source: X
న్యూజిలాండ్-ఏతో జరగనున్న మూడు మ్యాచ్‌ల అనధికారిక సిరీస్‌కు ముందు భారత-ఏ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుషాగ్రా జట్టులోకి వచ్చాడు.
ఇటీవల జరిగిన ఇరానీ కప్ మ్యాచ్‌లో పంత్‌కు గాయమైంది. టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా భావిస్తున్న ఈ సిరీస్‌కు పంత్ ఎంపిక కూడా ఫిట్‌నెస్ అనుమతులకు లోబడే జరిగింది. పంత్ మూడో మ్యాచ్‌లో ఆడటంపై మరో ప్రకటన త్వరలో వెలువడుతుంది.
కాగా, న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు ముందు భారత్-ఏ, న్యూజిలాండ్-ఏ జట్ల మధ్య అనధికారిక టెస్ట్ సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ అక్టోబర్ 24న, రెండో మ్యాచ్ అక్టోబర్ 31న, మూడో మ్యాచ్ నవంబర్ 7న మొదలవుతాయి.
ఈ సిరీస్ కోసం భారత-ఏ జట్టును కొద్ది రోజుల కిందటే ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ధ్రువ్ జురెల్ ఎంపికయ్యాడు. ఈ జట్టులో పంత్, జురెల్‌తో పాటు భారత టెస్ట్ జట్టు రెగ్యులర్ సభ్యులు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కూడా అవకాశం దక్కింది.
అప్‌డేటెడ్ భారత్-ఏ జట్టు
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ స్మరణ్, ధ్రువ్ జురెల్ (కెప్టెన్, వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, ఔకిబ్ నబీ, ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్, మానవ్ సుతార్, ముఖేశ్ చౌదరి, సాయి సుదర్శన్, యశ్ రాథోడ్, ముఖేశ్ కుమార్, కుమార్ కుషాగ్రా (తొలి రెండు మ్యాచ్‌లకు)
ఇదిలా ఉంటే, భారత్, న్యూజిలాండ్-ఏ జట్ల మధ్య సిరీస్ ముగిశాక భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ మొదలవుతుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ నవంబర్ 19న మొదలుకానుండగా.. రెండో టెస్ట్ నవంబర్ 27న ప్రారంభం కానుంది. టెస్ట్ సిరీస్‌కు ముందు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 5 టీ20లు, 5 వన్డేల భారీ సిరీస్‌లు జరుగనున్నాయి.
సూపర్ ఫామ్‌లో కుషాగ్రా
21 ఏళ్ల కుషాగ్రా ప్రస్తుతం రెడ్‌బాల్ క్రికెట్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. తన చివరి మూడు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో రెండుసార్లు శతకాలు సాధించాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్‌తో పాటు పుదుచ్చేరిలో ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లోనూ సెంచరీ నమోదు చేశాడు.
ఇదీ చదవండి: విధ్వంసం సృష్టించిన రాహుల్ ద్రవిడ్ తనయుడు


