
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 29) జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఐపీఎల్‌లో ఆర్సీబీకి ఇది నాలుగో ఫైనల్ అవుతుంది. గడిచిన మూడు సందర్భాల్లో ఈ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ఆర్సీబీ ఫైనల్‌కు చేరిన సీజన్లు..
2009- డెక్కన్ ఛార్జర్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటమి
2011- సీఎస్‌కే చేతిలో 58 పరుగుల తేడాతో ఓటమి
2016- ఎస్‌ఆర్‌హెచ్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమి
2025- ?
కాగా, ఈ సీజన్‌లో ఆర్సీబీ ఫైనల్‌కు చేరాక ఓ ఆసక్తికర విషయం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రతి సీజన్‌లో ఈ సాలా కప్ నమదే అనే ఆర్సీబీ అభిమానులకు ఇది ఊపునిచ్చే అంశం. అదేంటంటే.. 2018 నుంచి క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టే టైటిల్ గెలిచింది. ఈ విషయం తెలిసి ఆర్సీబీ అభిమానులు ఉబ్బితబ్బిబవుతున్నారు. ఈ ఒక్క సెంటిమెంట్ చాలు మేము ఈ యేడు కప్ కొడతామని చెప్పడానికంటూ చాటింపు చేసుకుంటున్నారు.
సెంటిమెంట్ విషయాన్ని పక్కన పెడితే, ఈ యేడు ఆర్సీబీకి టైటిల్ గెలిచే జట్టుకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఆర్సీబీ ఈ సీజన్‌లో గత సీజన్లకు చాలా భిన్నంగా కనిపిస్తుంది. టైటిల్ గెలవాలన్న కసి ఆ జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిలో ఉంది. అందుకు తగ్గట్టుగానే వారి ప్రదర్శనలు కూడా ఉన్నాయి.
పైపెచ్చు ప్రతి సీజన్‌లో వీక్‌గా కనిపించే ఆర్సీబీ బౌలింగ్ విభాగం ఈ సీజన్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. నిన్న జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో అది నిరూపితమైంది. ఇదే జోరును ఆర్సీబీ బౌలర్లు ఫైనల్ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తే, ఆ జట్టును టైటిల్ గెలవకుండా ఎవరూ ఆపలేరు.
ఈ సారి ఆర్సీబీకి పటిష్టమైన జట్టుతో పాటు సెంటిమెంట్లు కూడా వర్కౌటయ్యేలా ఉన్నాయి. క్వాలిఫయర్-1 సెంటిమెంట్‌తో పాటు విరాట్ కోహ్లి జెర్సీ నంబర్ సెంటిమెంట్ కూడా ఆ జట్టుకు ఈ సారి కలిసొచ్చేలా ఉంది. కోహ్లి జెర్సీ నంబర్ 18, ఐపీఎల్ సీజన్ సంఖ్య కూడా 18.
2018 నుంచి క్వాలిఫయర్-1 గెలిచిన జట్లు, టైటిల్ గెలిచిన జట్ల వివరాలు..
2018- క్వాలిఫయర్-1 విజేత సీఎస్‌కే- టైటిల్ విజేత కూడా సీఎస్‌కేనే
2019- క్వాలిఫయర్-1 విజేత ముంబై ఇండియన్స్- టైటిల్ విజేత కూడా ముంబై ఇండియన్సే
2020- క్వాలిఫయర్-1 విజేత ముంబై ఇండియన్స్- టైటిల్ విజేత కూడా ముంబై ఇండియన్సే
2021- క్వాలిఫయర్-1 విజేత సీఎస్‌కే- టైటిల్ విజేత కూడా సీఎస్‌కేనే
2022- క్వాలిఫయర్-1 విజేత గుజరాత్- టైటిల్ విజేత కూడా గుజరాతే
2023- క్వాలిఫయర్-1 విజేత సీఎస్‌కే- టైటిల్ విజేత కూడా సీఎస్‌కేనే
2024- క్వాలిఫయర్-1 విజేత కేకేఆర్- టైటిల్ విజేత కూడా కేకేఆరే
2025- క్వాలిఫయర్-1 విజేత ఆర్సీబీ- టైటిల్ విజేత..?