స్టీల్‌ స్మిత్‌... | Steve Smith becomes fourth Australian player to cross 10000 runs milestone | Sakshi
Sakshi News home page

స్టీల్‌ స్మిత్‌...

Jan 30 2025 3:55 AM | Updated on Jan 30 2025 3:55 AM

Steve Smith becomes fourth Australian player to cross 10000 runs milestone

సుదీర్ఘ ఇన్నింగ్స్‌లకు చిరునామా

10 వేల పరుగుల క్లబ్‌లోకి ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌

అంచెలంచెలుగా అత్యున్నత స్థాయికి ఎదిగిన వైనం  

లెగ్‌ స్పిన్నర్‌గా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఆ కుర్రాడు... క్లిష్ట సమయాల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోషన్‌ పొందాడు. చిత్రవిచిత్రమైన స్టాన్స్‌తో ప్రత్యర్థి బౌలర్లను తికమక పెట్టడమే పనిగా పెట్టుకున్న అతడు... సుదీర్ఘ ఇన్నింగ్స్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు. 

‘బాల్‌ ట్యాంపరింగ్‌’ వివాదంతో ఏడాది పాటు ఆటకు దూరమైనా... తిరిగి వచ్చాక తన పరుగుల దాహం తీరనిదని నిరూపించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో రెండు వేర్వేరు దేశాలపై 10కిపైగా సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్‌గా రికార్డుల్లోకి ఎక్కిన ఆ ప్లేయర్‌... తాజాగా మరో ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. 

సుదీర్ఘ ఫార్మాట్‌లో 10,000 పరుగులు పూర్తి చేసుకున్న 15వ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మనం ఇంత సేపు చెప్పుకున్నది ఆస్ట్రేలియా బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ గురించే. శ్రీలంకతో తొలి టెస్టు ద్వారా 10 వేల పరుగుల మైలురాయిని దాటిన నాలుగో ఆస్ట్రేలియా ప్లేయర్‌పై ప్రత్యేక కథనం...  

సాక్షి క్రీడా విభాగం 
టెక్నిక్‌లో విరాట్‌ కోహ్లిని సమం చేయలేకపోయినా... నిలకడలో జో రూట్‌ని తలపించకపోయినా... క్లాసిక్‌ షాట్‌లలో కేన్‌ విలియమ్సన్‌తో పోటీ పడలేకపోయినా... భారీగా పరుగులు చేయడంలో మాత్రం స్టీవ్‌ స్మిత్‌ ఈ ముగ్గురికి ఏమాత్రం తీసిపోడు. 

ఆధునిక క్రికెట్‌లో ‘ఫ్యాబ్‌–4’గా గుర్తింపు తెచ్చుకున్న ఈ నలుగురిలో ఇప్పటికే ఇంగ్లండ్‌ మాజీ సారథి రూట్‌ (12,972) పది వేల పరుగుల మైలురాయి దాటగా... శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు ద్వారా 35 ఏళ్ల స్టీవ్‌ స్మిత్‌ (10,103) ఈ క్లబ్‌లో చేరాడు. 

న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ విలియమ్సన్‌ (9,276), భారత మాజీ సారథి కోహ్లి (9,230) ఈ జాబితాలో కాస్త వెనక ఉన్నారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో భారీగా పరుగులు చేయడం అలవాటుగా మార్చుకున్న స్మిత్‌... 115వ టెస్టులో 10 వేల పరుగుల మైలురాయిని దాటాడు. 

‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’లో భాగంగా భారత్‌పైనే స్మిత్‌ ఈ మార్క్‌ అందుకుంటాడు అనుకుంటే... సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగుల వద్ద అవుటై... 9,999 పరుగుల వద్ద నిలిచిపోయాడు. గతంలో ఆస్ట్రేలియా నుంచి 10 వేల పరుగుల మైలురాయి దాటిన అలెన్‌ బోర్డర్, స్టీవ్‌ వా సిడ్నీలోనే ఈ చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించగా... తాజాగా స్మిత్‌ గాలే స్టేడియంలో ఆ జాబితాలో చేరాడు. 

55 కంటే ఎక్కువ సగటుతో... 
మ్యాచ్‌ల సంఖ్య పరంగా చూసుకుంటే స్మిత్‌ 115వ టెస్టులో 10 వేల పరుగుల మైలురాయి దాటి... సంగక్కరతో కలిసి వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. బ్రియాన్‌ లారా 111వ టెస్టులోనే ఈ మార్క్‌ దాటి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇన్నింగ్స్‌ల పరంగా స్మిత్‌ (205) ఐదో స్థానంలో ఉన్నాడు. లారా (195 ఇన్నింగ్స్‌లు), సచిన్‌ టెండూల్కర్‌ (195 ఇన్నింగ్స్‌లు), కుమార సంగక్కర (195 ఇన్నింగ్స్‌లు), రికీ పాంటింగ్‌ (196 ఇన్నింగ్స్‌లు) ముందున్నారు. 

ఇక టెస్టు క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న వారిలో స్మిత్‌ మూడో అత్యుత్తమ సగటు (56.44) నమోదు చేసుకున్నాడు. పాంటింగ్‌ (58.72), టెండూల్కర్‌ (57.61) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కెరీర్‌లో తొలి 20 టెస్టుల్లో దాదాపు లెగ్‌స్పిన్నర్‌గానే జట్టులో చోటు దక్కించుకున్న స్మిత్‌... ఆ తర్వాత ఆడిన 50 టెస్టుల్లో తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటాడు. 

వరుసగా 78వ టెస్టు మ్యాచ్‌లో 55 కంటే ఎక్కువ సగటుతో బ్యాటింగ్‌ చేసిన తొలి ప్లేయర్‌గా స్మిత్‌ రికార్డుల్లోకెక్కాడు. సచిన్‌ వరుసగా 65 టెస్టుల్లో 55కు పైగా సగటుతో బ్యాటింగ్‌ చేశాడు. 2015లో చివరిసారి స్మిత్‌ సగటు 55 కంటే తక్కువ నమోదైంది. ఆ తర్వాత భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతూ ముందుకు సాగిన స్మిత్‌ రికార్డులు తిరగరాయడమే పనిగా పెట్టుకున్నాడు.  

గోడకు కొట్టిన బంతిలా... 
అటు ఇంగ్లండ్‌తో యాషెస్‌ సిరీస్, ఇటు భారత్‌తో ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’లో పరుగుల వరద పారించిన స్మిత్‌... దశాబ్ద కాలానికి పైగా ఆసీస్‌ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. తీవ్ర ఒత్తిడితో కూడుకున్న ఈ రెండు సిరీస్‌ల్లోనూ స్మిత్‌ తనదైన ముద్ర వేశాడు. చాన్నాళ్లుగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తూ వస్తున్న స్మిత్‌... ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ రిటైర్మెంట్‌ తర్వాత ఇన్నింగ్స్‌ ఆరంభించేందుకు కూడా వెనుకాడలేదు. 

ఆసీస్‌ తరఫున వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడి జట్టును గెలిపించడమే తన లక్ష్యమని గతంలో పలుమార్లు వెల్లడించిన స్మిత్‌... దక్షిణాఫ్రికా సిరీస్‌లో ‘బాల్‌ ట్యాంపరింగ్‌’తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ సంఘటన అనంతరం తన తప్పేం లేదని చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చిన స్మిత్‌... నిషేధం ముగించుకొని తిరిగి వచ్చాక ఇతర ఆటగాళ్ల సారథ్యంలోనూ అంతే నిబద్ధతతో ఆడాడు. 

గోడకు కొట్టిన బంతిలా విజృంభించి విమర్శించిన వాళ్ల నోళ్లు మూయించాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌పై ఇప్పటి వరకు 12 శతకాలు బాదిన స్మిత్‌... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో సెంచరీని కలుపుకుంటే టీమిండియాపై 11 శతకాలు కొట్టాడు. 

రెండు వేర్వేరు జట్లపై 10కి పైగా టెస్టు సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్‌ స్మిత్‌ మాత్రమే అంటే అతడి నిలకడ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంటా బయటా అనే తేడా లేకుండా పరుగుల దాహంతో దూసుకుపోతున్న స్మిత్‌ ఇదే జోరు కొనసాగిస్తే... అతడి ఖాతాలో మరిన్ని రికార్డులు చేరడం ఖాయమే! 

Advertisement
 
Advertisement
Advertisement