినట్లయింది. తన కొత్త పాత్రలోని సవాళ్లను అధిగమించడానికి.. నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంతో పాటు మానసికంగా సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. శనివారం రాత్రి వెస్టిండీస్‌తో వర్షం కారణంగా ఐదో టీ20 రద్దయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మ్యాచ్ రద్దు అనంతరం తిలక్ వర్మ మాట్లాడుతూ.. ‘‘బ్యాటింగ్‌లో మూడోస్థానం నుంచి ఐదు లేదా ఆరు స్థానాలకు మారడం అంత సులభం కాదు. ఇది కొంచెం సవాలుతో కూడుకున్నదే. ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నామంటే ఫినిషర్‌గా మ్యాచ్‌ల్లో స్కోరును పెంచడం (తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్), ఎలా ముగించాలి (రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్) అనే దానిపై ఒత్తిడి ఉండడం సహాజం.
అయితే వ్యక్తిగతంగా నాకు మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం సులభంగా ఉంటుంది. కానీ జట్టులో ఆయా కాంబినేషన్ల కోసం నేను ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సి వస్తోంది. తొలి రెండు స్థానాలు ఓపెనింగ్ కాంబినేషన్ ఉంది. ఇక ఇషాన్ కిషన్ మూడో స్థానంలో అద్భుతంగా ఆడుతున్నాడు. నాలుగో స్థానంలో కెప్టెన్ శ్రేయస్ ఉన్నాడు. వాళ్లంతా అద్బుతంగా ఆడుతుండడంతో నా స్థానాన్ని త్యాగం చేయడం తప్ప మరో మార్గం లేదు.
అంతేకాదు బ్యాటింగ్ స్లాట్‌లో ఐదో స్థానం నుంచే ఖాళీ ఉండడంతో జట్టు కోసం ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇటీవలే చాలా మ్యాచ్‌ల్లో ఐదు లేదా ఆరో స్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చి సఫలమయ్యాను. కాబట్టి ఈ స్థానాల్లో కూడా రాణించగలను అనే గట్టి నమ్మకం ఏర్పడింది.
లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం పెను సవాల్‌తో కూడుకున్న పని. బ్యాటింగ్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి, నా షాట్ల పరిధిని, నైపుణ్య స్థాయిని మెరుగుపరుచుకోవడం కోసం నెట్స్‌లో అవిశ్రాంతంగా సాధన చేస్తున్నా. ఫినిషర్‌గా బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు గరిష్ఠంగా 5 లేదా ఆరు ఓవర్లు మాత్రమే మిగిలి ఉంటాయి.
ఈ సమయంలో వేగంగా ఆడుతూనే నా తర్వాతి బ్యాటర్ల సహకారంతో ఇన్నింగ్స్‌ను నిర్మించాల్సి ఉంటుంది. ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు మూడో స్థానం నుంచి ఆరో స్థానం వరకు ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా ఆడగలిగే సత్తాను అలవరుచుకున్నాను.’’ అని ముగించాడు.
ఇక తిలక్ వర్మ విండీస్‌తో టీ20 సిరీస్‌లో 4 ఇన్నింగ్స్‌ల్లో 122 పరుగులు సాధించాడు. అంతకముందు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న టీమిండియా, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను 2-2తో సమం చేసింది.
ఇదీ చదవండి:


